Share News

Hinduism And Adivasis: ఆదివాసుల మతం ఏమిటి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:50 AM

జనాభా గణన అధికారి మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నన్ను మీ మతం ఏమిటి అని అడుగుతారని

Hinduism And Adivasis: ఆదివాసుల మతం ఏమిటి

నాభా గణన అధికారి మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నన్ను ‘మీ మతం ఏమిటి’ అని అడుగుతారని ఎంతో ఆశతో ఎదురుచూసేవాణ్ణి. కానీ, నా ఆశను అడియాశ చేస్తూ నన్ను అడగకుండానే వారు నా మతాన్ని హిందువుగా నమోదు చేసేవారు. ఎందుకు మతం అడగలేదని వారితో అంటే, మీరు హిందువులు కదా అని ఆశ్చర్యంగా సమాధానం ఇచ్చేవారు. జనగణన సమయంలో ప్రతి ఆదివాసీ బిడ్డకు ఎదురయ్యే సంఘటన ఇది. కేంద్ర ప్రభుత్వం 2021లో జరగాల్సిన జనగణనను ఎట్టకేలకు 2027లో నిర్వహించడానికి నిర్ణయించింది. ఈ జనగణనలో ఒక ప్రత్యేకత ఏమంటే, ప్రతి పౌరుడి కులాన్ని నమోదు చేయటం. 1931 తరువాత కులాలవారీ జనగణనను నిలిపివేశారు. దీంతో పాటు ఆదివాసులను Other Religions and Persuasion (ORP) అనే మత కేటగిరీ నుంచి తొలగించి హిందూ మతంలో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇదే జరిగితే ఆదివాసులు తమ మతాన్ని ప్రత్యేక మతంగా నమోదు చేసుకునే హక్కును కోల్పోతారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 నిబంధనను ఉల్లంఘించడమే. ఈ నిబంధన– ప్రతి పౌరుడు తనకు ఇష్టమొచ్చిన మతాన్ని ఆచరించే హక్కును కల్పిస్తోంది. వందలాది మత సమూహాలు ఈ నిబంధనను ఉపయోగించుకుని ఓఆర్‌పీ కేటగిరీలో తమ మతాన్ని నమోదు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలం నుంచే ఆదివాసులు తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్‌తో ముందుకు వస్తున్నారు. ఈ డిమాండ్‌ను ఆదిలోనే తొక్కేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఆదివాసులను గుండుగుత్తగా హిందువులుగా నమోదు చేస్తున్నారు.


వాస్తవానికి ఆదివాసుల మత విశ్వాసాలకూ హిందూ మతానికీ ఏ సంబంధమూ లేదు. బ్రిటిష్‌ వలస పాలనలో 1871లో మొదలైన జనగణనతోనే ఆదివాసుల మతం ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటిష్‌ పాలకులకు ఎవరిని హిందువులుగా గుర్తించాలనే ప్రశ్న ఒక సవాలుగా మారింది. ఎందుకంటే అప్పటికి దేశంలో ఇస్లామేతర మతాలు తమ ప్రత్యేక ఉనికిని కలిగివుండేవి. మొదటగా ఇస్లామేతర మత విశ్వాసాలను బ్రిటిష్‌ వారు పెగానిజంగా పరిగణించారు. అంటే బహుదేవత ఆరాధన, ఆత్మలను, ప్రకృతిని పూజించటం, విగ్రహారాధన చేయడం. ఈ మతాచారాలకు 19వ శతాబ్దంలో హిందూ మతంగా నామకరణం చేశారు. ఇందులో బ్రిటిష్‌ పాలకులతో పాటు, మత సంస్కరణవాదులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇండియాలో పురాతనకాలం నుంచి అనేక ప్రాంతీయ మతాచరణలు ఉన్నాయి. అయితే దేశ స్థాయిలో బ్రాహ్మణ (వైదిక), శ్రమణ (బౌద్ధ, జైన) మతాలు ఉండేవి. ఇవి మళ్లీ అనేక శాఖలుగా విభజన అయ్యాయి. బ్రాహ్మణిజం ముఖ్యంగా వైష్ణవ, శైవంగా విభజన అయింది. శైవిజం బ్రాహ్మణేతర మతాచారాల నుంచి అభివృద్ధి చెందింది. హిందూ అనే పదాన్ని 11వ శతాబ్దం ముస్లిం చరిత్రకారుడు అల్బెరూనీ మొదటిసారి వాడారు. దీనిని సింధూ నది తూర్పున ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని, ఆ ప్రజల సంస్కృతిని వర్ణించడానికి వాడారు. క్రమంగా ముస్లిమేతరులను హిందుస్థానీలుగా వర్ణించారు. అలా ఈ పదం ముస్లిమేతరుల భాష, సంస్కృతి, మతాచారాలను వర్ణించడానికి వాడారు.


