Heart Treatments: గుండెకు గండం తగ్గిద్దాం
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:14 AM
గుండె చికిత్సల్లో గతంతో పోలిస్తే ఎన్నో పురోగతులు సాధించబడ్డాయి. ఇప్పుడు, కేవలం ప్రాణాలు నిలబెట్టడమే కాకుండా, గుండె పనితీరు దీర్ఘకాలంగా సక్రమంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఒకప్పటి గుండె చికిత్సలు అప్పటికప్పుడు ప్రాణాలు నిలబట్టడమే ధ్యేయంగా సాగేవి. కానీ ఇప్పుడు, కొన్ని దశాబ్దాల పాటు గుండె సమర్థంగా పని చేయడమే లక్ష్యంగా చికిత్సలు సాగుతున్నాయి. కాలానుగుణంగా గుండె చికిత్సలో సాధించిన ప్రగతి, ప్రతిభల గురించీ, హృద్రోగాల పట్ల అవగాహన పెంచుకోవలసిన అవసరం గురించీ సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ గోపీచంద్ మన్నం ఏమంటున్నారో తెలుసుకుందాం!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు గుండె చికిత్సల్లో ఎంతో పురోభివృద్ధిని సాధించాం. చికిత్సల్లో, నైపుణ్యాల్లో ఎంతో పరిణతి పొందాం! ఒకప్పుడు బైపాస్ సర్జరీ అనగానే, వైద్యుల గుండెలు గుబగుబలాడే పరిస్థితి. పరికరాలను కొనే స్థోమత లేక రక్తంలో ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్, ఆమ్లం ఏ మోతాదుల్లో ఉన్నాయో తెలుసుకోకుండా, సర్జరీకి పూనుకున్న సందర్భాలు లేకపోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైపాస్ సర్జరీతో పాటు, ఒకటికి, రెండు, మూడు కవాటాలు మార్చడం, బృహద్ధమని, జఠరిక చికిత్సలు ఎంతో సరళతరమైపోయాయి. గుండె తీసి కృత్రిమ గుండెను అమర్చగలిగేంతగా గుండె చికిత్సల్లో పరిణతి సాధించాం! ఉదాహరణకు ఎటువంటి రుగ్మతలు లేకుండా, గుండె రక్తనాళాల్లో మూడు అవరోధాలు ఏర్పడిన వ్యక్తిని, కేవలం ఐదు శాతం ముప్పుతో, ఆ సమస్య నుంచి బయటకు తీసుకురాగలిగే పరిస్థితికి చేరుకున్నాం.
అధునాతన పరికరాలతో...
గుండె సర్జరీ విజయం, గుండె పంపింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. పంపింగ్ సామర్థ్యం 65 శాతం ఉన్నప్పుడు చక్కని ఫలితాలు సాధించవచ్చు. కానీ అంతకంటే తక్కువగా 35ు పంపింగ్ సామర్థ్యం ఉన్నప్పుడు బెలూన్ పంప్ ఆసరాతో గుండెకు దన్నును పెంచే దశను అందుకున్నాం. అయితే పంపింగ్ సామర్థ్యం వెనకున్న కారణాన్ని కనిపెట్టి, దాన్ని సరిదిద్దే స్థాయికి ఇప్పుడు చేరుకోగలిగాం. రక్తప్రసరణ లోపం వల్ల గుండె మీద మచ్చ ఏర్పడినప్పుడు కూడా పంపింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ సమస్యను ఎమ్మారైలో పసిగట్టి, సరిదిద్దడం ద్వారా, బెలూన్ పంప్ ఉపయోగించే అవసరం లేకుండా, 2 నుంచి ఐదు శాతం ముప్పుతో నేడు గుండెకు చికిత్స చేయగలుగుతున్నాం.
గుండె గదులకు మరమ్మతు చేసి గుండె సామర్థ్యాన్ని కూడా పెంచగలుగుతున్నాం. గుండె కొట్టుకునే క్రమంలో అవతకవకలు ఉన్నప్పుడు, ఆ సమస్యను సరిదిద్దే ‘కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్’ పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. అలాగే మునుపు వాడుకలో ఉన్న రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ దెబ్బతినే వీలున్న బబుల్ ఆక్సిజనేటర్లకు బదులుగా మరింత సురక్షితమైన మెంబ్రేన్ ఆక్సిజనేటర్లు కూడా నేడు వాడుకలోకొచ్చాయి.
తక్కువ కోతతో, ఎక్కువ సామర్థ్యంతో...
హార్ట్ లంగ్ యంత్రాన్ని ఉపయోగించకుండానే, గుండె కొట్టుకుంటున్నప్పుడే సర్జరీని ముగించే బైపాస్ చికిత్సా విధానం కూడా అమలవుతోంది. సాధారణంగా గుండె బైపాస్ సర్జరీలో కాలి నుంచి శిరను సేకరించి గుండె దగ్గరి ధమనికి అనుసంధానించి, దాన్ని ధమనిలా ప్రవర్తించమని ఆదేశిస్తూ ఉంటాం. కానీ ఈ క్రమంలో ఆ రక్తనాళం సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఛాతీ వెనక ఉండే ధమనితో గుండె ధమనిని అనుసంధానించే సర్జరీలు చేస్తున్నాం. ధమనితో శిరను అనుసంధానించడానికి బదులుగా మరొక ధమనినే అనుసంధానించడం వల్ల మన్నిక పెరుగుతుంది. మధుమేహులకు ఛాతీ దగ్గరి ధమనికి బదులుగా, చేతిలోని ధమనిని వినియోగిస్తూ ఉంటాం. అలాగే పెద్ద కోత పెట్టే అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా రెండు చిన్న రంథ్రాలతో ధమనిని సేకరిస్తున్నాం. దీంతో కోలుకునే సమయం, నొప్పి, ఇన్‌ఫెక్షన్ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. పెరిగే వయసుతో పాటు కవాటాలు కూడా ఇరుకుగా మారి, పూడుకుపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ కవాటాలు చీరుకుపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కృత్రిమ కవాటాలను అమర్చవలసి వస్తుంది. ఇందుకోసం ఛాతీ ఎముకను కోసే అవసరం లేకుండా, పక్కటెముకల మధ్య ఉన్న జాగా ద్వారా సర్జరీని ముగించే వెలుసుబాట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో రోగి కోలుకునే సమయం తగ్గిపోతోంది. కోత తాలూకు మచ్చలు కూడా ఎబ్బెట్టుగా కనిపించవు. అలాగే కృత్రిమ కావాటాల పరంగా కూడా ఎంతో అభివృద్ధిని సాధించాం.
