Share News

Wild Gooseberry Dishes: వావ్‌... వాక్కాయ

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:06 AM

ఒకవైపు ఎర్రగా మరోవైపు తెల్లగా లేదంటే ఆకుపచ్చగా ఉండే వాక్కాయలను ఇష్టపడనివారు ఉండరు. ఇవి

Wild Gooseberry Dishes: వావ్‌... వాక్కాయ

ఒకవైపు ఎర్రగా మరోవైపు తెల్లగా లేదంటే ఆకుపచ్చగా ఉండే వాక్కాయలను ఇష్టపడనివారు ఉండరు. ఇవి పుల్లగా కాస్త వగరుతో నోరూరించేలా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తినే తియ్యని చెర్రీలను ఈ వాక్కాయలతోనే తయారు చేస్తారు. బేకరీ ఐటెమ్స్‌లో, స్వీట్‌ పాన్‌కు జతగా కూడా ఈ చెర్రీలను చూస్తూ ఉంటాం. ఇలాంటి వాక్కాయలతో తయారుచేసే కమ్మని రుచులు మీకోసం...

sthr.jpg

వాక్కాయ పులిహోర

కావాల్సిన పదార్థాలు

బియ్యం- రెండు కప్పులు, నూనె- అయిదు చెంచాలు, పసుపు- అర చెంచా, వాక్కాయలు- 25, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, పల్లీలు- నాలుగు చెంచాలు, పచ్చి శనగపప్పు- రెండు చెంచాలు, మినప్పప్పు- రెండు చెంచాలు, జీడిపప్పు- కొద్దిగా, ఇంగువ- చిటికెడు, పచ్చిమిర్చి- అయిదు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- ఒక చెంచా

తయారీ విధానం

  • ముందుగా బియ్యాన్ని కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక చెంచా నూనె, పావు చెంచా పసుపు వేసి పొడిపొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి. ఈ అన్నాన్ని ఒక కంచంలో వేసి చల్లారనివ్వాలి. వాక్కాయలను శుభ్రంగా కడిగి మధ్యకు కోసి లోపలి గింజలను తీసివేయాలి. మిక్సీలో వాక్కాయ ముక్కలు, మూడు పచ్చి మిర్చి, అర చెంచా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నాలుగు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ముందుగా పల్లీలు వేసి దోరగా వేపి పళ్లెంలోకి తీయాలి. తరవాత ఆవాలు, జీలకర్ర, పావు చెంచా పసుపు, ఇంగువ, ఎండు మిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, రెండు మధ్యకు చీల్చిన పచ్చి మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేపాలి. తరవాత వాక్కాయల పేస్టు వేసి బాగా కలిపి నూనె పైకి తేలేవరకూ వేయించాలి. తరవాత ఇందులో చల్లారిన అన్నం, అర చెంచా ఉప్పు, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఉప్పు సరిచూసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న వాక్కాయ పులిహోరను వేడిగా తింటే బాగుంటుంది. చల్లారాక కూడా రుచిగానే ఉంటుంది.

చిట్కాలు

  • వాక్కాయ ముక్కలను పేస్టు చేయకుండా తాలింపులో వేసుకుని కూడా పులిహోర తయారు చేసుకోవచ్చు.

  • ఈ వాక్కాయ పులిహోరలో కొద్దిగా ఆవపిండి లేదా నువ్వుల పొడి కలిపితే మరింత రుచిగా ఉంటుంది.


fsnh.jpg

వాక్కాయలతో ఊరగాయ

కావాల్సిన పదార్థాలు

తాజా వాక్కాయలు- పావు కిలో, కారం- నాలుగు చెంచాలు, ఉప్పు- మూడు చెంచాలు, ఆవపిండి- అర చెంచా, మెంతి పిండి- పావు చెంచా, పసుపు- పావు చెంచా, నూనె- అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు- పది

తయారీ విధానం

  • వాక్కాయలను ఉప్పు నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. తరవాత మంచినీళ్లు పోసి బాగా రుద్ది కడగాలి. వీటిని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. వాటిని మధ్యకు కోసి గింజలు తీసివేయాలి. ఒక్కో వాక్కాయను పొడవుగా నాలుగు ముక్కలుగా కోయాలి.

  • ఒక వెడల్పాటి గిన్నెలో వాక్కాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి. తరవాత నూనె పోసి కలపాలి. మూతపెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి. తరవాత మరోసారి ఊరగాయను బాగా కలిపి గాజు సీసాలో లేదంటే జాడీలో భద్రపరచుకోవాలి. ఇది ఆర్నెల్లు నిల్వ ఉంటుంది. వేడి అన్నం, ఉప్మా, దోశ, వడల్లోకి రుచిగా ఉంటుంది.

చిట్కాలు

  • వాక్కాయలను కోసేటప్పుడు వాటికి ఏమాత్రం తడి ఉండకూడదు. చాకు, గిన్నె కూడా పొడిగా ఉండాలి.

  • నువ్వుల నూనె లేదా పల్లీల నూనె వేసుకోవచ్చు. ఈ ఊరగాయ మీద నూనె తేలుతూ ఉండాలి.

  • రాళ్ల ఉప్పును పొడి చేసి వేస్తే ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.


HXMF.jpg

వాక్కాయ చికెన్‌

కావాల్సిన పదార్థాలు

చికెన్‌ ముక్కలు- అర కేజీ, వాక్కాయలు- పావు కేజీ, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- మూడు, నూనె- మూడు చెంచాలు, పసుపు- పావు చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, గరం మసాలా పొడి- అర చెంచా, కారం- మూడు చెంచాలు, ఉప్పు- ఒకటిన్నర చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

  • వాక్కాయలు, చికెన్‌ ముక్కలను విడివిడిగా నీళ్లతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాక్కాయలను మధ్యకు కోసి లోపలి గింజలను తీసివేయాలి. ఒక ఉల్లిపాయను సన్నగా తరగాలి. మరోదాన్ని నాలుగు బద్దలుగా కోయాలి. మిక్సీలో వాక్కాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. అలాగే మిక్సీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ బద్దలు వేసి పేస్టులా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి-ఉల్లిపాయ పేస్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి దోరగా వేపాలి. తరవాత చికెన్‌ ముక్కలు, కారం వేసి కలపాలి. గిన్నెమీద మూతపెట్టి పావుగంటసేపు మగ్గించాలి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. తరవాత ధనియాల పొడి వేసి కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టి అయిదు నిమిషాలు ఉడికించాలి. తరవాత వాక్కాయల పేస్టు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారు చేసుకున్న వాక్కాయ చికెన్‌ వేడి అన్నం, చపాతీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.

చిట్కాలు

  • చికెన్‌ ముక్కలను మరీ మెత్తగా ఉడికించకూడదు.

  • గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే అర చెంచా కార్న్‌ఫ్లోర్‌ను పావు కప్పు నీళ్లలో కలిపి... ఉడుకుతున్న కూరమీద చిలకరించాలి.

Updated Date - Aug 02 , 2025 | 03:06 AM