Anu Kunjumon: ఆ సంఘటనే బౌన్సర్‌గా మార్చింది
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:44 AM
కేరళలోని అను కుంజుమన్ మహిళా బౌన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, చిన్న సంఘటన కారణంగా ఆమె బౌన్సర్‌గా మారిన కథ ఇది. అనేక తునికొప్పుల ద్వారా, నిబద్ధతతో ఈ వృత్తిలో విజయవంతంగా కొనసాగుతూ, ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు.

బౌన్సర్... దాదాపుగా పురుషులదే ఆధిపత్యమైన ఈ వృత్తిని ఎంచుకోవడమే కాదు, అందులో రాణిస్తూ ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు అను కుంజుమన్. ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన ఆమె కేరళలో తొలి మహిళా బౌన్సర్‌గా గుర్తింపు పొందారు. నటిగానూ అవకాశాలు అందుకుంటున్నారు. ‘నటుడు మోహన్‌లాల్ పర్సనల్ బాడీగార్డ్’ అంటూ తన గురించి జరిగిన ప్రచారం అవాస్తవం అంటున్న 37 ఏళ్ళ అను కథ ఇది.
‘‘కొన్నాళ్ళ క్రితం ఒక ఆంగ్ల వార్తా సంస్థ మహిళా బౌన్సర్ల గురించి కథనం రూపొందిస్తూ... నన్ను ఇంటర్వ్యూ చేసింది. వారికి నా వీడియోలు కొన్ని పంపించాను. మోహన్‌లాల్‌తో నేను కలిసి ఉన్న వీడియో ఒకటి వైరల్ అయింది. నేను ఆయనకు వ్యక్తిగత బాడీగార్డ్ అనీ, సెక్యూరిటీ హెడ్ అనీ ప్రచారం జరిగింది. అది నిజం కాదు. కొచ్చిలో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో నేను బౌన్సర్‌గా పని చేశానంతే. ఏదైతేనేం... నేను ఊహించని ప్రచారం వచ్చింది. వార్తా పత్రికలు, టీవీ ఛానెల్స్ నా గురించి ఆరా తీయడం మొదలుపెట్టాయి.
అమ్మకు చేదోడుగా...
బౌన్సర్ వృత్తిలోకి నేను అనుకోకుండా వచ్చాను. నేను పుట్టి పెరిగింది కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో. నా చిన్నప్పుడే నాన్న మాకు దూరమయ్యారు. నన్ను, నా సోదరిని పెంచడానికి మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. వాటికి మేమూ అలవాటు పడ్డాం. అవే నన్ను రాటుదేల్చాయనుకుంటాను. చదువు పూర్తయ్యాక... చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మకు ఆర్థికంగా చేదోడుగా ఉండేదాన్ని. అప్పుడే ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. పెళ్ళిళ్ళ లాంటి ఈవెంట్లకు పని చేసేదాన్ని. క్రమంగా పెద్ద కార్యక్రమాలకు కూడా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో ఎదురైన ఒక సంఘటన... నా జీవితాన్ని మలుపు తిప్పింది.
కొత్త అధ్యాయం ప్రారంభించాను...
