Share News

New York Politics: ట్రంప్‌ గర్వభంగం

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:24 AM

అమెరికా పాలకులు చరిత్రను వక్రీకరిస్తున్నారు. వర్తమాన ప్రపంచ సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నారు. భవిష్యత్తు విషయమై నవతరంలో భయాందోళనలు పెంచుతున్నారు. శ్రమ జీవులు అయిన పేద వలసదారులను స్వదేశాలకు గెంటివేస్తున్నారు...

New York Politics: ట్రంప్‌ గర్వభంగం

అమెరికా పాలకులు చరిత్రను వక్రీకరిస్తున్నారు. వర్తమాన ప్రపంచ సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నారు. భవిష్యత్తు విషయమై నవతరంలో భయాందోళనలు పెంచుతున్నారు. శ్రమ జీవులు అయిన పేద వలసదారులను స్వదేశాలకు గెంటివేస్తున్నారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు సమున్నత అమెరికన్‌ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మహానగర ప్రజానీకం ఇచ్చిన తీర్పు ఆ ఒక్క నగరానికి లేదా దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది జాత్యహంకార భావనలకు గొడ్డలిపెట్టు. ప్రపంచవ్యాప్తంగా సగటు మనిషి రాజకీయ మనోగతాన్ని అవిష్కరించిన ప్రజా తీర్పు అది. కట్టుకథలతో విద్వేషాలు రెచ్చగొడుతూ తమను తప్పుదోవ పట్టిస్తున్న శ్వేతసౌధ ఆసామీని ధిక్కరిస్తూ న్యూయార్క్ ప్రజ తమ మేయర్‌ ఎన్నికలలో సంచలన, సముదాత్త తీర్పునిచ్చింది. మూర్తీభవించిన ఆ జన చైతన్యమే విజేత జొహ్రాన్‌ మమ్దానీ.

‘ఈ నగరాన్ని మీరందరూ కలిసి నిర్మించారు. ఇది మీలో ప్రతి ఒక్కరిది కూడా’ అని వలసదారులకు అభయమిస్తూ జొహ్రాన్ మమ్దానీ ఉద్ఘాటించారు. వలసల పట్ల విద్వేషం విషజిమ్ముతున్న నేలపై తెలియని ఒక నూతన పార్శ్వాన్ని మమ్దానీ విజయం ఆవిష్కరించింది. ‘రిమోట్‌తో సౌండ్ హెచ్చించుకోవడం ద్వారా నా మాటలు సరిగా విను’ అంటూ ఎన్నికయిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నుద్దేశించి మమ్దానీ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజా జీవితంలో ప్రబలమవుతోన్న కరడుగట్టిన మితవాద ధోరణులకు మమ్దానీ విసిరిన సవాల్ అట్లాంటిక్‌ మహాసముద్రానికి ఇరువైపులా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నది. ట్రంప్ ప్రేరణతో యూరోపియన్‌ దేశాలలోనూ జాత్యహంకార జాడ్యం పెచ్చరిల్లుతున్న వేళ మమ్దానీ విజయం రూపేణా ఒక ఆశావహ పరిణామం సంభవించింది.


