Rashtriya Vanavsen: హనుమంతుడిపై వ్యాఖ్యలు.. రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు..
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:01 AM
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా ప్యాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై పలు వ్యాఖ్యలు చేశారు. రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారణాసి ఈవెంట్ సందర్భంగా హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమౌళిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
వారణాసి ఈవెంట్ సందర్భంగా వ్యాఖ్యలు..
నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి, మహేష్ బాబు సినిమా నేమ్ రివీలింగ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా సాంకేతిక సమస్య తలెల్తింది. రాజమౌళి బాధతో పాటు అసహనానికి గురయ్యారు. స్టేజి మీద ఆయన మాట్లాడుతూ.. ‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడుతూ..
‘టెన్షన్ పడకు. అంతా హనుమ చూసుకుంటాడు. వెనకుండి నడిపిస్తాడు’ అన్నారు. కానీ, సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినపుడు ఇలాగేనా నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. కానీ, ఎందుకిలా అయిందని నాకు కోపం వచ్చింది’ అని అన్నారు.
పేరుపై వివాదం..
వారణాసి టైటిల్‌పై కూడా వివాదం నెలకొంది. ఫిల్మ్ చాంబర్‌లో వారణాసి టైటిల్‌పై ఫిర్యాదు నమోదు అయింది. ఆ టైటిల్ తమకు ఎప్పుడో రిజిస్టర్ అయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఇవి కూడా చదవండి
మీ జీవితంలో చెడు రోజులు వస్తున్నాయని సూచించే సంకేతాలు ఇవే.!
భారీ ఎన్ కౌంటర్.. పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి.!