Share News

Banakacharla Irrigation Project: బనకచర్లకు ప్రధాన అడ్డంకి ఎవరు

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:42 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధానానికి తెలంగాణలోని అధికార

Banakacharla Irrigation Project: బనకచర్లకు ప్రధాన అడ్డంకి ఎవరు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానానికి తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు అడ్డుపడటంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని చాలామంది భావిస్తున్నారు. ఇది అర్ధ సత్యం మాత్రమే. బనకచర్లపై తొలుత బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో తన పార్టీ వారికి ఇచ్చిన ప్రజంటేషన్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు–రేవంత్‌రెడ్డి పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రసంగించారు. సమావేశం ఆఖరులో కూడా బనకచర్ల అనుసంధానం వల్ల తెలంగాణ నీటి వాటాకు ఎలా నష్టం కలుగుతుందో చెప్పలేదు. భవిష్యత్తులో ట్రిబ్యునల్ ఏర్పడితే ‘ఇన్ని వేల కోట్లు వ్యయమయ్యాయి, కాబట్టి నికర జలాలు కేటాయించమని’ ఆంధ్రప్రదేశ్ కోరే అవకాశం ఉందని మాత్రమే ఆరోపించారు. అంతేకాదు, గోదావరి జలాలు కృష్ణలో కలిస్తే ట్రిబ్యునల్ అవార్డు మేరకు కృష్ణా జలాలు 200 టీఎంసీలు తెలంగాణకు లభ్యమవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇక అధికార పక్షం తరఫున తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గాని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాని తమకు ఏ విధంగా నష్టమో నిర్దిష్టంగా చెప్పలేదు. ఇది తొలి దశ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాజ్యాంగబద్ధత గల సంస్థలు కొర్రీలు వేశాయో, అప్పటి నుంచి తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలకు బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కావలసినంత ఇంధనం దొరికింది.


తొలుత, కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ కొర్రీ వేసింది. అంతర్ రాష్ట్ర జల వివాదం ఉందని, ముందుగా కేంద్ర జల సంఘం వద్ద తేల్చుకొని, తర్వాత తమ వద్దకు రమ్మంది. ఇది అర్థం లేని కొర్రీ. ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇటీవల తెలంగాణలో గాని పలు ప్రాజెక్టులకు కేంద్రం జల సంఘం ఆమోదం లేకున్నా పర్యావరణ అనుమతులు ఇచ్చిన సందర్భముంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం ఆమోదించలేదు. కాని పర్యావరణ అనుమతులు లభించాయి. మరి బనకచర్లకు మాత్రమే ఎందుకిలా జరిగింది? పైగా కేంద్ర జల సంఘం మరీ చోద్యమైన ప్రశ్నలు వేసింది. వరద జలాలకు నిర్వచనం చెప్పమంది. వరద జలాలను ఎలా లెక్కిస్తారో వివరించమని కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు 75 శాతం డిపెండబిలిటి ఉన్న తర్వాత మిగిలే వరద నీళ్లలో బనకచర్లకు ఉండే డిపెండబిలిటి శాతం నివేదించమని కోరింది. అంతర్ రాష్ట్ర జల వివాదంతో పాటు ఇంకా కేంద్ర జల సంఘం అడిగిన సమాచారం పరిశీలిస్తే, పొమ్మన లేక పొగబెట్టిన చందంగా ఉంది. కిందా మీదా పడి కేంద్ర జల సంఘం అడిగిన సమాచారం ఇవ్వవచ్చు. దాంతో అది సంతృప్తి పడుతుందా? లేదా అనేది వేరే విషయం.


కానీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేవనెత్తిన సందేహాలు మాత్రం ఇప్పట్లో తీర్చగలిగేవి కావు. పోలవరం ప్రస్తుతం 41.15 మీటర్ల ఎత్తులో తొలి దశకు మాత్రమే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్న అసలు చిదంబర రహస్యం పేర్కొంటూ, పూర్తి ప్రయోజనాలు తొలి దశలో తీరవని, ప్రాజెక్టు 45.72 మీటర్లు ఎత్తులో నిర్మాణం జరిగిన తర్వాతే బనకచర్ల అనుసంధానం ఆలోచన చేయాలని తేల్చేసింది. ఇది వాస్తవం కూడా. నికర జలాలు గల పోలవరం రెండవ దశ డీపీఆర్‌ ఆమోదం గురించి పట్టించుకోకుండా, వరద జలాల ఆధారంగా ఉండే ప్రాజెక్టుల కోసం వెంపర్లాడటం ఒకింత ఆశ్చర్యమే. అంతేకాదు, పోలవరం ఆపరేషన్ షెడ్యూల్ మార్చవలసి ఉంటుందని, కొత్తగా అనుమతులు పొందవలసి ఉంటుందని అథారిటీ బాంబు పేల్చింది. మున్ముందు, ఈ అగడ్తను కేంద్ర జల సంఘం తిరస్కరించి, డీపీఆర్‌ ఆమోదిస్తుందా? ఇక, మరొక చట్టబద్ధత గల గోదావరి యాజమాన్యం బోర్డు కూడా మోకాలడ్డింది. కేంద్ర ప్రభుత్వానికే చెందిన నాలుగు సంస్థలు కట్టగట్టుకొని బనకచర్ల అనుసంధానానికి వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చిన తర్వాత తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు మరెంతగా చిందులు వేస్తాయో ఊహించవచ్చు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలే వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తన అధీనంలో ఉండే సంస్థలచే అనుకూలమైన రిపోర్టు ఇప్పించే అవకాశం లేదు. ఆ పార్టీ తన చేతులకు మట్టి అంటకుండా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ తన కన్నా వెనుకబడటం, పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో, రానున్న శాసనసభ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బనకచర్ల అంశంలో ఏ మాత్రం అనుకూలంగా వ్యవహరించినా, అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీ... బీజేపీని బదనాం చేసే అవకాశం ఉంది. అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాకుండా, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ప్రేక్షకపాత్ర వహించారు. నిపుణుల కమిటీ ప్రతిపాదన కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారు. కొసమెరుపు ఏమంటే– నిపుణుల కమిటీ పరిశీలనలో బనకచర్ల పేరు కేంద్ర జల వనరుల శాఖ విడుదల చేసిన ప్రకటనలో లేదంటున్నారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీని కాళేశ్వరం ప్రాజెక్టు లొసుగులతో బదనాం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసే కొద్దీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి నేపథ్యం బూచిగా చూపెట్టి, బనకచర్ల అనుసంధానంపై యాగీ చేస్తుంటారు.


ఢిల్లీ సమావేశం తర్వాత ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా మరో పోరాటం మొదలవుతుందని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. వాస్తవం చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు సుడిగుండంలో బనకచర్ల అనుసంధానం చిక్కుబడింది. లేకుంటే 2014–19 మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గోదావరి–పెన్నా అనుసంధానం గురించి ముమ్మర ప్రచారం మొదలు పెట్టినప్పుడు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం పెట్టలేదు. పైగా గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ నీళ్లు ఎందుకు లేవు? ఆంధ్రప్రదేశ్‌లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన గోదావరి–పెన్నా అనుసంధానం కూడా ప్రస్తుతం గగన కుసుమం అయింది. ఏతావాతా తేలినదేమంటే తన చేతులకు మట్టి అంటకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకొంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాల పోరులో బనకచర్ల చిక్కుకుంది.

-వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు

Updated Date - Jul 24 , 2025 | 12:42 AM