మమ్దానీ చైతన్యశీల, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వ నిర్మాణంలో ఆయన తల్లిదండ్రుల పాత్ర మౌలికమైనది. అమ్మానాన్న ఇరువురూ ప్రవాస భారతీయులే. తండ్రి మహ్మద్‌ మమ్దానీ గుజరాతీ ముస్లిం కాగా తల్లి మీరా నాయర్‌ పంజాబీ హిందూ. తండ్రి విద్యావేత్త కాగా తల్లి మీరా నాయర్ సినిమా స్రష్ట. ప్రతిష్ఠాత్మక బహుమమతులు గెలుచుకున్న మీరా నాయర్‌ ఫీచర్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ కొన్నిటిలో వలస జీవితాలే ప్రధానాంశంగా ఉన్నాయి. 1984లో నిర్మించిన ‘India cabaret’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తెలుగు యువతి ఒకరు కుటుంబ అవసరాలకు తాను ఏ విధంగా క్యాబరే డ్యాన్సర్‌గా మారవలసివచ్చిందో వివరించింది. ఆ యువతి కుటుంబాన్ని కలిసేందుకు మీరా హైద్రాబాద్‌కు వచ్చారు. 2006లో నిర్మించిన ‘The Namesake’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో భారతీయ యువతీ యువకులు పలువురు తమ అమెరికా స్వపాన్ని సాకారం చేసుకునేందుకు స్వీయ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో మీరా విపులీకరించారు. సుప్రసిద్ధ ‘సలామ్‌ బాంబే!’ (1985) సినిమా దర్శకురాలు మీరాయే. మమ్దానీ భార్య రమా దువజీ కూడా వలసల నేపథ్యం నుంచి ప్రభవించిన విద్యావతే. అమెరికాలో జన్మించినా ఆమె తన బాల్య కౌమారాలను గల్ఫ్‌లో గడిపారు. దుబాయి, దోహాలలో విద్యాభ్యాసం చేసిన రమా దువజీ వివాహం మమ్దానీతో దుబాయిలోనే జరిగింది. అరబ్బుల వలే రమా కూడ పాలస్తీనాకు గట్టి మద్దతుదారు.

స్వయాన వలసదారుడు అయిన జొహ్రాన్‌ మమ్దానీ తన భారతీయ మూలాలకు గర్వపడతారు. అయితే న్యూయార్క్ జీవన విధానంలో సంపూర్ణంగా సమ్మిళితమయ్యారు. న్యూయార్క్‌ సగటు పౌరుని సమస్యలు, సంకటాలు గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించి విజయం సాధించారు. సంప్రదాయక రాజకీయాలకు భిన్నంగా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఓటర్ల వద్దకు వెళ్ళి వారి మద్దతు పొందిన విధానం విలక్షణమైనది. అమెరికా, అంతర్జాతీయ రాజకీయాలపై మమ్దానీ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పి మరీ ఓట్లు అడిగారు. ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే దిక్సూచి అయిన న్యూయార్క్ మహానగరంలో యూదుల జనాభా ఇజ్రాయిల్ రాజధాని టెల్‌అవీవ్‌లో కంటే అధికంగా ఉన్నది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ యుద్ధ నేరస్థుడు అని దుయ్యబట్టారు. ఒకవేళ నెతన్యాహు న్యూయార్క్ నగరానికి వస్తే ఆయన అరెస్ట్‌కు ఆదేశించేందుకు వెనుకాడనని చెప్పిన మమ్దానీ తన ప్రత్యర్థులపై తిరుగులేని అధిక్యతతో జయపతాక ఎగురవేశారు. అమెరికా రాజకీయాలలో ఇది మాములు విషయం కాదు.


సామాన్యుల సంక్షేమంపై గళం విప్పిన మమ్దానీని యూదులూ అక్కున చేర్చుకున్నారు. మమ్దానీ చరిత్రాత్మక విజయం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు, సంకుచిత భావాలకు అతీతంగా సమస్త ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన తీర్పు అది. న్యూయార్క్ కంటే చాల ముందుగా ఐరోపాలోని పెద్ద నగరమైన లండన్‌కు మూడు పర్యాయాలు మేయర్‌గా ఎన్నికైన సాదిఖ్‌ఖాన్‌ పాకిస్థానీ సంతతికి చెందినవాడు కావడం గమనార్హం. నవ భారత నిర్మాత జవహర్‌లాల్‌ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్‌ విత్‌ డిస్టెనీ’ లోని స్ఫూర్తిదాయక మాటలను మమ్దానీ తన విజయాన్ని అంగీకరిస్తూ వెలువరించిన ఉపన్యాసంలో ఉటంకించడం ఆయన వ్యక్తిత్వంలోని భారతీయతకు నిండు నిదర్శనం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 01:24 AM