Share News

దేహపు మాటలు

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:18 AM

చీకటిలో నా గుండెల మీద నీ తలను ఉంచి కురులను ఆరేసుకున్నావు మన కాళ్లు ఏ భయాలూ లేకుండా నగ్నంగా పెనవేసుకున్నాయి నువ్వు అమాయకంగా, ప్రేమగా హత్తుకున్న నా ఒళ్ళంతా నీ వెచ్చని స్పర్శతో మురిసిపోతూ ఉంది....

దేహపు మాటలు

చీకటిలో నా గుండెల మీద నీ తలను ఉంచి కురులను ఆరేసుకున్నావు

మన కాళ్లు ఏ భయాలూ లేకుండా నగ్నంగా పెనవేసుకున్నాయి

నువ్వు అమాయకంగా, ప్రేమగా హత్తుకున్న నా ఒళ్ళంతా నీ వెచ్చని స్పర్శతో మురిసిపోతూ ఉంది.

నువ్వు కలలు కంటూ ఉంటావు

గాఢనిద్రలో నక్షత్ర పడవ మీద తేలిపోతూ కూడా హాయిగా నిద్రపోతూ ఉంటావు

నువ్వు నిద్రపోవటం కోసమే ఈ రాత్రి ఇంత ప్రశాంతంగా ఉందేమో!

నీ కడుపులో ఇన్నాళ్లూ ఒక చల్లని నిద్రను మోసుంటావు

పొద్దునే అంట్లు తోమే, కసువు ఊడ్చే పని లేకుండా

పిలగాడో, పాపో అర్ధరాత్రి మేలుకోకుండా,

నేను నీ భుజం కదపకుండా ఉండే ఒక చల్లని నిద్రను ఇన్నాళ్లూ మోసుంటావు...

నీ కురులు ఎంత మెత్తటివో ఇప్పుడే తెలిసింది నాకు

అవి నా ముఖం మీద మబ్బుల్లా తారాడుతున్నాయి

నీ తలను నిమురుతుంటే ఒడ్డున కూర్చొని సముద్రాన్ని జోకొడుతున్నట్టు

నా వేళ్ళు గవ్వలుగా మారిపోతున్నట్టు ఉంది.

నోటితో మాట్లాడటమే మాట్లాడటం అనుకున్నాను

కాళ్లు పడుతూనో, కాలి వేళ్ళతోనో, చూపులతోనో, పెదవులతోనో నీతో మాట్లాడవచ్చని

ఎంత ఆలస్యంగా తెలుసుకున్నాను

నా దేహమంతా మాట్లాడుకోవటానికే నిన్ను చేరుకుందేమో అనిపిస్తోంది.

ఇదిగో నీ ముక్కు మీద ముద్దు పెట్టి నిజం చెప్తున్నా

ఇన్ని కౌగిళ్లు నీకు దోసిట్లో పెట్టి ఇవ్వటమే ప్రేమని ఇన్నాళ్లూ తెలియలేదు నాకు.

ఇంత గాఢరాత్రి మరి నక్షత్రాలు కూడా ఆవులిస్తోన్న

నిశ్శబ్దంలో మేలుకొని, తేరుకొని ఏమిటో పిచ్చిగా రాసుకుంటున్నా

నిన్ను హత్తుకొని చెప్పలేని, అర్థంకాని మాటలతో, సుదూరాల నుంచి మోసుకొచ్చిన నిన్నటి కబురులా,

మిగిలినదేదో చెప్పాలని మాట్లాడుతున్నట్టే ఉంది.



కానీ చూడూ నిన్ను పొదువుకొని నిద్రపోతే సరిపోయేదానికి,

వెర్రిగా ఇంత ఆరాటమూ పడుతున్నాను

అయినా నీకు కొత్తగా చెప్పగలిగింది ఏముంది

యుగాల నుంచీ నిన్ను మౌనంగా ఉంచానుగా

నువ్వే ఒక్కసారి మాట్లాడవూ.

గూండ్ల వెంకట నారాయణ

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:18 AM