Agastya Leaf Benefits: అలసటకు విరుగుడు అవిసె ఆకుల టీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:54 AM
భోజన కుతూహలం గ్రంథంలో అవిసె మొక్క గురించి విశేషంగా ప్రస్తావించారు. చిక్కుడు జాతికి చెందిన ఈ

'భోజన కుతూహలం’ గ్రంథంలో అవిసె మొక్క గురించి విశేషంగా ప్రస్తావించారు. చిక్కుడు జాతికి చెందిన ఈ మొక్క ఆకులకు.. గింజలకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క మొగ్గలు పక్షి ఆకారంలో ఉంటాయి. అందువల్ల ఇంగ్లీషు వారు ఈ మొక్కను హమ్మింగ్ బర్డ్ వెజిటబుల్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో అవిసె గింజల నూనెను వాడమని అనేక మంది వైద్య నిపుణులు సిఫారుసు చేస్తున్నారు. అంతే కాదు.. అగస్త్య రసాయనం అనే ఆయుర్వేద ఔషధం ఈ ఆకులతోనే తయారవుతుంది. దీనిని అనేక వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్కకు ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.
అవిసె మొక్క ఆకులతో కూర, పప్పు, పచ్చడి చేసుకొని క్రమం తప్పకుండా తింటే తీవ్రమైన మైగ్రేన్ కూడా తగ్గుతుంది. రెటీనా సమస్యలకు ఇది మంచి మందు. ‘భావప్రకాశ’ గ్రంథంలో ఈ మొక్క ఆకులు కంటి సమస్యలన్నింటినీ తగ్గిస్తాయని పేర్కొన్నారు.
ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ఈ మొక్క పువ్వులను ముద్దగా నూరి తలకు పట్టిస్తే ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్ర పడుతుంది.
ఈ మొక్క నీరసాన్ని తగ్గించి తక్షణమే శక్తిని ఇస్తుంది. బాగా అలసిపోయినప్పుడు అవిసె ఆకులతో టీ బాగా పనిచేస్తుంది.
వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు- ఈ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి.. ఆ కషాయంలో తేనె కలిపి తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి.
అవిసె ఆకులు శరీరంలోని విషదోషాలను పోగొడతాయి. ఈ ఆకుల కషాయం వాతాన్ని.. పైత్యాన్ని అదుపు చేస్తుంది.
కడుపులో నులిపురుగులకు ఈ మొక్క ఆకులు మంచి విరుగుడు. అవిసె ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రేగులు శక్తిమంతమవుతాయి. అమిబియాసిస్ వంటి వ్యాధులున్నవారికి మంచిది.
- గంగరాజు అరుణాదేవి