Investigation Mystery: ఏంటో.. అలా చనిపోతుంటారు
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:55 AM
రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోనూ, 2019 ఎన్నికల ముందు జరిగిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ కీలక సాక్షులు, నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో మరణించారు.
పరిటాల రవి, వివేకా హత్య కేసుల్లోనూ
సాక్షులు, నిందితుల వరుస మరణాలు
కీలక వ్యక్తుల అనుమానాస్పద మృతి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోనూ, 2019 ఎన్నికల ముందు జరిగిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ కీలక సాక్షులు, నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో మరణించారు. అనంతపురం టీడీపీ ఆఫీసులో పరిటాల రవిపై కాల్పులు జరిపిన పటోళ్ల శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను అదే అనంతపురం జిల్లా జైలులో హత్యకు గురయ్యాడు. పరిటాల హత్యకు ముందు పలుమార్లు రెక్కీ నిర్వహించిన వ్యక్తులు పులివెందులకు చెందినవారు కావడం.. పులివెందులలో రవిపై కేసు పెట్టించి అక్కడికి రప్పించే ప్రయత్నం చేయడం.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు అధికారులతో పరిటాల రవిని పదే పదే తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం వెనుక జగన్ ఉన్నారంటూ అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి పులివెందులలో సొంత ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యారు. అయితే జగన్ మీడియాలో గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం చేశారు. ఇళ్లంతా రక్తం ఉన్నా ఆనవాళ్లు లేకుండా కడిగేసి.. వివేకా నుదుటిపై గొడ్డలి వేట్లు లోతుగా ఉన్నా కనపడకుండా కుట్లు వేయించి హడావుడిగా అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తండ్రి ఒంటిపై గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి జరిగిన హత్య వెలుగులోకి వచ్చింది. అప్పటి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్ తన రోత మీడియాలో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కల్పిత కథనాన్ని వండి వార్చారు. సానుభూతితో ఎన్నికల్లో విజయం సాధించి తర్వాత కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఈ కేసులో జగన్ సోదరుడు, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లోనూ కీలక సాక్షులు, నిందితులు అనుమానాస్పదరీతిలో మరణించారు. గత జగన్ ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో డబ్బులు లెక్కిస్తూ కాజేసిన రవికుమార్‌ను పట్టుకున్న నాటి టీటీడీ విజిలెన్స్ ఏవీఎ్‌సవో సతీశ్ కుమార్ ఇప్పుడు అనుమానాస్పదరీతిలో మరణించారు.
వివేకా కేసులో మరణాలు
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అదే ఇంటి వరండాలో ఉన్న కీలక సాక్షి వాచ్‌మన్ రంగన్న కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రి పాలై మరణించాడు. సీబీఐ విచారించిన సాక్షుల్లో వాంగ్మూలం ఇచ్చినవారిలో రంగన్న చాలా కీలకం.
వివేకా హత్య కేసులో కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుమానితుడు. 2019 సెప్టెంబరులో విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివేకా మరణవార్త వేకువజామున తెలియగా, కాస్త ఆలస్యంగా జగన్ దంపతులు హైదరాబాద్ నుంచి కారులో పులివెందుల బయలు దేరారు. ఆ కారు నడిపిన డ్రైవర్ లక్ష్మీనారాయణను సీబీఐ విచారించింది. కారు నడుపుతున్న సమయంలో జగన్ దంపతులు ఏం మాట్లాడుకున్నారనేది గుర్తున్న వరకు వెల్లడించిన ఆయన.. 2019 డిసెంబరులో అనారోగ్య కారణాలతో మృతిచెందాడు.
వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. హత్య చేస్తే ఎంపీ అవినాశ్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని చెప్పారని సీబీఐకి చెప్పిన కొద్ది రోజులకే అతడు చనిపోయాడు.
వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఒకరు. వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పింది ఆయనే. జగన్‌కు సోదరుడు అవుతారు. 30ఏళ్లకే తీవ్ర అనారోగ్యంతో ఆయన మరణించారు. ఆ అనారోగ్యం ఏమిటనేది ఇప్పటికీ వైఎస్ కుటుంబం బయటపెట్టలేదు.
వివేకా మృతదేహానికి కట్లుకట్టిన జగన్ మామ గంగిరెడ్డి అకస్మాత్తుగా మరణించారు. అనారోగ్యం తో చనిపోయారని చెప్పారు. అయితే తల కింద రక్తంమరకలు ఉండటంతో మిస్టరీగా మారింది.
పరిటాల రవి కేసులో..
టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో రెండో నిందితుడు మొద్దు శీనును 2008 నవంబరు 9న అనంతపురం జిల్లా జైల్లో హత్య చేశారు. అప్రూవర్‌గా మారుతానని చెప్పిన శీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓంప్రకాశ్ అతడ్ని సిమెంట్ డంబెల్‌తో కొట్టిచంపాడు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఓం ప్రకాశ్ అనారోగ్యంతో చనిపోయాడు.
పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెరువు సూరిని 2011 జనవరి 3న హైదరాబాద్ యూస్‌ఫగూడలో చంపారు. బెయిల్‌పై ఏడాదికే బయటకొచ్చిన సూరిని అతని అనుచరుడైన భానుకిరణ్ కాల్చిచంపాడు.
పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా కాల్పుల ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలున్న గ్యాంగ్‌స్టర్ అజీజ్‌రెడ్డిని 2008 మే 1న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్‌కౌంటర్ చేశారు.
పరిటాల కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లాక మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేసిన బృందంలో ఉన్న మల్లికార్జున రైల్లోంచి దూకి మరణించారు.
జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్‌ఫోన్లు అందించేవారని, వాటి ద్వారా మాట్లాడే పరిటాల హత్యకు సూరి పథకం వేశారనే ఆరోపణలున్నాయి. రవి హత్య జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.