Share News

Passenger Rights: ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:26 AM

ఫ్లైట్ జర్నీలు ఆలస్యమైనా లేక రద్దయినా ప్రయాణికులు ఉండే హక్కులు, దక్కే పరిహారం ఎంతో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

Passenger Rights: ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా
Flight Delay Passenger Rights

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణాలకు ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. ఎయిర్‌పోర్టులో గంటల తరబడి వేచి చూడాలన్నా, విమానం త్వరగా ల్యాండవకుండా గాల్లోనే చెక్కర్లు కొడుతున్నా లోపలున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. అయితే, విమానాలు ఆలస్యం కావడం, అకస్మాత్తుగా రద్దవడం లేదా వెనక్కు తిరిగి వచ్చేసిన సందర్భాల్లో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు సాంత్వన పొందే హక్కు ఉందని భారతీయ చట్టాలు చెబుతున్నాయి (Civil Aviation-Passenger Rights).

ఇలాంటి సందర్భాల్లో విమానయాన సంస్థలు ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి. ఆహారం, నివాస సదుపాయం కల్పించడం, టిక్కెట్ డబ్బులు రీఫండ్ చేయడం లేదా మరో ఫ్లైట్‌లో పంపించడం వంటివి సందర్భాన్ని అనుసరించి చేయాలి. వాతావరణం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, రద్దీ వంటి కారణాలతో జర్నీలు ఆలస్యమవుతాయి. కొన్ని సార్లు సర్వీసులు రద్దవుతాయి. రెండు గంటల నుంచి ఆరు గంటల పాటు ఫ్లైట్ ఆలస్యమైతే ప్రయాణికులకు వారి జర్నీ సమయాన్ని బట్టి ఎయిర్‌లైన్స్ ఉచిత మీల్స్, ఇతర రిఫ్రెష్‌మెంట్స్ ఇవ్వాలి.


రాత్రంతా ఫ్లైట్‌లో జాప్యం జరిగితే ప్రయాణికులకు ఏదైనా హోటల్‌లో వసతి ఏర్పాటు చేయాలి. ఫ్లైట్ రద్దైన పక్షంలో ప్రయాణికులకు టిక్కెట్ డబ్బులను రీఫండ్ చేయమని ఎయిర్‌లైన్స్ సంస్థను కోరే హక్కు ఉంటుంది. లేదా మరో ఫ్లైట్‌లో గమ్య స్థానానికి చేర్చమని కూడా కోరచ్చు. కొన్ని సందర్భాల్లో విమానం మధ్యలోనే తిరిగొచ్చేయొచ్చు. ఇలాంటప్పుడు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చడమే ఎయిర్‌లైన్స్ సంస్థల ముఖ్య కర్తవ్యం. కాబట్టి, ప్రయాణికులకు మరో ఫ్లైట్ టిక్కెట్స్ ఇవ్వడం ఉచిత మీల్స్, హోటల్‌లో వసతి వంటివాటిని ఎయిర్ లైన్స్ సంస్థలు ఏర్పాటు చేయొచ్చు. సుదీర్ఘజాప్యం జరిగినా లేదా ట్రిప్ క్యాన్సిల్ అయినా టిక్కెట్ డబ్బులు రీఫండ్ చేయొచ్చు.

ఇక డీజీసీఏ రూల్స్ ప్రకారం, విమానం రెండు గంటలకు పైగా ఆలస్యం అయితే ఎయిర్ లైన్స్ సంస్థలు మీల్స్, ఇతర రిఫ్రెష్‌మెంట్స్ ఇవ్వాలి. రాత్రంతా ఫ్లైట్ ఆలస్యమైతే హోటల్‌లో వసతి ఏర్పాటు చేయాలి, అక్కడి వరకూ రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. ఫ్లైట్ రద్దైన పక్షంలో టిక్కెట్ డబ్బులన్నీ రిఫండ్ చేయాలి. లేదా మరో ఫ్లైట్‌లో గమ్య స్థానానికి పంపించాలి.


ముందస్తు నోటీసు లేకుండా ఫ్లైట్‌ను రద్దు చేస్తే మాత్రం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ప్రయాణికులకు పరిహారం చెల్లించాలి. అయితే, వాతావరణం లేదా ఇతర ప్రకృతిసహజమైన కారణాలతో సర్వీసులు రద్దయితే మాత్రం ఎయిర్‌లైన్స్ సంస్థలు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం ఉంది.

ఇవి కూడా చదవండి:

మీరు జర్నీ చేస్తున్న విమానం ఎప్పుడు తయారు చేశారో తెలుసుకోవాలనుందా.. అయితే..

ఎయిర్‌పోర్టులో తమ వస్తువులు పోగొట్టుకున్న వాళ్లు వెంటనే చేయాల్సిందేంటంటే..

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 11:40 AM