Share News

Chaitra Rao: దేశాలు వేరైనా అందరం ఒకటే

ABN , Publish Date - Aug 02 , 2025 | 02:57 AM

వందేమాతరం అంటూ ముగించిన చైత్రారావు ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని

Chaitra Rao: దేశాలు వేరైనా అందరం ఒకటే

‘‘రెండు దేశాలు... రెండు సంస్కృతులు... కానీ అందరినీ కలిపేది విజ్ఞానం మాత్రమే’’ అని నమ్ముతారు చైత్రారావు. ఈ వారం అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్‌ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమయింది. ఈ ప్రాజెక్టుకు చైత్రారావు డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. గత 18 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ ఆమె కీలక భూమిక పోషిస్తున్నారు. నైసార్‌ ప్రయోగం విజయవంతయిన తర్వాత- ఆ ప్రాజెక్టులోని సాంకేతిక అంశాల గురించి వివరించారు.

‘వందేమాతరం’ అంటూ ముగించిన చైత్రారావు ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన చైత్రారావు ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే- అపరిమితమైన ఓర్పు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస, తాను అనుకున్న లక్ష్యాలను ఎలాగైనా సాధించే పట్టుదల కనిపిస్తాయి. ‘‘నేను శివమొగ్గ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాను. మాకు బెంగుళూరు దగ్గరనే ఉండేది. నేను స్కూల్లో చదివే రోజుల్లో ‘ఇస్రో’కు నాలుగైదు సార్లు వెళ్లాను. అది నాకు వేరే ప్రపంచంలా అనిపించింది. పెద్దయిన తర్వాత ఎలాగైనా ‘ఇస్రో’లో పని చేయాలనుకొనేదాన్ని. కానీ అంగారకుడిపైకి ‘ఇస్రో’ పంపిన ‘మామ్‌’ ఉపగ్రహం టీమ్‌లో పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నా ప్రస్థానంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’’ అని చైత్రారావు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


XN.jpg

వడివడిగా ఎదుగుతూ...

ఇస్రోలో యువ శాస్త్రవేత్తగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన చైత్రారావు అనేక ప్రయోగాలలో కీలకమైన పాత్ర పోషించారు. అంగారకుడికి కక్ష్యలోకి వెళ్లి... అక్కడ ఆ గ్రహం ఆనుపానులు కనిపెట్టడానికి ప్రయోగించిన ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ (మామ్‌)లో ఆమె కీలకమైన పాత్ర పోషించారు. ‘మామ్‌’లో మొత్తం 90 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తే- దానిలో 20 మంది మహిళలే! వీరందరూ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినవారు. వేర్వేరు వృత్తి నైపుణ్యాలు ఉన్నవారు. అయినా అందరూ కలిసికట్టుగా ఒక బృందంగా పనిచేసి విజయం సాధించారు. ‘‘మామ్‌ ప్రయోగానికి ముందు రాత్రిళ్లు కూడా పనిచేయాల్సి వచ్చేది. అందరం విపరీతమైన ఒత్తిడిలో ఉండేవాళ్లం. అయినా విజయం సాధించాలనే లక్ష్యంతోనే పని చేసేవాళ్లం’’ అంటారు చైత్రారావు. ఆ సమయంలోనే ఆమె బృందం మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో కలిసి పని చేశారు. ‘‘ఆయన మాటలు ఎప్పుడూ చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఏవైనా సమస్యలు చెబితే వాటి పరిష్కారాల కోసం ఆయన కూడా ప్రయత్నించేవారు. మాకు తోడుగా ఉండేవారు’’ అని అబ్దుల్‌ కలాంతో తమ అనుభవాలను చెబుతారు చైత్రారావు. బహుశా ఆ సమయంలో అందరితో కలిసి పని చేసిన అనుభవం నైసార్‌ ఉపగ్రహ అభివృద్ధిలో, నిర్మాణంలో పనికివచ్చింది. ఈ ఉపగ్రహ డిజైన్‌, రాడార్ల లాంటి వివిధ భాగాల తయారీ అమెరికాలో జరిగింది. దీనికోసం చైత్రారావు, ఆమె బృందం ‘నాసా’ శాస్త్రవేత్తలతో కలిసి... గత ఏడాదంతా అక్కడ పనిచేయాల్సి వచ్చింది. ‘‘అది కూడా ఒక మరచిపోలేని అనుభవం’’ అంటారు చైత్రారావు. ‘‘నాసా వేరు. ఇస్రో వేరు అనే భావన ఎన్నడూ రాలేదు. దేశాలు వేర్వేరు కావచ్చు. కానీ అందరం ఒకటే! అందరం అంతరిక్ష సమాజానికి చెందినవాళ్ళమే అనిపించింది’’ అంటారామె! ఇప్పటివరకూ మన దేశానికి అంతరిక్ష రంగంలో ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన చైత్రారావు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుందాం.

Updated Date - Aug 02 , 2025 | 02:57 AM