Share News

Bhadrachalam Submergence: భద్రాచలం ముంపు.. ఎవరి తప్పు

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:32 AM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరలో సాకారం కాబోతోంది.

Bhadrachalam Submergence: భద్రాచలం ముంపు.. ఎవరి తప్పు

న్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరలో సాకారం కాబోతోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయిన మండలాలను తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ నేతలు కోరడం, పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల ఆ ప్రాంతంలోని భద్రాచలం దేవాలయం మునిగిపోయే ప్రమాదముందని ఇప్పుడు ఆందోళన చెందడం హాస్యాస్పదం.


పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే ఏడు మండలాలను 2014లో ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అసలు బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న గ్రామాలు తప్ప మిగిలిన కూనవరం, చింతూరు, వి.ఆర్‌.పురం, భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాల, వేంకటాపురం, చర్ల, వాజేడు మండలాలన్నీ 1956కు ముందు ఆంధ్ర రాష్ట్రంలోనే భాగంగా ఉండేవి. సమైక్య రాష్ట్రంలో భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ 1959కి పూర్వం ఆంధ్ర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. అప్పటికి జిల్లా కేంద్రం కాకినాడకు ఇప్పటి వలే రహదారులు అభివృద్ధి చెందకపోవడంతో పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే లక్ష్యంతో భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. ప్రస్తుతం భద్రాచలం తెలంగాణలో ఉండగా చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం ఏపీలో ఉంది. భద్రాచలం గుడి మాన్యాలు కూడా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న మునగాల పరగణా కూడా ఒకప్పుడు కృష్ణా జిల్లాలో భాగంగానే ఉండేది.


తెలంగాణ ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద 70 టీఎంసీలతో ఎత్తిపోతల పథకం నిర్మించుకుంటూ, పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం పట్టణం మునిగిపోతుందేమోనని ఆందోళన చెందుతోంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనే ఆ ప్రాంతాలన్నింటినీ తిరిగి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే నేడు ఈ బ్యాక్‌ వాటర్‌ సమస్య వచ్చి ఉండేదే కాదు. విభజన సమయంలో ఆంధ్రా నేతలంతా ఐక్యతతో పోరాడి ఉంటే ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో కలిసేవి. వారిలోని అనైక్యత, అసమర్థత వల్లే నేడు ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి.

– దేవరకొండ శ్రీరామమూర్తి

Updated Date - Jul 24 , 2025 | 12:32 AM