Share News

Priyadarshi Interview: అందంగా ఉంటేనే నటుడు కాలేడు

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:40 AM

కామెడీ నటుడిగా కెరీర్ ప్రారంభించి, గాఢమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి తన ప్రయాణం, సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిజమైన నటుడికి కావాల్సినవి రూపం కాదు, అవగాహన, నిబద్ధత అని స్పష్టం చేశారు.

Priyadarshi Interview: అందంగా ఉంటేనే నటుడు కాలేడు

కామెడీ నటుడిగా వచ్చి... క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు... ప్రియదర్శి. ‘కోర్ట్‌’ సినిమాతో నటుడిగా ఆయన మరో మెట్టు ఎక్కారు. ఎంతోమంది అభిమానానికి... శంసలకు పాత్రుడయ్యారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియదర్శి... తన రాబోయే చిత్రాల గురించి... పరిశ్రమలో తన ప్రయాణం గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

ఎలా ఉన్నారు? ఇప్పటి దాకా జర్నీ ఎలా ఉంది?

చాలా బావుందండి. ఇల్లు, పని... ఈ రెండూ తప్ప ఇంకేం తెలియడంలేదు.

కోర్ట్‌... సినిమాకు మంచి ఆదరణ లభించింది కదా. ఎలా ఫీలవుతున్నారు?

అనూహ్యంగా అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్న జిమ్‌లో ఒక ఆవిడ వచ్చి ‘‘ధ్యాంక్యూ’’ అంది. నాకు మొదట అర్థం కాలేదు. ‘‘కోర్ట్‌’ మూవీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్‌. నాకు ఇద్దరు టీనేజ్‌ అబ్బాయిలు ఉన్నారు. వాళ్లకు చట్టపరమైన విషయాలు ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. వాళ్లకు ఈ సినిమా చూపించా..’’ అన్నారు. చాలా ఆనందంగా అనిపించింది. మగాళ్లను కూడా సరిగ్గా పెంచాలని ఒక తల్లి తాపత్రయపడటం బాగా అనిపించింది.

మీరు చేస్తున్న పాత్రలు.. మీ దగ్గరకు వస్తున్న స్ర్కిప్ట్‌ల పట్ల సంతృప్తిగా ఉన్నారా?

కథల విషయంలో నేను ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాను. నాకు వచ్చే పాత్రల పట్ల సంతృప్తికరంగానే ఉన్నాను. ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత బడ్డీ కామెడీ స్ర్కిప్ట్‌లు కొన్ని వచ్చాయి. ‘కోర్ట్‌’కు ముందు నేను కోర్టు డ్రామాలు ఏమీ చేయలేదు. లాయర్‌లాంటి పాత్ర చేసి ఉండచ్చు. కానీ ఫుల్‌ కోర్డు డ్రామా చేయలేదు. ఇది నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా నచ్చింది. చేసేశాను.


మీరు కమర్షియల్‌ సినిమాల్లో ఎక్కువ కనిపించటం లేదు కదా..!

మాస్‌ చిత్రాలు ఎక్కువగా చేయాలని అనుకోలేదు. నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ మాస్‌ సినిమాల ఆఫర్లు రాలేదు కూడా! కొన్ని ఆఫర్స్‌ వచ్చాయి. కథ నచ్చలేదు. కథ పట్ల నాకే సంతృప్తి లేకపోతే ప్రేక్షకులు ఎలా సంతృప్తి చెందుతారు? అందుకనే మాస్‌ మసాలా సినిమాలు ఎక్కువ చేయటంలేదు. అంతే కాకుండా... ప్రస్తుతం నేను చేస్తున్న పాత్రలన్నీ మాస్‌ సినిమాలకు భిన్నమైనవే కదా. అందువల్ల ‘వీడు మాస్‌ సినిమాలు చేయడు’ అనుకొని కొందరు ఆఫర్‌ కూడా చేయటం లేదేమో! ఇది నా అపోహ కూడా కావచ్చు.

dfg.jpg

‘సారంగపాణి జాతకం’ డైరక్టర్‌ ఇంద్రగంటితో పని చేయటం ఎలా అనిపించింది?

ఆయన మాస్టర్‌ క్రాఫ్ట్స్‌మన్‌ అని చెబుతా. మంచి తెలుగులో కామెడీ రాయగలిగిన అతి కొద్ది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు.

ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలు చూస్తే... సినిమా తీయటంలో ఆయనకు ఉన్న పట్టు మనకు అర్థమవుతుంది. ఇంద్రగంటి

గారితో పని చేయటం అంటే యూనివర్సిటీ రోజులకు వెళ్లినట్లు అనిపించింది. ఒకసారి రౌండ్‌టేబుల్‌ సమావేశంలాంటిది పెట్టుకొని అందరం స్ర్కిప్ట్‌ చదివాం. అది మరచిపోలేని విషయం.

