Share News

Telugu Author Interview: రాసేటప్పుడు ఆ కథ పట్ల ఎంతో నిజాయితీ ఉంటే తప్ప రాయలేను

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:19 AM

ఈ మధ్యనే జి. కళ్యాణరావు రాసిన ‘అంటరాని వసంతం’ నవల చదివాను. నన్ను జ్వరం పట్టుకున్నట్టు పట్టుకుందా పుస్తకం. దాదాపు వందేళ్ళపాటు సాగే ఏడు– ఎనిమిది తరాల జీవితాన్ని ఒడుపుగా అల్లిన విధానం నాకు...

Telugu Author Interview: రాసేటప్పుడు ఆ కథ పట్ల ఎంతో నిజాయితీ ఉంటే తప్ప రాయలేను

రీసెంట్‌గా ఏ పుస్తకాన్ని చదివి ఇష్టపడ్డారు?

ఈ మధ్యనే జి. కళ్యాణరావు రాసిన ‘అంటరాని వసంతం’ నవల చదివాను. నన్ను జ్వరం పట్టుకున్నట్టు పట్టుకుందా పుస్తకం. దాదాపు వందేళ్ళపాటు సాగే ఏడు– ఎనిమిది తరాల జీవితాన్ని ఒడుపుగా అల్లిన విధానం నాకు బాగా నచ్చింది. నేనింకా ఎన్నెలదిన్ని దాటి రానే లేదు.

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదివారు?

నేను టీనేజీలో ఉన్నప్పుడు ఎక్కడో విని మా ఊరి లైబ్రరీలో ఉన్న చలం ‘మైదానం’ నవల చదివాను. నా మీద చెరగని ముద్ర వేసిన పుస్తకం అది. ఒకసారి చదివిన వెంటనే ఆ చివరి పేజీని అర్థం చేసుకోవడానికి మళ్ళీ వెంటనే పుస్తకమంతా చదివా. ఇప్పటికి చాలాసార్లు చదివా. ప్రతిసారీ అందులో కొత్త విషయమేదో దొరుకుతూ ఉంటుంది.

ఒకప్పటికీ ఇప్పటికీ మీ పుస్తకాల ఎంపిక, చదివే పద్ధతి ఎలా మారింది?

చిన్నప్పట్నుంచీ నాకు పుస్తకాలంటే ఇష్టమున్నా, నాకు తెలిసినవాళ్ళెవ్వరికీ పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో, మొదట్లో ఏది దొరికితే అది చదివేవాడ్ని. ఆ తర్వాత క్లాసిక్స్ అని విన్నవి చదివేవాడ్ని. కొన్నాళ్ళకు నేనేం ఇష్టపడుతున్నానో ఆలోచించి అర్థం చేసుకొని ఇవి నాకు నచ్చొచ్చు అని వెతుక్కొని చదువు తున్నా. ఈ ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కోసారి పుస్తకం టైటిల్ చూసి చదువుతా. ఒక్కోసారి రచయిత గురించి తెలుసుకొని చదువుతా. ఏ రచయిత పుస్తకమైనా విపరీతంగా ప్రభావితం చేస్తే వాళ్ళ పుస్తకాలన్నీ చదివే ప్రయత్నం చేస్తా (బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ, ఆల్బర్ట్ కామూ, ఫ్రాంజ్ కాఫ్కాలను అలాగే చదివా). ట్విటర్‌, రెడిట్‌ డిస్కషన్స్‌లో నాకు ఏ పుస్తకమైనా ఆసక్తి కలిగిస్తే చదువుతా. కంటెంపరరీ కూడా ఎక్కువే చదువుతా. ఇంత చదివినా ఎంత చదవకుండా ఉండిపోతున్నానో కదా అనిపిస్తుంది ఒక్కోసారి.


ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?

దోస్తొయెవ్‌స్కీని కలవగలిగితే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటాను. ఆయన పుస్తకాల గురించి కంటే హ్యూమన్ సఫరింగ్ గురించి మాట్లాడవచ్చనుకుంటాను.

సాహిత్యంలో మీకు ఆల్టర్‌ ఈగోలా అనిపించిన పాత్ర ఏది? ‍

ఆల్బర్ట్ కామూ ‘ది స్ట్రేంజర్’ నవలలోని మెర్సాల్ట్ పాత్ర నా ఆల్టర్ ఈగో అనిపిస్తుంది. మేమిద్దరమూ ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో ఒకే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం గల ఇద్దరు మనుషులమేమో అనుకుంటాను. ఆ అబ్జర్డ్ పరిస్థితులకు ఇద్దరమూ లొంగిపోయేవాళ్ళమే అయినా అందుకు మేము ఎంచుకునే మార్గాలు భిన్నంగా ఉంటాయనిపిస్తుంది.

రచన విషయంలో మీకు ఉపయోగపడిన సలహా ఏదైనా?

రాయడనమనేది నాకు చాలా పర్సనల్. అంతే ప్రైవేట్ కూడా. ఇన్నేళ్ళలో ఏ పుస్తకమైనా రచయితైనా మనుషులైనా నన్ను ప్రభావితం చేసి ఉంటే అది నాలో భాగమై ఉండొచ్చేమో ఇప్పటికే. అలా కాకుండా ఏదైనా కచ్చితంగా చెప్పగలిగే ఒక సలహాను నేను రాయడానికో రాస్తూ ఉండటానికో ఎవరినుంచైనా తీసుకొని పాటిస్తున్నానా అంటే చెప్పలేను. ఒకటైతే నా అంతట నేను పాటించేది ఎప్పటికీ పోగొట్టుకోవద్దు అనుకుంటాను – అది నిజాయితీ. రాసేటప్పుడు ఆ కథ పట్ల ఎంతో నిజాయితీ ఉంటే తప్ప నేనది రాయలేను.

(వి. మల్లికార్జున్‌ కథా రచయిత. ఇప్పటిదాకా నాలుగు కథల పుస్తకాలు ప్రచురించారు. అవి: ‘ఇరానీ కేఫ్’ (2018), ‘కాగితం పడవలు’ (2019), ‘నల్లగొండ కథలు’ (2020), ‘నానిగాడు’ (2022))

వి మల్లికార్జున్‌

70752 75454

ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 01:19 AM