బ్రిటిష్‌ పాలకులు దేశంలోని విభిన్న మత విశ్వాసాల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి హిందూయిజంను ఏకరీతి మతంగా రూపొందించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఒక మతాన్ని ఆధునిక మతంగా గుర్తించాలంటే అది మోనోథియిజం (ఒకే దేవుని విశ్వాసం) పునాది మీద నిర్మితమై ఉండాలి. హిందూయిజంలో కోట్లాది దేవతలున్నారనే భావన ఉంది. మరి ఇది ఆధునిక మతం ఎట్లా అవుతుందనే ప్రశ్న వచ్చింది. అప్పుడు రాజా రామ్మోహన్‌రాయ్‌ వేదాంత గ్రంథాల్లో మోనోథియిజం ఉందని ప్రచారం చేయడంతో ఇది ఆధునిక మతంగా గుర్తింపు పొందింది. హిందూయిజాన్ని ఒక మతంగా పరిగణించిన తరువాత ఎవరిని హిందువులుగా గుర్తించాలనే ప్రశ్న ముందుకొచ్చింది. ఏ కులం, సమూహం హిందూయిజంలో భాగం అనే ప్రశ్న అపరిష్కృతంగా ఉండిపోయింది. ఈ చర్చ ఆదివాసుల మతవిశ్వాసాలపై చాలా ప్రభావం చూపింది. ఎందుకంటే హిందూయిజానికి, ఆదివాసీ మతానికి మధ్య గీత క్రమంగా చాలా పలచనైంది. అనేక ఆదివాసీ దేవతలు హిందూ దేవతలుగా చలామణి అవుతున్నారు. ఆ దేవతలకు సంస్కృత పేర్లు పెట్టి, ఆ దేవతలను ఆదివాసీలకు కాకుండా చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.


ఎవరిని హిందువులుగా గుర్తించాలనే చర్చ 19వ శతాబ్దం చివరి అంకంలో తారస్థాయికి చేరింది. దయానంద సరస్వతి హిందూ మతంలోని బహుళ అంధ మత ఆచరణలను తిరస్కరించి శుద్ధ ఆర్యవాదాన్ని ప్రచారం చేశారు. ఆయన దృష్టిలో నిజమైన హిందువులు కేవలం ఆర్యులు. కానీ 20వ శతాబ్దానికి వచ్చేసరికి మత రాజకీయాలు మొదలైనాయి. అప్పుడు మత గణాంకాలు రాజకీయ అధికారానికి మార్గమయ్యాయి. ఈ నేపథ్యంలోనే హిందూ మహాసభ నాయకుడు సావర్కర్‌ 1923లో ‘‘హిందూత్వ: హిందువు ఎవరు?’’ అనే రచనలో ఎవరు హిందువు అనే విషయాన్ని నిర్వచించారు. ఆయన ప్రకారం... ఎవరైతే భారతదేశాన్ని పితృభూమి, పుణ్యభూమిగా స్వీకరిస్తారో వారే హిందువులు.


