Kuchipudi Dancer: అణువణువునా నాట్యమే
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:50 AM
నాట్యం, నాట్యం నంటే నా జీవితం అనుకుంటున్న అన్విత భాస్కర్ కథ ఇది. ఆమె చిన్న వయసు నుంచి కూచిపూడి నేర్చుకొని, భవిష్యత్తులో నాట్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన మహిళా కళాకారిణి. ఈ ప్రయాణంలో ఆమె చేసిన కృషి, వ్యాధి, మరిన్ని సవాళ్లు ఆమెను మరింత బలంగా నిలిపాయి, ఇప్పుడు తన శిష్యులతో నాట్యం పంచుకుంటోంది.

బాల్యం నాట్యంతోనే మొదలైంది. ఆపై అదే జీవితం అయింది.
నటరాజ పాదాల చెంత... ఆరు దశాబ్దాల అపురూప నాట్య విన్యాసం.
ఏడు పదుల వయసులోనూ తరగని ఉత్సాహం... కూచిపూడి వైభవాన్ని
విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పం... ‘సంగీత నాటక అకాడమీ’ పుర
స్కార గ్రహీత... ‘నృత్య కిన్నెర’ అధినేత... ప్రముఖ నాట్య గురువు...
డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రితో ‘నవ్య’ మాటామంతి.
‘‘నాకు నాలుగేళ్లప్పుడు... మా అమ్మ నన్ను తీసుకువెళ్లి నాట్యంలో చేర్పించింది. అది మొదలు నర్తన నా నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. తొలినాళ్లలో కథక్, ఒడిస్సీ కూడా అభ్యసించాను. అనంతర కాలంలో కూచిపూడి మీదే దృష్టి పెట్టాను. హైదరాబాద్‌లో రవీంద్రభారతి వేదిక ప్రారంభించినప్పుడు ఒక బృందం నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆ బృందంలో నేను కూడా ఉన్నాను. పదేళ్లు వచ్చేసరికి వేదాంతం జగన్నాథశర్మ గారి దగ్గర కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించాను. నేను పుట్టింది కర్నూలులో. అమ్మానాన్నలది నెల్లూరు. మా నాన్న సెక్రటేరియట్‌లో పని చేసేవారు. దాంతో నా చిన్నప్పుడే మేం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాం. 1972లో నా డిగ్రీ పూర్తయింది. తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అందులో పని చేస్తూనే నా కూచిపూడి ప్రదర్శనలు, శిక్షణ కొనసాగింది. బ్యాంకు తరుఫున ఎన్నో ప్రదరర్శనలు ఇచ్చాను. డ్యాన్స్‌లో ఎంఏ చేయాలన్న ఉద్దేశంతో రెండేళ్లు బ్యాంకుకు సెలవు పెట్టాను. సెంట్రల్ యూనివర్సిటీలో చేరాను. కానీ, 2020లో 22 ఏళ్ల ఉద్యోగ జీవితానికి ముగింపు పలికాను. వీఆర్‌ఎస్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకొంటున్న పీహెచ్‌డీ మొదలుపెట్టాను.
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ప్రముఖ నర్తకి అలేఖ్య పుంజల నేతృత్వంలో పరిశోధన పూర్తయింది. ఊహ తెలిసినప్పటి నుంచీ నా జీవితం నాట్యంతో అనుబంధంగా సాగింది. నేను వేరు... నాట్యం వేరు కాదు. నా చదువూ అదే దారిలో సాగింది.
‘నృత్య కిన్నెర’...
పెళ్లి తరువాత నా జీవితం సరికొత్త మలుపు తీసుకుంది. ‘కిన్నెర ఆర్ట్ థియేటర్స్’ కార్యదర్శి మద్దాళి రఘురామ్‌తో 1981లో నాకు వివాహం అయింది. అప్పటికే సాంస్కృతిక రంగంలో ఉన్న ఆయన... కళాకారిణినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. అలా బంధువుల ద్వారా సంబంధం కలిసింది. ఒక అత్తమామలను చూసుకొంటూనే, ఇంటి పనులు, ఉద్యోగం, నాట్య శిక్షణ, ప్రదర్శనలు... క్షణం తీరిక ఉండేది కాదు. అన్నిటినీ సమన్వయం చేసుకొంటూ వచ్చేదాన్ని. కానీ ఏ రోజూ బాధ్యతలను భారంగా భావించలేదు. అయితే నాట్యానికి ప్రత్యేకంగా ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ‘కిన్నెర ఆర్ట్ థియేటర్స్’కు అనుబంధంగా 1984లో ‘నృత్య కిన్నెర’ నెలకొల్పాను. ఇది కేవలం కూచిపూడి నాట్యాభిలాషులకోసమే. దీని తరుఫున ఢిల్లీ, ముంబయి, విశాఖపట్టణం తదితర నగరాల్లో నాట్యోత్సవాలు ఎన్నో నిర్వహించాను. ‘తానా, ఆటా’ వేదికలపై కూడా నేను ప్రదర్శనలు ఇచ్చాను. ‘నృత్య కిన్నెర’కు 2003 నుంచి కేంద్ర సాంస్కృతిక శాఖ శాలరీ గ్రాంట్ అందిస్తోంది.
ఆసక్తి ఉంటే చాలు...
కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి, నిబద్ధత ఉంటే చాలు... శిక్షణ ఇవ్వడానికి నేను వెనకాడను. మా ఇంటి చుట్టుపక్కల పిల్లలకు, ఆర్థిక స్థోమత లేనివారికి ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తున్నాను. నా వద్దకు వచ్చేవారిని ఇంత ఇవ్వమని డిమాండ్ చేయను. ఇచ్చింది తీసుకొంటాను. ఇప్పటివరకు మూడొందల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చాను. దాదాపు యాభైమంది అరంగేట్రం అయింది. కొందరు శిష్యులు దేశవిదేశాల్లో నాట్యాలయాలు ఏర్పాటు చేశారు. ఒక అమ్మాయి ముంబయిలో ‘నృత్య కిన్నెర’ పేరుతో ఎన్నో ఏళ్లుగా ఇనిస్టిట్యూట్ నడుపుతోంది. వాళ్లందరినీ చూసినప్పుడు నా మనసు పరవశిస్తుంది. ప్రస్తుతం ముప్ఫైమంది నావద్ద కూచిపూడి అభ్యసిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేశాను. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఉన్నంతలో సాయం చేయగలిగితే అదే పదివేలు.
అవే నాకు ఊపిరి...
నాట్యమే నాకు ఊపిరి. జీవించి ఉన్నంతవరకు నాట్యాభినయం కొనసాగించాలి. సాధ్యమైనంతమందిని కూచిపూడి కళాకారులుగా తీర్చిదిద్దాలి. ఇదే నా అభిలాష. ఇప్పటికి పదిహేనుకు పైగా బాలేలకు కొరియోగ్రఫీ చేశాను. రెండు వందలకు పైగా నృత్యరూపకాలకు దర్శకత్వం వహించాను. ఎస్‌వీబీసీ వారి ‘నాద నీరాజనం’, దూరదర్శన్‌తో పాటు, దేశంలోని వివిధ నగరాలు, ఇతర దేశాల్లో జరిగిన ఉత్సవాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. మొన్న ఉగాదికి ముప్ఫై మంది శిష్యులు కలిసి ‘అలమేలుమంగ’ రూపకం వేశారు. నా డెబ్భయ్యవ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 2న రవీంద్రభారతిలో ‘మాతృదేవోభవ’ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శిస్తున్నారు.
జన్మ ధన్యమైన సందర్భం...
అరవై ఏళ్ల ఈ నాట్య ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు. ఎన్నో సవాళ్లు. ఒక మహిళగా, ఒక సంస్థను, అదీ కళాసంస్థను నిర్వహించడం అంటే ఈ రోజుల్లో అంత సులువు కాదు. కానీ కూచిపూడి నాట్యానికి పట్టం కట్టాలన్న ఒక మహత్ సంకల్పమే నన్ను నడిపిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాలు, హంస పురస్కారం, తెలుగు వర్సిటీవారి ప్రతిభ పురస్కారం, ‘యూరోపియన్ తెలుగు అసోసియేషన్’ వారి పురస్కారం... ఇలా ఎన్నో వరించాయి. అన్నిటికీ మించి గత ఏడాది కేంద్ర ప్రభుత్వ ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం నా జీవితంలోనే మధురమైన ఘట్టం. కళారంగంలో ‘పద్మ’ పురస్కారాలతో సమానమైన గౌరవం ఇది. అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది... ‘నా జన్మ ధన్యమైంద’ని.
ఆ నమ్మకమే నడిపిస్తోంది...
రెండేళ్ల కిందట నా జీవితంలో అనూహ్య కుదుపు. 108 అన్నమాచార్య కీర్తనలను మా శిష్యులతో నృత్య రూపకంగా ప్రదర్శించాలని అనుకున్నాను. అందుకోసం రిహార్సల్స్, ఇతర పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపాను. నాకు తెలియకుండానే నేను తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. దాంతో బ్రెయిన్ స్ర్టోక్ వచ్చింది. మెడ భాగంలో బ్లాక్ అయిందని వైద్యులు చెప్పారు. తరువాత పెరాలసిస్ వచ్చింది. మాట్లాడగలుగుతున్నాను కానీ... పూర్తి స్థాయిలో కదల్లేకపోతున్నాను. ప్రస్తుతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. చక్రాల కుర్చీలో కూర్చొనే ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు తీసుకున్నాను. ఎందుకంటే ఆ పురస్కారం నా కల. ఈ రెండేళ్లలో ఇలానే మా విద్యార్థులతో పది కార్యక్రమాలు నిర్వహించాను. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిని అవుతాను. నా మనోబలమే నా ధైర్యం. నా శిష్య బృందం, సన్నిహితులు, స్నేహితులు... వీరందరూ నేను కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నారు. ముఖ్యంగా పదిమందికీ కూచిపూడిని చేరువ చేయాలన్న తపన, ఆ కళారూపాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పమే నాకు నిత్య ప్రేరణ.
- హనుమా
చేయాల్సినవి ఉన్నాయి...
నేను రెండు కథల పుస్తకాలు కూడా రాశాను. ఒకటి... ‘కడదాకా కదిలి’, రెండోది ‘బామ్మ గారి కాశీయాత్ర’. స్వాతి, నవ్య వీక్లీల్లో కూడా నా నవలలు ప్రచురితమయ్యాయి. ‘నవ్య’ వీక్లీలో రాసిన ‘మౌనమే సాక్షిగా’ నవలకు రెండో బహుమతి వచ్చింది. నా మనసులో రెండు మూడు బాలేలు ఉన్నాయి. వాటిని నా శిష్యులతో చేయించాలి. ప్రముఖ నాట్య గురువులందరితో మాట్లాడి ఒక గ్రంథం రాయాలి. త్వరగా కోలుకొని మరింతమందికి శిక్షణ ఇవ్వాలి. చక్రాల కుర్చీలో ఉన్నా నా మెదడు ఎప్పుడూ కూచిపూడి చుట్టూనే తిరుగుతోంది. చూద్దాం... దైవ సంకల్పం ఎలా ఉందో!
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News