Indian cinema sequels: సీక్వెల్ జోరు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:33 AM
భారతీయ చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ తీసే ట్రెండ్ బాగా పెరిగింది. తెలుగు చిత్రసీమలో తీసిన సీక్వెల్ సినిమాలే ఎక్కువగా విజయవంతం అవుతున్నాయి.

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. దర్శకుడు రాజమౌళి బాహుబలి కథను రెండు భాగాలుగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి సీక్వెల్స్ జోరు ఊపందుకుంది. సినిమా చివర్లో దానికి కొనసాగింపు ఉంటుందని హింట్ ఇచ్చి సీక్వెల్ మీద అంచనాలు పెంచుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ ట్రెండ్ అన్ని భాషల్లోనూ ఉన్నప్పటికీ తెలుగు సీక్వెల్ చిత్రాలే ఎక్కువగా విజయవంతం అవుతున్నాయి.
రాజమౌళి ‘బాహుబలి’, అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్నాయి. ఈ చిత్రాలు పాన్ ఇండియా సీక్వెల్స్‌కు దారిచూపాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ను కూడా ఇదే స్థాయిలో నిర్మించి విజయం సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల సీక్వెల్స్ కూడా మంచి విజయాలనే నమోదు చేశాయి. ‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి. దాంతో ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అంతేకాదు ‘హిట్-4’ కూడా ఉంటుందని, ఇందులో తమిళ హీరో ‘కార్తీ’ నటించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి.
‘డీజే టిల్లు’ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. దీనికి సీక్వెల్‌గా ఇటీవలె వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ‘మ్యాడ్’కు కొనసాగింపుగా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా తెలుగు ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. అలాగే ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా వచ్చిన తాజా చిత్రం ‘ఓదెల-2’. ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాలన్నీ కూడా మొదటి భాగం పాయింట్‌ని ఇంకాస్త స్ట్రాంగ్‌గా చూపించడంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాయి. టెక్నికల్‌గా, స్ర్కిప్ట్ పరంగా ప్రేక్షకులు మెచ్చేవిధంగా తీయడం వల్లనే ఈ చిత్రాలు విజయాలను అందుకోగలిగాయి. కానీ ఇతర ఇండస్ట్రీల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ఇతర దక్షిణాది చిత్రాలు
తమిళంలో ‘భారతీయుడు’కి కొనసాగింపుగా వచ్చిన ‘ఇండియన్-2’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదేవిధంగా మలయాళంలో ‘లూసిఫర్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఎంపురాన్’ కలెక్షన్ల పరంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ కథ బలహీనంగా ఉండడంతో మేకర్స్ అంచనాలు తప్పాయి. ఈ రెండు చిత్రాలను బట్టి చూస్తే స్టార్ కాస్టింగ్ కంటే బలమైన కంటెంట్ ఉన్న సీక్వెల్ చిత్రాలే ప్రేక్షకుల మన్ననలు పొందుతాయని రుజువైంది. ఈ రెండు చిత్రాల మొదటి భాగాలు సక్సెస్ అయ్యాయి. కాని సీక్వెల్స్ మెప్పించలేకపోయాయి. అయితే కన్నడలో ‘కెజిఎ్‌ఫ’కి సీక్వెల్‌గా వచ్చిన ‘కెజిఎఫ్-2’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మార్కెట్‌ని ప్రభావితం చేసింది.
బాలీవుడ్‌లో...
అటు బాలీవుడ్‌లోనూ సీక్వెల్ చిత్రాల హవా కొనసాగుతోంది. ‘క్రిష్’ సిరీ్‌సలో ఇప్పటికే మూడు చిత్రాలు విజయవంతమయ్యాయి. నాలుగో చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ‘ఆషికీ’ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మూడో చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’కు కొనసాగింపు ఉంటుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
సన్నీడియోల్ హీరోగా తెలుగు దర్శకుడు మలినేని గోపిచంద్ దర్శకత్వంలో ఇటీవలె వచ్చిన ‘జాట్’ సినిమా మంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘గదర్-2’ తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న సన్నీడియోల్ కెరీర్‌కి ‘జాట్’ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. దీంతో ఈ హీరో ఏకంగా మరో రెండు సీక్వెల్ చిత్రాలను తీయబోతున్నారు. ‘జాట్-2’తో పాటు ‘గదర్-3’, ‘బోర్డర్-2’ ప్రాజెక్టులకు రెడీ అవుతున్నారు. గత ఏడాది బాలీవుడ్‌లో విడులైన సీక్వెల్ చిత్రాలు ‘స్త్రీ-2’, ‘భూల్ భూలయ్య’ మంచి విజయం సాధించాయి. అయితే ‘కాగజ్-2’, ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా-2’ వంటి సినిమాలు నిరాశపరిచాయి.