కొచ్చిలో ఒక ఉత్పత్తి ప్రచార కార్యక్రమానికి ఫొటోగ్రాఫర్‌గా వెళ్ళాను. అక్కడికి కొందరు సెలబ్రిటీలు వచ్చారు. వారిలో ఒకరి బౌన్సర్ నన్ను తోసేయడంతో... పక్కకు పడిపోయాను. అతను తన బృందంతో కలిసి వచ్చి క్షమాపణ చెప్పాడు. అలా వారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు కలుస్తూ ఉండేవారు. బౌన్సర్లుగా మహిళలు ఎందుకు ఉండరని వారిని అడిగాను. ‘‘ఫిట్‌నెస్ ఉంటే మహిళలు కూడా బౌన్సర్లు కావచ్చు. మీరు ఫిట్‌గానే ఉన్నారు కాబట్టి ప్రయత్నించండి. దేశంలో ఎక్కువమంది మహిళా బౌన్సర్లు లేరు. కానీ అవసరం చాలా ఉంది’’ అని చెప్పారు. లేడీ బౌన్సర్ కావాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. అందుకు అవసరమైన సూచనలు, సలహాలు వారి దగ్గరే తీసుకున్నాను. ఆ నిర్ణయానికి నా కుటుంబం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అలా కేరళలో తొలి మహిళా బౌన్సర్‌గా కొత్త అధ్యయాన్ని ప్రారంభించాను. మొదట్లో చిన్న చిన్న కార్యక్రమాలకు అవకాశాలు వచ్చేవి. గత మూడేళ్ళుగా పెద్ద ఈవెంట్స్‌కు బౌన్సర్‌గా వెళ్తున్నాను. వాటిలో సెలబ్రిటీల ఫంక్షన్ల నుంచి ఆడంబరంగా ఉండే పబ్ పార్టీల వరకూ ఉంటాయి. అంతేకాదు... మహిళా సెలబ్రిటీలకు, వ్యాపార ప్రముఖులకు కూడా ఎస్కార్ట్‌గా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
నిజాయితీ, నిబద్ధతతో...
నా కథ విన్నాక ఎంతోమంది మహిళలు నన్ను సంప్రతిస్తున్నారు. బౌన్సర్ కావాలనుకుంటున్నామని చెబుతున్నారు. ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. వారికి నేను చెప్పగలిగేది ఒక్కటే. బౌన్సర్ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న వృత్తి. దీనికి శరీర దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యం కూడా ఉండాలి. కొందరు దీన్ని గౌరవనీయమైన వృత్తిగా పరిగణించరు. కానీ బతకడానికి ఆదాయం ఇచ్చేదీ, చట్టవిరుద్ధం కానిదీ అయిన పనిని నిజాయితీగా, నిబద్ధతతో చేస్తే... గౌరవం దానంతట అదే వస్తుంది. నా వరకూ వ్యక్తిగతంగా ఎలాంటి చేదు అనుభవాలూ ఎదురు కాలేదు. అయితే పబ్‌లలో, పార్టీల్లో, సెలబ్రిటీ ఈవెంట్లలో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. జనం వారిపై ఎగబడడం వల్ల తొక్కిసలాటలు, ఘర్షణలు సాధారణం. అలాంటి సమయాల్లో సయమనం కోల్పోకుండా... సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఆగ్రహావేశాలు పెరగకుండా ఆపాలి. ఎవరి సూచనల కోసమో ఎదురుచూస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయి. అదృష్టవశాత్తూ... నేను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనేలా మా అమ్మ పెంచింది. అందుకే భిన్నమైన సందర్భాలను ధైర్యంగా ఎదుర్కొంటాను. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి విషయంలో వాళ్ళు నాకు అండగా ఉంటారు. ప్రతిరోజూ బౌన్సర్‌గా పని ఉండదు కాబట్టి... ఫొటోగ్రాఫర్‌గానూ కొనసాగుతున్నాను. అంతేకాదు... నటన అంటే నాకు ఆసక్తి. ‘విశేషం’, ‘పూరమ్ పూరాడమ్ పూరుడతి’ అనే సినిమాల్లో చిన్న పాత్రలు వేశాను. మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను.’’
కొచ్చిలో ఒక కార్యక్రమానికి కొందరు సెలబ్రిటీలు వచ్చారు. ఒక బౌన్సర్ నన్ను తోసేయడంతో... పక్కకు పడిపోయాను. అతను వచ్చి క్షమాపణ చెప్పాడు. అలా వారితో పరిచయం ఏర్పడింది. బౌన్సర్లుగా మహిళలు ఎందుకు ఉండరని వారిని అడిగాను. ‘‘ఫిట్‌నెస్ ఉంటే మహిళలు కూడా బౌన్సర్లు కావచ్చు. ప్రయత్నించండి’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News