Air Conditioner: ఏసీ చల్లదనంతో సమస్యా
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:35 AM
వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎయిర్ కండిషనర్ ఉపయోగిస్తారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఏసీ ఉపయోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను నివారించుకోవచ్చు.

వేసవిలో మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఎయిర్ కండిషనర్‌లను వాడతాం. కానీ కొంతమందికి ఏసీ చల్లదనం సరిపడక తలనొప్పి, చర్మం పొడిబారడం, కళ్ల దురద, జలుబు, గొంతు పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఏసీని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఏసీ ఫిల్టర్లలో ఎక్కువగా దుమ్ము చేరుతూ ఉంటుంది. ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు ఈ దుమ్ము కణాలు వాటిలోని హానికారక బ్యాక్టీరియా గది అంతటా వ్యాపిస్తాయి. గదిలోకి రాగానే ఇవి శ్వాసకోశాల్లోకి చేరి జలుబు, తుమ్ములు, దగ్గు లాంటి సమస్యలను కలిగిస్తాయి. తరచూ ఏసీని, ఫిల్టర్లను శుభ్రం చేస్తూ ఉంటే వీటిని అధిగమించవచ్చు.
ఏసీ వేసి ఉన్న గదిలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు ఇలాంటి చల్లని వాతావరణంలో గడపడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. తలనొప్పి, ముక్కు దిబ్బడ, కళ్ల దురద వస్తుంటాయి. చర్మం పొడిబారుతుంది కూడా. గదిలో చల్లదనం మరీ ఎక్కువగా కాకుండా మధ్యమంగా ఉండేలా ఏసీ ఉష్ణోగ్రతను నియంత్రిస్తే ఈ సమస్యలు రావు.
ఏసీ గదిలో ఉన్నప్పటికీ శరీరం తేమను కోల్పోతూ ఉంటుంది. దాహం అనిపించకపోయినా తరచూ మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. రాత్రి పూట పడుకునే ముందు గదిలో హ్యుమిడిఫైయర్‌ను వాడడం మంచిది. అలాగే ఏసీ టైమర్ పెట్టుకుంటే నిర్జలీకరణ సమస్యలు రావు.
గదిలో ఏసీ వేసినప్పుడు సాధారణంగా తలుపులు, కిటికీలు మూసి ఉంచుతాం. దీనివల్ల గదిలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. కనీసం రెండు గంటలకు ఒకసారి అయిదు నిమిషాలపాటు కిటికీలు, తలుపులు తెరచి ఉంచితే గదిలో తాజాదనం విస్తరిస్తుంది.
ఏసీ గాలి నేరుగా శరీరాన్ని తాకితే తలనొప్పి వస్తుంది. జలుబు చేస్తుంది కూడా. ఏసీ గాలి నేరుగా కాకుండా ఓ పక్కకు ప్రసరించేలా ఏర్పాటు చేసుకుంటే గది మొత్తం మెల్లగా చల్లబడి హాయిగా అనిపిస్తుంది. ఏసీలో స్వింగ్ ఫీచర్‌ని ఉపయోగించుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News