ప్రస్తుతం లోహపు కవాటాలు, కణజాల కవాటాలు వాడుకలోకొచ్చాయి. రెండు లీఫ్స్ కలిగిన లోహపు కవాటాలతో పాటు ఆవు గుండె పైపొరను ఒక కణజాల కవాట పొరగా కుట్టి వాడుకుంటున్నాం. వీటి మీద క్యాల్షియం పేరుకుపోకుండా ఆ పరిస్థితిని నియంత్రించే సాంకేతికతలు కూడా అందుబాటులోకొచ్చాయి. వీటితో గుండె కృత్రిమ కవాటాల ఆయుష్షు 20 ఏళ్లకు పెరిగింది. రెండోసారి, మూడోసారి గుండె సర్జరీలు చేయడం కూడా సులభతరం అయిపోయింది.
లక్షణాలు ఉన్నా, లేకున్నా...
వ్యాధిని అర్థం చేసుకునే తీరు మారడంతో, చికిత్స తర్వాత ఆ వ్యాధి తిరగబెట్టకుండా నియంత్రించే మార్గాలను కనిపెట్టగలుగుతున్నాం. సాధారణంగా గుండె చికిత్స తదనంతరం, సమస్య పూర్తిగా పరిష్కారమైపోయిందని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించేస్తూ ఉంటారు. కానీ ఇది సరికాదు. అప్పటికి సమస్యను సరిదిద్దినా, ముప్పు ఎప్పటికీ పొంచి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి గుండెకు ముప్పు తెచ్చిపెట్టే అలవాట్లను మానుకోవాలి. గుండె సమస్య లక్షణాలు ప్రత్యేకంగా ఉండవు. ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఇబ్బందిగా మారడం లాంటి లక్షణాలు గుండె సమస్యను చెప్పకనే చెప్తూ ఉంటాయి. అయినా వాటిని వేరొక ఆరోగ్య సమస్యతో ముడిపెట్టేవాళ్లే ఎక్కువ.
‘ఆరోగ్యంగానే ఉన్నాను కాబట్టి నాకు గుండె జబ్బు ఎందుకొస్తుంది?’ అనే ధీమా కూడా అందర్లో ఉంటోంది. వ్యాధి నిర్థారణ అయినప్పుడు, ‘నిన్నటి వరకూ బాగానే ఉన్నాను, ఇంత హఠాత్తుగా గుండె దెబ్బతినడం ఏంటి?’ అని ఆశ్చర్యపోయేవాళ్లూ ఉంటారు. కానీ గుండె జబ్బు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఎలాంటి లక్షణాలతో పని లేకుండా, ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలి. ముప్పు ఎక్కువగా ఉన్నవాళ్లు 35 ఏళ్ల నుంచే అప్రమత్తంగా ఉండాలి. ఇసిజితోనే గుండెజబ్బును పసిగట్టే వీలుంది. కాబట్టి సరళమైన ఆ పరీక్షతో గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం అత్యవసరం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రతి ఒక్కరికీ గుండె జబ్బు ముప్పు ఉంటుంది. ప్రధానంగా అందరూ ఈ విషయాన్ని గ్రహించాలి
ఛాతీలో ఎలాంటి అసౌకర్యం కలిగినా, అది ఏ కారణం వల్ల తలెత్తినా, గుండె జబ్బుగా, తీవ్రంగానే పరిగణించాలి
దురలవాట్లు, ఒత్తిడి, అస్తవ్యస్థ జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కుటుంబ చరిత్ర... వీటితో గుండె దెబ్బతినక ముందే గుండెను క్షేమంగా ఉంచే అలవాట్లు ఏర్పరుచు కోవాలి
వారంలో కనీసం ఐదు రోజులు కనీసం గంట పాటైనా వ్యాయామం చేయాలి
సమతులాహారం తీసుకోవాలి
జవాబుతారీ భాగస్వామిని ఏర్పరుచుకుని, వ్యాయామ ప్రేరణ పొందాలి
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాదీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
గుండెజబ్బుల ముప్పు ఉన్నవాళ్లు 35 ఏళ్ల నుంచే ఆరోగ్య పరీక్షలు మొదలుపెట్టాలి
మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకోవాలి
అధిక బరువు తగ్గించుకోవాలి
కుటుంబ చరిత్రలో గుండె జబ్బులున్నవారు, మిగతా వారితో పోలిస్తే ఐదు రెట్లు గుండెజబ్బుల ముప్పును కలిగి ఉంటారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. అలాగే మద్యపానం, ధూమపానం దురలవాట్లు ఉన్న వాళ్లకు కూడా గుండెజబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొందరి కుటుంబాల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటుంది. వీళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News