Share News

Muscle Building: 40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

ABN , Publish Date - Jul 05 , 2025 | 09:06 PM

40 ఏళ్ల వయసు దాటిన పురుషులు కూడా సులువుగా కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ విషయంలో జనాల్లో ఉన్న అపోహలు ఏమిటో, వీటికి నిపుణులు చెప్పిన సమాధానాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Muscle Building: 40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా
Build Muscle While in 40s

ఇంటర్నెట్ డెస్క్: కండలు తిరిగిన ఆకర్షణీయమైన దేహదారుఢ్యం సాధించాలని చాలా మందికి ఉంటుంది. యువకులతో పాటు 40 ఏళ్లు దాటిన కొందరు పురుషులు కూడా కండలు తిరిగిన దేహం సాధించేందుకు జిమ్‌ల బాట పడుతుంటారు. అసలు ఇది సాధ్యమేనా అనే అనుమానంతో కొందరు కాలు బయటపెట్టరు. దీనితో పాటు అనేక ఇతర అపోహలు కూడా జనాల్లో ఉన్నాయి. మరి ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, 40 ఏళ్ల తరువాత కూడా కండలు తిరిగిన దేహం కోసం ట్రై చేయొచ్చు. వయసు పెరిగాక స్ట్రెంగ్త్ ట్రెయినింగ్‌ మొదలుపెడితే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. 60లు, 70ల్లోని వారు కూడా ప్రయత్నిస్తే కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

20 ఏళ్లల్లోని వారితో 40ల్లో ఉన్న వారు పోటీపడలేరనే భావన కూడా తప్పే. వయసుతో పాటు వచ్చే నిలకడ, క్రమశిక్షణతో యువకులకంటే మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. ఈ వయసు వారు సహజంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు కాబట్టి జిమ్‌లో గాయాలయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. చేతిలో డబ్బు కూడా ఉంటుంది కాబట్టి పర్సనల్ ట్రెయినర్ సాయం కూడా తీసుకోవచ్చు.


వయసు 40 ఏళ్లు దాటాక శరీరంలో టెస్టెస్టిరాన్ స్థాయి తగ్గుతుందన్న మాట వాస్తవమే. అయితే, దేహ దారుఢ్యం పెంచుకునేందుకు ఇది ఎంత మాత్రం అడ్డంకి కాదు. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే యువతతో సమానంగా కండలు పెంచొచ్చు

వయసుతో పాటు జీవక్రియలు నెమ్మదిస్తాయన్న మాట వాస్తవమే కానీ ఒక్కసారి కసరత్తులు మొదలు పెడితే అవి మళ్లీ వేగం పుంజుకుంటాయి. కండరాలు బలపడి మెటబాలిజం వేగవంతం అవుతుంది. కొవ్వు కరిగి ఆరోగ్యం ఇనుమడిస్తుంది. అంతిమంగా ఆకర్షణీయమైన శరీర సౌష్టవం లభిస్తుంది.

40ల్లోని వారు కండలు పెంచేందుకు ఒళ్లు హూనమయ్యేలా భారీ ఎక్సర్‌సైజులు చేయాలన్న భావన కూడా తప్పే. క్రమం తప్పకుండా చేసే ఓ మోస్తరు స్థాయి కసరత్తులు కూడా దేహదారుఢ్యాన్ని పెంచుతాయి. కండలు తిరిగిన శరీరం సొంతమవుతుంది.

40ల్లోని వారికి కార్డియో కసరత్తులు మాత్రమే సేఫ్ అని అనుకోవడం కూడా తప్పే. కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రెయినింగ్‌తోనే కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. అయితే, కార్డియోతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.


40ల్లోకి వచ్చాక కండలు పెంచేందుకు సప్లిమెంట్లు కచ్చితంతా తీసుకోవాలన్నది పొరపాటు భావన. అయితే, ఇవి తీసుకుంటే మాత్రం కొంత వరకూ ప్రయోజనం ఉంటుంది. లీన్ ప్రొటీన్‌‌లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు, కూరగాయలు, తగినంత నీరుతో మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

దేహదారుఢ్యం అంటే బాడీబిల్డర్‌గా ఉండాలన్న భావన కూడా తప్పని నిపుణులు చెబుతున్నారు. శరీర లక్షణాలను అనుసరించి ఆహారం, కసరత్తులను ఎంపిక చేసుకుంటే అటు ఆరోగ్యం, ఇటు ఆకర్షణీయ శరీర సౌష్టవాన్ని సొంతం చేసుకోవచ్చు.

కాబట్టి, ఈ వయసులో కండలు పెంచాలనుకునే వారు తమ శక్తి మేరకు స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తీసుకోవాలి. వారానికి మూడు నాలుగు రోజులకు మించి జిమ్‌కు వెళ్లొద్దు. మిగతా రోజుల్లో రెస్టు తీసుకుంటే శరీరం కోలుకుంటుంది. ఈ వయసులో స్ట్రెంగ్త్ ట్రెయినింగ్‌‌తో పాటు స్ట్రెచింగ్, కార్డియో కూడా ముఖ్కమేనన్న విషయం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి:

ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ను వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే..

చియా గింజలు తినేవారికి గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు హెచ్చరిక ఇది

Read Latest and Health News

Updated Date - Jul 05 , 2025 | 09:16 PM