Share News

Migration Of Dreams: వలస పక్షులు

ABN , Publish Date - Jul 21 , 2025 | 02:52 AM

రెండు జల్లుల తెరిపిలో బట్టలారేసుకున్నట్టు

Migration Of Dreams: వలస పక్షులు
Migration Of Dreams

రెండు జల్లుల తెరిపిలో

బట్టలారేసుకున్నట్టు

కాలం తీగెలపై బతుకులు ఆరేసుకోవాలి

కన్నీటిలోనూ

రంగులు వెతుక్కునే

ఆశలు మనవి


ఎన్ని తెరచాపలు కట్టినా

చెమట సంద్రంలోని

ఆకలి నావ నడక

కుదుటపడదు

కంటి నుండి కంటికి

కన్నీటిని రాజేసే

తడి నిప్పు ఆరదు


సాలెగూడులో చిక్కిన

పురుగుల్లా

గడియారంలోని

ముళ్ళు పెట్టే మూల్గులకు

చీకటి కిటికీ

రెప్పలు చాచగానే

తూరుపు బండి

వేకువ కూత పెడుతుంది


ఇంకో కొత్త రోజుకి

రెక్కలివ్వడానికి

నిద్రకన్ను గుడ్డిలాంతరులా

తెరుచుకుంటుంది


ఆకుల్లేని కొమ్మల్లో

వసంతాన్ని వెదుక్కుంటూ

విరిగిన బతుకుతెరువుకి

ఊతకర్రలు కట్టి

ఆకలి కడుపు దాకా

మెతుకులను ఎగదోస్తున్నా

మన కలలన్నీ వలసపక్షులే

కన్ను చూపే నిజమేమో

ఓ ఎండిన సరస్సు.

-మిరప మహేష్

Updated Date - Jul 21 , 2025 | 02:52 AM