Share News

Hyderabad Literary Events: గొప్ప జాతరలా ఆవిష్కరణ

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:15 AM

ఇంత వరకు నావి 23 కవిత్వ సంపుటాలు వచ్చాయి. నా మొదటి పుస్తకం ‘నేపథ్యం’ 1991లో వచ్చింది. నేను కవిత్వంలోకి ఆలస్యంగా వచ్చినా చాలా విరివిగా కవిత్వం రాశాను. కొన్నిసార్లు ఒకే రోజు ఐదారు పేపర్లలో కవితలు వచ్చేవి...

Hyderabad Literary Events: గొప్ప జాతరలా ఆవిష్కరణ

ఇంత వరకు నావి 23 కవిత్వ సంపుటాలు వచ్చాయి. నా మొదటి పుస్తకం ‘నేపథ్యం’ 1991లో వచ్చింది. నేను కవిత్వంలోకి ఆలస్యంగా వచ్చినా చాలా విరివిగా కవిత్వం రాశాను. కొన్నిసార్లు ఒకే రోజు ఐదారు పేపర్లలో కవితలు వచ్చేవి.

ద్వారకా మిత్రులు రోజూ కలుసుకొంటున్న క్రమంలో– శివారెడ్డి సార్, దేవిప్రియ సార్, ‘‘నీ పుస్తకం రావాలి రాజూ,’’ అన్నారు. నాకు ప్రచురణ గురించి ఏమీ తెలియదు. వాసిరెడ్డి నవీన్‌తో మాట్లాడి నన్ను కవితలు ఫెయిర్ చేసి తెమ్మన్నారు. వాళ్లు వాటిని చదివి, ఆలోచించి ‘నేపథ్యం’ టైటిల్ ఖాయం చేశారు. నవీన్ ఒక నాలుగు రోజుల తర్వాత డిటిపి పేపర్లు తెచ్చి నన్ను ప్రూఫ్‌లు చూడమన్నారు. ముందుమాట కోసం శివారెడ్డి చాలా టైం తీసుకొని రాశారు. ఒకరోజు కవర్ పేజీ గురించి శీలా వీర్రాజు గారికి స్క్రిప్ట్ ఇచ్చి వచ్చాం. మరునాటి నుండి హైదరాబాద్‌లో మూడు రోజులు కర్ఫ్యూ. ఆ సమయంలో కవర్ పేజీ పూర్తయింది. కవర్ పేజీ బొమ్మను చూసి నేను థ్రిల్ అయ్యాను. వీర్రాజుగారు నన్ను కాచిగూడాకో మరెక్కడికో బ్లాకులు చేయించడానికి తీసుకెళ్లారు. బ్లాకులు వచ్చాక వాటిని నవీన్ గారికి అందజేశాను. అంతా నవీన్ గారే చూసుకొన్నారు. పుస్తకాన్ని చూడగానే నా కళ్లల్లో ఆనందం తడిసింది ఆవిష్కరణ 1991 మార్చి 12న హైదరాబాద్‌ సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లిలో జరిగింది. సినారె ముఖ్య అతిథి, ఆవిష్కర్త. దేవిప్రియ అధ్యక్షులు. కవిత్వం గురించి మాట్లాడే వాళ్లు, పాపినేని శివశంకర్, స్మైల్. ఆనాటి పద్ధతి ప్రకారం ముందుమాట రాసిన శివారెడ్డిని వేదిక మీదికి పిలవలేదు. ఝరీ పోయెట్రీ సర్కిల్ సంప్రదాయం ప్రకారం పూల దండలు లేవు, శాలువాలు లేవు. ఆవిష్కరణ సభ గొప్ప జాతరలా జరిగింది. హాలంతా కిటకిట లాడింది. అంత మంది వస్తారనుకోలేదు. ఆ రోజు 70–80 కాపీలు అమ్ముడుపోయాయి. అప్పట్లో అది పెద్ద విషయం.


సినారె అద్భుతంగా మాట్లాడారు. గారడీవిద్యలా కవిత్వాన్ని ప్రదర్శించారు. మాంత్రికుడిలా మాటలు అల్లి మెస్మరైజ్ చేశారు. పుస్తకం చేతిలో పట్టుకొని, ‘‘నేను ఒక పేజీ తెరుస్తాను. అందులో కవిత్వం లేకపోతే, స్టేజీ దిగిపోతాను’’, అని, సవాల్ విసిరినట్టు, ఉప్పొంగి ప్రసంగించారు. దేవిప్రియ సార్ సభను ముషాయిరాలా జరిపారు. ఆయన మాట్లాడుతూ, ‘‘వీర్రాజు గారు కవరు పేజీ ఇలా వేశారు కానీ, ఆశారాజు ఒక చేతికి పూలదండ చుట్టి, మరొక చేతిలో సైకిల్ చైన్ పెట్టి, చార్మినార్ ముందు నిలుచున్నట్టు ఉంటే బాగుండేది’’, అని మురిసిపోయారు. ఒక నాటకంలా సభ ముగిసింది. సభ ముగిసిన తర్వాత చేరా, శివారెడ్డి, దేవిప్రియ, స్మైల్, జగన్నాథశర్మ, పాపినేని గారి హోటల్‌కు, నాంపల్లి వెళ్లాం. అక్కడ రాత్రంతా కవిత్వం నిషాలో మైమరిచారు. ఒక లారీ నిండా ఫుడ్ వదిలేశారు. జగన్నాథ శర్మ జంధ్యం డాన్స్ చేసి రాత్రిని ఊపేశాడు. చేరా ఒలికి పోకుండా మునిలా నవ్వుతూ కూర్చున్నారు. అలా దృశ్యాలు దృశ్యాలుగా సభానంతర సభలో తెల్లవారింది.

ఆశారాజు

asharaju.poet@gmail.com

ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 01:15 AM