ఈ భావజాలం దేశంలో మతతత్వ వాదానికి మరింత ఆజ్యం పోసింది. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు గోల్వాల్కర్‌– ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు హిందూమతానికి శత్రువులని ప్రకటించారు. దీనికి విరుద్ధంగా మహాత్మాగాంధీ– హిందువు అంటే అన్ని మతాలను గౌరవించేవాడు అని నిర్వచించారు. ఈ మత రాజకీయాలు ఆదివాసీ సమాజాన్ని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టివేశాయి. ఆదివాసులను తమ మతంలో కలుపుకోవడానికి హిందు, క్రిస్టియన్‌ మతాలు పోటీపడ్డాయి. క్రిస్టియన్లు మొదటగా కొంత పైచేయి సాధించినా, హిందూ నాయకులు బ్రిటిష్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఆదివాసులను గుండుగుత్తగా హిందూయిజంలో కలుపుకునే ప్రయత్నం చేశారు. 1941లో అధికారికంగా ప్రకటించకపోయినా ఆదివాసులు హిందువులుగా నమోదయ్యారు.


ఆదివాసుల మతాన్ని జనగణనలో నమోదు చేయడం మొదటి నుంచి (1871–72) క్లిష్టంగానే ఉండేది. అందుకు కారణం హిందూ మతానికి ఒక స్పష్టమైన నిర్వచనం లేకపోవడమే. హిందూ మతం నుంచి ఇతర స్థానిక మతాలను వేరు చేయడం అధికారులకు సవాలుగా మారింది. 1871 జనగణనలో ఆదివాసులను వారి జాతి పేరుతో (ఓఆర్‌పీ) కేటగిరీ కింది నమోదు చేశారు. 1881లో కూడా ఇదే పద్ధతిని కొనసాగించారు. 1891 నుంచి ఆదివాసి మతాన్ని Animistగా పరిగణించారు... అంటే ప్రకృతి ఆరాధకులుగా. దీనిపై పెద్ద చర్చ జరిగింది. 1921లో యానిమిస్ట్‌ స్థానంలో ట్రైబల్‌ రెలిజియన్‌ అనే పదాన్ని వాడారు. అయితే హిందూ మహాసభ, ఆర్యసమాజ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఆదివాసులను హిందువులుగా గుర్తించాలని జనగణన కమిషన్‌ మీద చాలా ఒత్తిడిని తీసుకువచ్చారు. వారి ఒత్తిడి వల్ల 1951 నుంచి ట్రైబల్‌ రెలిజియన్‌ను పూర్తిగా తొలగించి, ఆరు ప్రధాన మతాలతో పాటు Other Religions and Persuasion కేటగిరీని ఎంచుకునే సౌకర్యాన్ని కల్పించారు.


ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న ప్రయత్నం పూర్తిగా రాజకీయ లక్ష్యాలతో కూడినదనే విషయాన్ని ఆదివాసులు గ్రహించారు. దేశవ్యాప్తంగా తమ మతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్‌తో బలంగా ముందుకు వస్తున్నారు. ఇది సెంట్రల్‌ ఇండియాలో మరింత బలంగా ఉంది. 1951లో 18.4 లక్షల మంది ఓఆర్‌పీ కింద నమోదు కాగా, 2011లో ఇది 79.3 లక్షలకు పెరిగింది. సర్ణాధర్మంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 1991లో 18 లక్షల నుంచి 2011లో 35 లక్షలకు పెరిగింది. సర్ణ ధర్మం, సర్ణ మతం లేదా పవిత్ర అడవుల మతం అని కూడా పిలుస్తారు. ఇది గిరిజన వర్ణాలు, ముఖ్యంగా చోటా నాగపూర్‌ పీఠభూమి ప్రాంతంలో ఆచరించే, ప్రకృతిని ఆరాధించే విశ్వాసం. ఆదివాసులు చారిత్రకంగా గ్రామ, కుల వ్యవస్థకు బయట అడవుల్లో జీవించారు. క్రమంగా వారు తమ భాష, మతం, సంస్కృతిని ఏర్పరచుకుని... ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. వారి పోరాటంలో వారి చరిత్రే వారికి ఆయుధంగా ఉంది. వారి ప్రత్యేక మత, భాష, సంస్కృతి ఉనికిని తొలగించడాన్ని వారి చరిత్రను చెరిపివేసే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది.

ప్రొ. భంగ్యా భూక్యా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

Updated Date - Jul 24 , 2025 | 12:50 AM