Share News

Visa-free Vs Visa-on-arrival: వీసా-ఫ్రీ.. వీసా-ఆన్-అరైవల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా

ABN , Publish Date - Jul 31 , 2025 | 10:16 AM

అనుభవజ్ఞులైన పర్యాటకులకు కూడా వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ ఫీచర్లకు సంబంధించి కొన్ని సందేహాలు ఉంటాయి. మరి ఈ సౌకర్యాలు, వీటితో కలిగే ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Visa-free Vs Visa-on-arrival: వీసా-ఫ్రీ.. వీసా-ఆన్-అరైవల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా
Visa-Free travel Vs Visa On Arrival Features

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పర్యటనలకు వీసా తప్పనిసరి అని చాలా మందికి తెలుసు. అయితే, వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాల విషయంలో అనుభవజ్ఞులకు కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఈ రెండూ పర్యటనలను సులభతరం చేసేవే అయినా వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వీసా-ఫ్రీ సౌకర్యం ఫీచర్స్ ఇవే

కొన్ని దేశాలు ఈ వీసా-ఫ్రీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు భారత్‌ మరో దేశంతో వీసా-ఫ్రీ పర్యటనలకు ఒప్పందం కుదుర్చుకుంటే భారతీయులు ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లిపోవచ్చు. కేవలం పాస్‌పోర్టుతో అక్కడి ఎయిర్‌పోర్టులో దిగి పర్యటన కొనసాగించొచ్చు. విదేశీ పర్యటనల్లో అత్యంత సులభమైన విధానం ఇదే. అయితే, పర్యటకులకు వీసా అవసరం లేకపోయినప్పటికీ రిటర్న్ టిక్కెట్లు, హోటల్ బుకింగ్ రసీదులు చూపించాల్సి ఉంటుంది. భారతీయులకు నేపాల్, భూటాన్ దేశాలు ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. అమెరికా పౌరులకు అనేక ఐరోపా సమాఖ్య దేశాల్లో ఈ సౌకర్యం ఉంది. అమెరికన్లు ఆయా దేశాల్లో సుమారు 90 రోజుల పాటు వీసా లేకుండానే పర్యటించొచ్చు.


వీసా-ఆన్-అరైవల్ ఫీచర్లు ఇవీ

ఇందులో భాగంగా విదేశీ పర్యాటకులు ఎయిర్‌పోర్టులో లాండయ్యాక అతిథ్య దేశం వీసా జారీ చేస్తుంది. అంటే.. పర్యాటకులు ముందస్తుగా ఎలాంటి వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎయిర్ పోర్టు లేదా లాండ్ బోర్డర్ వద్ద ఉన్న ప్రత్యేక కౌంటర్‌లో పర్యాటకులు దరఖాస్తు నింపి, కొంత ఫీజు చెల్లిస్తే ఈ వీసా జారీ అవుతుంది. అయితే, ఈ క్రమంలో పర్యాటకులు క్యూ లైన్‌లో కొంత సేపు నిలబడాల్సి రావచ్చు. స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేయాలి. హోటల్ బుకింగ్స్ రసీదులు, తిరుగు ప్రయాణానికి సంబంధించి విమాన టిక్కెట్లను కూడా చూపించాల్సి ఉంటుంది.

థాయ్‌లాండ్ భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ అనుమతిలో 15 రోజుల వరకూ భారతీయులు అక్కడ పర్యటించొచ్చు. మాల్దీవులు కూడా పలు దేశాల వారికి 30 రోజుల కాలపరిమితిపై వీసా-ఆన్-ఆరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.


ఇవి కూడా చదవండి:

భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

పాస్‌పోర్టు విషయంలో ఈ తప్పులు చేస్తే చుక్కలే..

Read Latest and Travel News

Updated Date - Jul 31 , 2025 | 10:27 AM