Share News

Lost Phone: ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఈ ఐదు పనులు చేయండి

ABN , Publish Date - Jul 12 , 2025 | 07:18 AM

ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ పోయిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో కొంత ఉపశమనం దక్కుతుందని అంటున్నారు. మరి ఆ పనులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Lost Phone: ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఈ ఐదు పనులు చేయండి
Lost Phone Recovery

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఫోన్ లేకుండా క్షణం కూడా గడవదు. ఇలాంటప్పుడు ఫోన్ పోయిందంటే నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఆ ఇబ్బందిని మాటల్లో వర్ణించలేము. జర్నీకి సంబంధించిన టిక్కెట్లు, ప్లాన్స్, బ్యాంక్ యాప్స్, ఫొటోలు, ఇలా విలువైనవి అనేకం కోల్పోవాల్సి వస్తుంది. అయితే, ఫోన్ పోయిన సందర్భాల్లో కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తే నష్టాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చు. ఫోన్ మళ్లీ దొరికే ఛాన్స్‌లు కూడా పెరుగుతాయి. మరి ఫోన్ పోయినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫోన్ పోగానే అతిగా గాబరా పడకూడదు. అసలు ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నది గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. కుదిరితే ఆయా ప్రాంతాల్లో ఒకసారి వెతకాలి. హోటల్‌ లాంటి చోట్ల పోగొట్టుకుంటే అక్కడి సిబ్బందిని వాకబు చేయొచ్చు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఫోన్ వెంటనే దొరకొచ్చు. దీంతో క్షణాల వ్యవధిలోనే సమస్య నుంచి బయటపడొచ్చు.


జర్నీల్లో ఉన్నప్పుడు కచ్చితంగా ఫోన్‌లో ట్రాకింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ఫైండ్ మై ఫోన్, యాపిల్‌లో ఫైండ్ మై ఐఫోన్‌ను వినియోగించొచ్చు. మీ ఫోన్ చివరిసారిగా ఎక్కడ ఉన్నదీ వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వీటి ద్వారా ఫోన్‌లోని డాటాను రిమోట్‌గానే డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఫోన్‌లోని సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి.

ఫోన్ పోయిందని నిర్ధారించుకున్నాక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఇన్సూరెన్స్, సిమ్ రీప్లేస్‌మెంట్ సమయంలో ఇది అక్కరకు వస్తుంది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పి సిమ్‌ను బ్లాక్ చేయించాలి. చాలా సంస్థలు ఇలాంటి సమయాల్లో వినియోగదారులకు డూప్లికేట్ సిమ్ అందిస్తాయి. మీ ఐడీ, ఇతర వివరాలు చోరీ కాకుండా ఈ చర్యలు తప్పనిసరి.


ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసి, సిమ్‌ను బ్లాక్ చేశాక మీ ఐడీ చోరీ కాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈమెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్స్ పాస్‌వర్డ్స్ అన్నిటినీ మార్చుకోవాలి. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటే దాన్ని మరో ఫోన్‌కు బదిలీ చేసుకోవాలి. దీంతో, మీ అకౌంట్ వివరాలు నేరగాళ్ల చేతుల్లో పడకుండా ఉంటాయి.

క్లౌడ్‌‌లో మీ ఫోన్‌కు బ్యాకప్ ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సమయాల్లో సహాయకారిగా ఉంటుంది. మరో ఫోన్‌లోకి మీ డాటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లు తమ ఇన్సూరెన్స్ సంస్థలకు కూడా ఫోన్ పోయిన విషయాన్ని చెప్పాలి. పోలీస్ రిపోర్టుతో పాటు పోన్ కొనుగోలుకు సంబంధించి బిల్స్, ఇతర డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి. ఈ చర్యలు తీసుకుంటే కొంత ఉపశమనం దక్కుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 08:40 AM