Indian Travellers Habits: పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా
ABN , Publish Date - Jul 31 , 2025 | 02:10 PM
సెలవుల్లో టూర్‌లపై వెళ్లే భారతీయుల్లో 40 శాతానికి పైగా జనాలు పర్యటక స్థలాల్లో ఏదోక వస్తువు మర్చిపోయి వస్తున్నారట. అంతేకాకుండా, ప్రయాణాల్లో స్నాక్స్ కింద భారతీయ వంటకాల్నే తీసుకెళ్లేందుకు ఇష్టపడుతున్నారట. ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఇంటర్నెట్ డెస్క్: సెలవుల్లో పర్యటనలకు వెళ్లే భారతీయుల్లో దాదాపు 40 శాతం మంది ఏదోక వస్తువు మర్చిపోయి తిరిగి వస్తున్నారట. బుకింగ్స్ డాట్ కామ్, గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూగవ్ నిర్వహించిన సమ్మర్ ట్రావెల్ రీసెర్చ్ -2025 సర్వేలో ఈ విషయం తెలిసింది. దాదాపు 42 శాతం మంది భారతీయ పర్యాటకులు సాక్సులు, షర్టులు, టాప్స్ వంటి వివిధ రకాల దుస్తులను పర్యాటక ప్రాంతాల్లోనే పొరపాటున వదిలేసి తిరిగి వెళ్లిపోయారట.
సుమారు 37 శాతం మంది భారతీయులు పర్యటన స్థలాల్లో ఇయర్ ఫోన్స్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ వంటివి మర్చిపోతున్నారు. 36 శాతం మంది టాయిలెటరీలను, మరో 30 శాతం మంది కళ్లద్దాలను వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. నగలు, వాచ్‌ల వంటి వాటిని మర్చిపోయే వారు 22 శాతంగా ఉన్నారు. దాదాపు 17 శాతం మంది పాస్‌పోర్టు వంటి ముఖ్య డాక్యుమెంట్స్‌ను కూడా పర్యటక ప్రాంతాల్లో పొరపాటు వదిలేసి వచ్చినట్టు ఈ సర్వేలో తేలింది. నెత్తికి పెట్టుకునే విగ్గులను కొందరు (17 శాతం) మర్చిపోతే మరికొందరు (12 శాతం) ఏకంగా పెంపుడు జంతువులను మర్చిపోయి వచ్చేశారు.
ఇక కొన్ని వస్తువుల విషయాల్లో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నట్టు కూడా ఈ సర్వేలో తేలింది. కాఫీ, టీ బ్యాగులు (41 శాతం మంది), న్యూస్ పేపర్లు (28 శాతం), చెప్పులు (25 శాతం), చిరుతిళ్లను తప్పనిసరిగా తిరిగి తీసుకొస్తున్న వారు ఉన్నారు.
ఇక ప్రయాణాల్లో చిరుతిళ్ల కోసం భారతీయులు సంప్రదాయక వంటకాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాదాపు 54 శాతం మంది ప్రయాణాల్లో నమ్కీన్, ఖారా, బిస్కెట్స్ వంటివి తిన్నారు. మరో 41 శాతం మంది డ్రై ఫ్రూట్స్‌ను వెంట తీసుకెళ్లారు. చాక్లెట్స్, క్యాండీలు, పెప్పర్ మింట్స్‌ను ఎంచుకునే వారు 39 శాతంగా ఉన్నారు. ఇక ఇంట్లో వండుకున్న చిరుతిళ్లను తీసుకెళ్ల వారి సంఖ్య 37 శాతంగా ఉన్నట్టు సర్వేలో తేలింది. సర్వేలో దాదాపు మూడో వంతు మంది కాఫీ లేదా టీ బ్యాగ్స్‌ను వెంట తీసుకెళ్లారట. పర్యటనల్లో భాగంగా సౌకర్యాన్ని, సంప్రదాయతను మేళవించేందుకు అత్యధిక మంది భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వేలో తేలింది.
ఇవి కూడా చదవండి:
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ
వీసా-ఫ్రీ.. వీసా-ఆన్-అరైవల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా