Mini-moon: హనీమూన్ కంటే ముందు మినీమూన్.. యువ జంటల్లో కొత్త ట్రెండ్ గురించి తెలుసా?
ABN , Publish Date - Nov 22 , 2025 | 07:55 PM
ప్రస్తుతం యువ జంటల్లో మినీమూన్ ట్రెండ్ కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మినీమూన్ ఎంటో, హనీమూన్‌తో పోలిస్తే తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్‌కు వెళతాయి. హనీమూన్‌లో దొరికే ఏకాంత సమయం వారిని మానసికంగా దగ్గర చేస్తుంది. అయితే, నేటి యువత హనీమూన్‌తో కంటే ముందు మినీమూన్‌పై వెళుతున్నారు. ఫలితంగా ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతోందని థ్రిల్లోఫీలియా అనే పర్యాటక సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది.
ఏమిటీ మినీమూన్
పెళ్లి తరువాత యువ జంటలు కొంత సమయం తీసుకుని హనీమూన్‌కు వెళతాయి. కానీ పెళ్లయిన వెంటనే ఈ ట్రిప్‌కు వెళ్లడమే మినీమూన్. పెళ్లి తాలూకు హడావుడి నుంచి బయటపడి సేద తీరేందుకు యువ జంటలు మినీమూన్‌ను ఎంచుకుంటున్నాయి. జస్ట్ 3-5 రోజుల పాటు అలా మినీమూన్‌లో ఎంజాయ్ చేశాక, తీరిగ్గా హనీమూన్‌కు ప్లాన్ చేస్తున్నాయట.
మినీమూన్ అందించే ప్రత్యేక ప్రయోజనాల కారణంగానే ఈ ట్రెండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయడం చాలా ఈజీ. ఖర్చులు కూడా తక్కువే. ఉద్యోగం చేసే వారు మినీమూన్ కోసం ఎక్కువ సెలవులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మినీమూన్‌లో ఒకరికొకరు దగ్గరయ్యాక కొన్ని నెలల తరువాత తీరిగ్గా హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా మినీమూన్‌కు వెళ్లొచ్చిన తరువాత దంపతులిద్దరికీ ఇష్టమైన ప్రదేశాలను ఎంచుకుని సుదీర్ఘ టూర్‌పై వెళుతున్నారు.
యువ జంటలు లగ్జరీ టూర్ల కంటే తాము మానసికంగా దగ్గరయ్యే టూర్స్‌కు మొగ్గుచూపుతున్నారు. సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేసేలా సముద్రయానాలు, బీచ్‌లో డిన్నర్స్ వంటి వాటిని ఎంచుకుంటున్నారు.
మనదేశంలో యువ జంటలు హనీమూన్, మినీమూన్‌ల కోసం కేరళ, అండమాన్ దీవులు, గోవా, రాజస్థాన్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. కాస్తంత ప్రైవెసీ, ప్రశాంతత కోరుకునే వారు మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ వంటిచోట్లకు వెళుతున్నారు. థాయ్‌లాండ్, వియత్నాం, బాలీ వంటి ప్రదేశాలకు వెళ్లేవారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి:
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