Kamal Haasan: క్షమాపణ చెప్పనన్న కమల్ హాసన్.. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాపై నిషేధం
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:02 PM
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో గందరగోళం నెలకొనగా, కమల్ క్షమాపణ చెప్పాలని, లేదంటే తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయబోమని అక్కడి నేతలు చెప్పారు. అయినప్పటికీ కమల్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ప్రముఖ తమిళ్ హీరో, రాజకీయ నేత కమల్ హాసన్ (Kamal Haasan) తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాష తమిళం నుంచి వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచించినప్పటికీ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమా థగ్ లైఫ్ (Thug Life movie ) కర్ణాటకలో విడుదల కావడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కమల్ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ఈ సినిమా విడుదల కాదని కన్నడ అభిమాన గ్రూపులు, కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న విడుదల కానుంది.
కోర్టులో ఏం జరిగింది
కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. కమల్ హాసన్ తరపు న్యాయవాది దయాన్ చిన్నప్ప కమల్ కన్నడ భాషను అవమానించలేదన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రేమతో చెప్పినవే అని వాదించారు. అయితే కోర్టు కమల్‌కు కీలక సూచనలు చేసింది. మీరు సామాన్య వ్యక్తి కాదు. మీకు భాషా స్వేచ్ఛ ఉంది, కానీ అది ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. మాటలు వెనక్కి తీసుకోలేము. కానీ క్షమాపణ చెప్పవచ్చు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, అలా చేస్తే వివాదం సద్దుమణుగుతుందని కోర్టు సూచించింది.
కమల్ ఏమన్నారంటే..
కానీ కమల్ తరపు న్యాయవాది కమల్ హాసన్‌కు కన్నడ భాషపై గౌరవం ఉందని, క్షమాపణ అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఇది మీరు అహంకారంతో మాట్లాడుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 10న మళ్లీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కమల్ కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ను కర్ణాటకలో విడుదల చేయడం లేదని కమల్ తాత్కాలికంగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం భద్రతాపరమైన ఇబ్బందులు ఏవీ లేవన్నారు. కానీ గందరగోళ పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకు మేము ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఆయన న్యాయవాది అన్నారు. ఈ నిర్ణయం సినిమా ఆదాయంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటక బాక్సాఫీస్‌లో సినిమాకు మంచి మార్కెట్ ఉంది.
వివాదం ఎలా మొదలైంది
చెన్నైలో థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని పేర్కొన్నారు. అదే వేదికపై ఉన్న కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ని ఉద్దేశించి మీ భాష కన్నడ కూడా తమిళం నుంచి పుట్టింది, కాబట్టి మీరు కూడా మా కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కన్నడ సంస్థలు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), రాజకీయ పక్షాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు వై.యడియూరప్ప కమల్ హాసన్ కన్నడ భాషను అవమానించారని ఆరోపించారు. KFCC అధ్యక్షుడు ఎం. నరసింహులు కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడానికి అనుమతించమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి