Travel Apps: విహారయాత్రకు వెళ్లే వారి స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి
ABN , Publish Date - Jun 30 , 2025 | 08:05 PM
విహార యాత్రకు వెళ్లే వారు తమ స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా కొన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇవి ఉంటే ఎటువంటి చికాకులు లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం ఉద్యోగ కుటుంబ బాధ్యతలతో అలసిపోయే వారు అలా విహారయాత్రలు చేయాలనుకుంటారు. ఈ టూర్‌లతో మనసుకు కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ తరువాత రోజువారి పనుల్లో మరింత ఉత్సాహంగా పాలుపంచుకోవచ్చు. అయితే, ఇలా విహారయాత్రలకు వెళ్లేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నేటి స్మార్ట్ ఫోన్ జమానాలో మొబైల్‌లో తప్పనిసరిగా కొన్ని యాప్స్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Must-Have Travel Apps India).
పర్యాటకులెవరైనా సరే ముందుగా తమ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉండేలా జాగ్రత్త పడాలి. నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, కొండకోనల్లో కాలినడకన జర్నీ ఇలా అనేక సందర్భాల్లో ఈ యాప్ అక్కరకు వస్తుంది. ఆఫ్‌లైన్ వినియోగానికి కూడా ఈ యాప్‌తో మ్యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్‌వర్క్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ మ్యాప్‌లు చాలా ఉపయోగపడతాయి.
రైలు ప్రయాణాలు చేసే వారి వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన యాప్ ఐఆర్‌సీటీసీ రెయిల్ కనెక్ట్. ఈ యాప్‌తో పర్యాటకులు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ట్రెయిన్ స్టేటస్‌ను లైవ్‌లో చెక్‌చేయొచ్చు. ఇక మార్గమధ్యంలో మీల్స్ బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది.
కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గూగుల్ ట్రాన్స్‌లేట్‌తో ఈ చికాకు నుంచి ఈజీగా బయటపడొచ్చు. భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయ భాషల్లో ఉన్న అనేక విషయాలను ఈ యాప్ ఈజీగా మనకు తెలిసిన భాషలోకి అనువదిస్తుంది. ఇందులోని కెమెరా ఫీచర్‌తో వివిధ భాషల్లోని బోర్డులు, హోటళ్ల మెనూల్లోని ఫుడ్ ఐటమ్స్ పేర్లను మనకు తెలిసిన భాషలోకి అనువదించవచ్చు.
ప్రయాణాల్లో ఉన్నప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను ఎల్లవేళలా అందుబాటులో పెట్టుకునేందుకు డీజీలాకర్‌కు మించినది లేదు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ వంటివన్నీ ఈ డిటిటల్ లాకర్‌లో దాచుకుని కావాల్సినప్పుడు వినియోగించుకోవచ్చు. విమాన ప్రయాణాలు, హోటల్ గదులు బుక్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇక విమాన ప్రయాణికులకు డీజీ యాత్రకు మించినది లేదనే చెప్పాలి. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల పనులన్నీ సులువుగా ఈ యాప్‌తో చక్కబెట్టుకోవచ్చు. ప్రయాణ వివరాలు, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్‌ను లింక్ చేసి చెకిన్‌ను వేగంగా పూర్తి చేసుకోవచ్చు. సెక్యూరిటీ చెక్‌లు కూడా సులువుగా పూర్తవుతాయి. తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి ఈ యాప్ చాలా ఉపయోగకరం.
ఇవి కూడా చదవండి:
ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా
ఎయిర్‌పోర్టులో తమ వస్తువులు పోగొట్టుకున్న వాళ్లు వెంటనే చేయాల్సిందేంటంటే..
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి