Long-haul Flight Tips: విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు పాటించాల్సిన టిప్స్
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:40 PM
సుదీర్ఘ విమాన ప్రయాణాలు చేసే వారు ఫాలో కావాల్సిన టిప్స్ కొన్ని ఉన్నాయని అనుభవజ్ఞులైన కేబిన్ క్రూ చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ట్రావెల్ సీజన్‌లో చాలా మంది విదేశీ టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, సుదీర్ఘ సమయం పాటు విమానాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుభవజ్ఞులైన కేబిన్ క్రూ చెబుతుంటారు. మరి ఈ టిప్స్ ఏంటంటే (Tips For Long haul Flights)..
హైడ్రేషన్
సుదీర్ఘదూరాలు విమానాల్లో ప్రయాణించే వారు తగినంత నీరు తప్పనిసరిగా తాగాలి. విమానంలోపల వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. దీంతో, ప్రయాణికులు చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతారు. చివరకు బాగా అలసిపోతారు. కాబట్టి, విమానాల్లో కనీసం ఒకటిన్నర లీటర్ల నీరు తాగేందుకు ప్రయత్నించాలి.
జెట్ ల్యాగ్ నుంచి విముక్తి ఇలా..
విమానాల్లో ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు జెట్ ల్యాగ్ వల్ల ఇబ్బందికి గురవుతారు. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు మీరు వెళ్లబోయే ప్రాంతంలోని కాలమానానికి అనుగుణంగా ప్రయాణానికి ముందే ఆహారం తినే వేళలు, నిద్ర టైమ్‌ను మార్చుకుంటే జెట్ ల్యాగ్ ఇబ్బందులు తగ్గుతాయి.
కంటి నిండా నిద్ర
విమాన ప్రయాణాల్లో కంటి నిండా నిద్ర పోవడం తప్పనిసరి. అయితే, విమానంలో కేబిన్ క్రూ, తోటి ప్రయాణికుల చేసే చప్పుళ్ల వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు విమానంలో హడావుడి తక్కువగా ఉండే చోట సీటును బుక్ చేసుకోవాలి. ముఖ్యంగా లావెటరీల పక్కన, నడక దారికి ఇరు వైపులా ఉండే సీట్లను బుక్ చేసుకోకుండా ఉండటమే మంచిది.
విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాలప్పుడు ఎక్కువ సేపు సీట్లో కూర్చుండిపోకూడదు. కాసేపు లేచి అటూ ఇటూ నడవాలి. చేతులు, కాళ్లను స్ట్రెచ్ చేసుకోవాలి. సీట్ బెల్ట్ తీసేయొచ్చన్న సంకేతం వెలువడ్డాక అవసరమనుకుంటే సీట్ల మధ్య నడక మార్గంలో అటూఇటూ పచార్లు చేయొచ్చు.
విమానంలోని పొడి వాతావరణం వల్ల చర్మంపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి, విమానంలో వెళ్లేటప్పుడు మేకప్‌ను ఎక్కువగా వేసుకోకూడదు. అయితే, ఎక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు సూర్యరశ్మిలోని యూవీ కిరణాల వల్ల హానికలిగే అవకాశం ఉంది. కాబట్టి సన్‌స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి.
ఈ ప్రయాణాల్లో మంచి మ్యూజిక్ వినడం లేదా సినిమాలు చూడటం వంటివి చేస్తే మనసు రిలాక్స్ అవుతుంది. ఈ టిప్స్ పాటిస్తే సుదీర్ఘ విమాన ప్రయాణాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు
ఇవి కూడా చదవండి:
విమాన ప్రయాణికులకు అలర్ట్.. మీ లగేజీకి ఇలాంటి తాళం మాత్రం వేయద్దు
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