అలాగే మొదటి రోజు షూటింగ్‌లో కొత్త నటీనటులను ఆయన ప్రొత్సహించిన తీరు కూడా మరచిపోలేను. ఒక గొప్ప డైరక్టర్‌ మాత్రమే నటీనటులను తనకు నచ్చిన విధంగా మలుచుకోగలుగుతాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది.


మీరు నటుడు ఎందుకయ్యారు?

చిన్నప్పటి నుంచి నాకు కదిలే బొమ్మలంటే ఇష్టం. సినిమా నాకు శక్తిని ఇస్తుంది. జీవించేటట్టు చేస్తుంది. చిన్నప్పటి నుంచి సినిమా నటుడిని అవ్వాలని ఉండేది. నా చదువు కూడా ఆ వైపే ఎంచుకున్నాను. యూనివర్సిటీలో కూడా ఎప్పుడూ ఈ ధ్యాసే ఉండేది. కొద్ది కాలం నాటకాలు వేశాను. భిక్షుగారు, అరుణ భిక్షు గారి శిక్షణవల్ల నాకు సినిమా పట్ల అవగాహన పెరిగింది.

మీపై మీ నాన్నగారి ప్రభావం ఉందా?

నా మీద మా నాన్న పులికొండ సుబ్బాచారి ప్రభావం చాలా ఎక్కువ. ఆయన సాహితీవేత్త. అనేక మంది ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. నాకు, మా చెల్లి నగజకు మంచి ఆలోచనా విధానం రావడానికి నాన్న, అమ్మ జయమ్మ ముఖ్య కారణం. అమ్మ టీచర్‌గా పని చేసేది. చిన్నప్పుడు మేము సైదాబాద్‌లో ఉండేవాళ్లం. ఇంట్లో గిన్నెల కన్నా పుస్తకాలు ఎక్కువ ఉండేవి. ఇప్పటికీ మా ఇంట్లో గిన్నెల కన్నా పుస్తకాలే ఎక్కువుంటాయి. నాన్నకి, చెల్లికి అనేక సత్కారాలు లభిస్తూ ఉండేవి. నాకన్నా వాళ్లు సాధించిందే ఎక్కువ. సినిమాలు చూసిన తర్వాత ఇంట్లో చర్చలు జరిగేవి. నాన్న విశ్లేషించేవాడు. కవి సమ్మేళనాలకు వెళ్లేవాళ్లం. 1990ల్లో హైదరాబాద్‌లో సాహితీ వాతావరణం ఇప్పటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేది. అప్పటి అనుభవాలన్నీ నటుడిగా నాకు ఎంతో ఉపకరించాయి.


సినిమాల్లోకి రావాలంటే బాడీ బిల్డింగ్‌ చేయాలి... అందంగా ఉండాలనేవి అపోహలేనా?

నటుడు ఎలా ఉండాలనే విషయంపై ప్రజల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అవి చాలా కాలంగా పేరుకుపోయిన అపోహలు మాత్రమే. అందంగా ఉంటేనో.. లేదా జిమ్‌కు వెళ్తే మాత్రమే నటుడు అవుతాడనేది నా దృష్టిలో కేవలం ఒక అపోహ. వ్యాయామం కోసమైతే జిమ్‌కు వెళ్లచ్చు. నేను కూడా వెళతాను. కానీ నటుడు కావటానికి జిమ్‌లో వ్యాయామం చేస్తే మాత్రమే చాలదు. మనం చేస్తున్న పని పట్ల అవగాహన, నిబద్ధత ఉండాలి. అప్పుడే మంచి నటుడు అవుతారు. ఈమధ్య వస్తున్న నటులలో చాలా మందికి ఈ అవగాహన ఉంది.

- సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

  • ఎప్పటి నుంచో నాకు శాంతాబయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డి గారి బయోపిక్‌ చేయాలని ఉంది. ఎప్పటికైనా ఆ అవకాశం వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాను.

  • కష్టాలు అన్ని వృత్తుల్లోనూ ఉంటాయి. అయితే సినీరంగంలో ఎదురయ్యే కష్టాలకు ఓర్పు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇందులోకి వచ్చేవాళ్లకు పరీక్షలు ఉండవు. ఎవరూ మనకు పరీక్షలు పెట్టి ‘నీ సామర్థ్యం ఇంత’ అని నిర్ణయించరు. అందువల్ల కొందరు ఆశతో ఉండిపోతూ ఉంటా రు. కొందరు పూర్తి స్థాయి నటులు కాలేక ఇక్కడే మిగిలిపోతారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 27 , 2025 | 12:40 AM