Marvels of India: భారత్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవీ..
ABN , Publish Date - Nov 18 , 2025 | 07:52 PM
భారత దేశ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి భారత్‌కు మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: యుగయుగాల చరిత్ర కలిగిన భారత దేశ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, భారత దేశానికున్న కొన్ని ప్రత్యేకతలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయితే, మన దేశం గురించి కొందరికే తెలిసిన విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం (Marvels of India).
కేబుల్ లామ్‌జావ్ నేషనల్ పార్క్
మణిపూర్‌లోని కేబుల్ లామ్‌జావ్ జాతీయ వనం లోక్‌తక్ సరస్సులో తేలియాడుతుంటుంది. ఇలాంటి తేలియాడే జాతీయవనం ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రకృతి సౌందర్యానికి, జీవవైవిధ్యానికి ఈ జాతీయవనం పెట్టింది పేరు. అరుదైన సంగాయ్ జింక ఈ జాతీయవనంలోనే ఉంటుంది ( Keibul LamjaoNational Park).
మాసిన్రామ్
నిత్యం వర్షాలతో తడిసిముద్దయ్యే ప్రాంతం మాసిన్రామ్. మేఘాలయ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో ఏటా 11,873 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ప్రపంచంలోనే ఇది అత్యధికం. కనుచూపు మేర అంతా పరుచుకున్నట్టు ఉండే అడవులు, నిరంతరం మేఘావృతమై ఉన్న ఆకాశం చూస్తే స్వర్గం భూమ్మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడి రూట్ బ్రిడ్జిలు, శతాబ్దాల నాటి నిర్మాణాలు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి (Wettest Place Mawsynram).
స్వర్ణదేవాలయం
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ ప్రతి రోజూ లక్ష మంది ఆకలి తీర్చేందుకు లంగర్‌లో (సామూహిక కిచెన్) భారీగా ఆహారాన్ని తయారు చేస్తుంటారు. వేలాది మంది ఈ వంటవార్పులో పాల్గొంటారు. పూర్తి ఉచితంగా ఈ ఫుడ్‌ను ఇస్తారు (Golden Temple Amritsar).
ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న పారాగ్లైడింగ్ సైట్
సాహసికులు అమితంగా ఇష్టపడే పారాగ్లైడింగ్‌కు బిర్ బిల్లింగ్ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతం దాదాపు 8 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పారాగ్లైడింగ్ సైట్‌గా దీనికి పేరుంది. పారాగ్లైడింగ్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు తరలివస్తుంటారు (Bir Billing).
చినాబ్ రైల్వే బ్రిడ్జి
జమ్మూకశ్మీర్‌లో చినాబ్ రైలు వంతెనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరుంది. ఇది దాదాపు 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే, ఐఫిల్ టవర్ కంటే ఇది ఎత్తైనది అన్నమాట. కొండలు, లోయలతో నిండిన ప్రాంతంలో ఎన్నో ఇంజినీరింగ్ సవాళ్లను అధిగమించి ఈ వంతెనను నిర్మించారు (Chenab Railway Bridge). మరి ఈసారి పర్యటనకు వెళ్లేటప్పుడు ఈ ప్రాంతాలను ఓసారి చూసిరండి!
ఇవి కూడా చదవండి:
ప్రపంచంలో 2వ అత్యంత శీతల ప్రదేశం ఈ భారతీయ గ్రామమే..
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా