Parkinson Disease: వదలని వణుకు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:08 AM
పార్కిన్సన్స్ వ్యాధి మెదడులో డోపమైన్ కణాల నష్టంతో కలిగే నాడీ రుగ్మత. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్సలు, మందులు ద్వారా రిగణించబడతాయి, కానీ పూర్తి నయం లేదు.

పైబడే వయసుతో వేధించే నాడీసంబంధ రుగ్మతల్లో పార్కిన్సన్స్ ఒకటి. పెద్దలను వేధించే ఈ వ్యాధి, చికిత్సల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
ప్రధానంగా డోపమైన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే మెదడులోని నడీకణాల క్షీణతతో ఈ నాడీ రుగ్మత తలెత్తుతుంది. మెదడులో ఉత్పత్తయ్యే డోపమైన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ కండరాల కదలికలను నియంత్రించే సంకేతాల సరఫరాకు సహాయపడుతుంది. ఈ నాడీకణాలు దెబ్బతిన్నప్పుడు, శరీర కదలికలను సమన్వయపరిచే, నియంత్రించే మెదడు సామర్థ్యం కుంటుపడుతుంది. దాంతో కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించడం మొదలుపెడతాయి. అవేంటంటే...
కదలికలతో సంబంధం ఉన్న లక్షణాలు
పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. దశలు దాటేకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే లక్షణాల తీవ్రత పెరిగే వేగం వ్యక్తుల్లో భిన్నంగా ఉంటుంది. లక్షణాలు ఏవంటే...
వణుకు: అప్రమేయంగా చోటుచేసుకునే కదలికలు ఇవి. ఒక చేతిలో, కాలు లేదా వేలిలో మొదలవుతాయి. కొందర్లో విశ్రాంతిలో ఉన్న సమయంలో కదలికలు కనిపిస్తాయి.
బ్రాడీకైనీసియా: కదలికలు క్రమేపీ తగ్గిపోయే పరిస్థితి ఇది. ఎంతో సులభమైన పనులు కూడా చేసుకోలేని స్థితి ఇది. చొక్కాకు గుండీలు పెట్టుకోవడం, నడవడం లాంటి సులభమైన పనులు కూడా కష్టంగా మారి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి.
బిగుసుకుపోవడం: కండరాలు, ప్రత్యేకించి చేతులు, కాళ్లు, మెడ పట్టుకుపోతాయి. పార్కిన్సన్ రోగుల్లో అత్యంత సాధారణ లక్షణమిది.
ఈ ఇబ్బంది నొప్పికి దారి తీస్తుంది. కదలికలు తగ్గిపోతాయి. రోజువారీ పనులు చేసుకోవడం కష్టమైపోతుంది
భంగిమ: వ్యాధి ముదిరేకొద్దీ, ఈ రోగులు సంతులనం కోల్పోతారు. దాంతో నడుస్తూ పడిపోవడం, నిలబడినప్పుడు ముందుకు లేదా వెనకకు ఒరిగిపోతూ ఉంటారు
నడక: అడుగుల మఽధ్య దూరం తగ్గిపోయి, చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటారు. నడిచేటప్పుడు చేతుల కదలికలు కూడా తగ్గిపోతాయి
కదలికలతో సంబంధం లేని లక్షణాలు
కదలికలతో సంబంధం లేని లక్షణాలు గుంభనంగా జీవన నాణ్యతను దెబ్బతీస్తాయి. ఈ లక్షణాలు ఏవంటే...
మెదడు సామర్థ్యం సన్నగిల్లడం: జ్ఞాపకశక్తి
సమస్యలు, ఏకాగ్రత నిలపలేకపోవడం, ఆలోచనలు నెమ్మదించడం
కుంగుబాటు: మెదడులోని రసాయనాలు క్రమం తప్పడం వల్ల మానసిక భావోద్వేగాల మీద అదుపు కోల్పోవడం, కుంగుబాటు, ఆందోళనలు వేధిస్తాయి
నిద్రలేమి: నిద్రలేమి, రాత్రివేళ తరచూ నిద్ర మెలకువ అయిపోవడం, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, పీడకలలు వేధిస్తూ ఉంటాయి.
జీవక్రియలు: రక్తపోటు నియంత్రణ, జీర్ణశక్తి, చమట పట్టడం లాంటి జీవక్రియలు కూడా క్రమం తప్పుతాయి. నిలబడినప్పుడు రక్తపోటు పడిపోవడం, మలబద్ధకం లేదా అధిక లాలాజలం లాంటి సమస్యలు కూడా వేధిస్తాయి.
మాట, మింగుడు సమస్యలు: ఈ వ్యాధి కండరాలను దెబ్బతీస్తుంది కాబట్టి మాట్లాడడానికీ, మింగడానికీ తోడ్పడే కండరాలు ప్రభావితమై, మాట బొంగురుగా మారుతుంది. పదాలను కూర్చడం కష్టమవుతుంది. మింగడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల అంతిమంగా ఆహారం గొంతులో అడ్డుపడే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుంది.
వ్యాధి నిర్థారణ
పార్కిన్సన్స్‌ను నిర్థారించే ఏకైక పరీక్ష అంటూ ఏదీ లేదు. వైద్య చరిత్ర, భౌతిక పరీక్షలతోనే ఈ వ్యాఽధిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలకు ఇతరత్రా రుగ్మతలను కారణం కాదని నిర్థారించుకోవడం కోసం ఎమ్మారై లేదా సిటి స్కాన్‌లు అవసరమవుతాయి.
చికిత్స ఇలా...
ఈ రుగ్మతను పూర్తిగా నయం చేసే చికిత్సలేవీ లేకపోయినప్పటికీ, లక్షణాలనూ, వ్యాధి పురోగతినీ నెమ్మదించి, జీవన నాణ్యతను పెంచే మందులు, థెరపీలు, సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.
లెవొడొపా: ఈ మందు మెదడులో డోపమైన్‌గా మారుతుంది. ఇది వణుకును తగ్గిస్తుంది.
డొపమైన్ ఎగోనిస్ట్స్: ఈ మందులు మెదడులోని డోపమైన్‌ను అనుకరిస్తాయి. పార్కిన్సన్స్ ప్రారంభ దశలో లేదా లెవొడొపాకు అదనంగా ఈ మందులు వాడుకోవాల్సి ఉంటుంది.
ఎమ్‌ఎఒ-బి ఇన్హిబిటర్స్: మెదడులో డోపమైన్ విచ్ఛిన్నమైపోకుండా నివారిస్తుంది. దీన్ని కూడా లెవొడోపాతో కలిపి వాడుకోవాలి
సిఔమ్‌టి ఇన్హిబిటర్స్: ఈ మందులు లెవొడొపా ప్రభావాన్ని పెంచుతాయి
అమాంటడీన్, యాంటీకోలినెర్జిక్స్: వణుకు, బిగదీసుకుపోవడం లాంటి లక్షణాలు తగ్గుముఖం పడతాయి.
పార్కిన్సన్స్ శరీరంలో అప్రమేయంగా చోటుచేసుకునే వణుకు ఇది. ఒక చేతిలో, కాలు లేదా వేలిలో మొదలవుతుంది. కొందర్లో విశ్రాంతిలో ఉన్న సమయంలో వణుకు కనిపిస్తుంది
డాక్టర్ రూపమ్ బోర్గోహైన్
సీనియర్ న్యూరాలజిస్ట్ అండ్ డైరెక్టర్,
పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News