Bhagirathi: తొలి తెలుగు ప్రకృతి చిత్రకారుడు
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:34 AM
చిత్రకళలో ప్రకృతి చిత్రలేఖనానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందమైన పర్వతాలు, నదులు, అడవులు..

చిత్రకళలో ప్రకృతి చిత్రలేఖనానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందమైన పర్వతాలు, నదులు, అడవులు, చెట్లు వంటి సహజ వాతావరణాన్ని యథావిధిగా ఆవిష్కరించడమే ‘ప్రకృతి చిత్రలేఖనం లేదా ల్యాండ్ స్కేప్ ఆర్ట్’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా– టర్నర్, జాన్ కాన్‌స్టబుల్, విన్సెంట్ వాంగో, పీటర్ బృగేల్.., మనదేశంలో– రాజా రవివర్మ, నందలాల్ బోస్, ఎస్.హెచ్. రజా, జెమినీరాయ్.. వంటి వారు పేరొందిన ప్రకృతి చిత్రకారులు. మన తెలుగు వారి విషయానికి వస్తే భగీరథి, సంజీవదేవ్, కొండిపర్తి శేషగిరిరావు, పేరి రామకృష్ణ, జోగి జగన్నాథరాజు తదితరులున్నారు. వీరిలో సంజీవదేవ్, కొండిపర్తి కాల్పనిక ప్రకృతి చిత్రాలను చిత్రించగా భగీరథి, రామకృష్ణలు సహజసిద్ధ ప్రకృతి చిత్రాలను ఆ పరిసరాల్లో కూర్చొనే చిత్రించేవారు.
భగీరథి ఎక్కువగా పోస్టుకార్డు పరిమాణంలోనే ప్రకృతి చిత్రాల్ని చిత్రించారు. ఈ ప్రత్యేకతతోనే జాతీయస్థాయిలో ఆయన గుర్తింపు పొందారు. ల్యాండ్‌స్కేప్ చిత్రాలను అత్యంత సహజంగా చిత్రించడంతో ఆయనను అందరూ ‘ఆంధ్రా టర్నర్’ అని పిలిచేవారు. బ్రిటిష్ చిత్రకారుడు ఓ.జే కూల్డ్రే వద్ద దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం, అడవి బాపిరాజు, కవికొండల వెంకటరావులతో పాటు భగీరథి కూడా శిష్యరికం చేసినా వారందరికంటే భిన్నంగా, సొంత ఆలోచనలతో చిత్రరచన కొనసాగించారు. భగీరథిలో సాటిలేని ప్రతిభ ఉన్నా, ఆయనకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. నాటి వైశ్రాయ్‌లు, మహారాజులు, జమీందార్లు, కళాభిమానులు ఎందరో ఆయన ప్రతిభను మెచ్చినా, ఆ మెప్పు ఆయన్ను ఆర్థిక సమస్యలు, పేదరికం నుంచి బయటపడేయలేకపోయింది.
కర్మ సిద్ధాంతాన్ని భగీరథి ఎక్కువగా నమ్మేవారు. శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి మహారాజ్ సూచనపై ముంబైలోని ‘జంషెట్జీ జియాజీరావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరినా, కొన్ని కారణాల వల్ల మూణ్ణెల్లకే రాజమండ్రికి తిరిగొచ్చారు. ఆయనకు చిన్న వయసులోనే రత్నమాణిక్యంతో వివాహం జరిగింది. తన భార్య ‘వై’ (wi– ఆయన అలా సంబోధించేవారు)కు చిత్రలేఖనంలో శిక్షణనిచ్చి, ఆమెను గొప్ప చిత్రకారిణిగా తీర్చిదిద్దారు. బతుకుదెరువు కోసం ఆయన గోదావరి బోర్డు స్కూల్లో డ్రాయింగ్, డ్రిల్ టీచరుగా చేరారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలైన మండపేట, పుల్లేటికుర్రు, అనపర్తి, జగ్గంపేట, సామర్లకోట వంటి స్కూళ్లలోని పిల్లలకు డ్రాయింగ్ నేర్పేవారు. చిత్రకళపై ఆసక్తితో కన్యాకుమారి, నీలగిరి కొండలు, తిరువాన్కూరు, ఆగ్రా, డుడుమా జలపాతం, పాపికొండలు, అరామపర్వతం, రాయగడ, మత్స్యగుండం, మొగల్రాజపురం తదితర ప్రాంతాలకు వెళ్లి చిత్రాలు గీసేవారు. ల్యాండ్ స్కేప్, రాక్ స్కేప్, హిల్ స్కేప్, వాటర్ స్కేప్, స్కై స్కేప్‌లకు సంబంధించి చిత్రాలను భగీరథి గీశారు.
విజయనగరంలో 1933లో నిర్వహించిన స్వదేశీ చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి, 1934లో మరో చిత్రకళా ప్రదర్శనలో బంగారు పతకం గెలుచుకున్నారు. ఆయన తన చిత్రాల్లో లేత రంగుల్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రకృతి రమణీయత, సహజత్వంతో నిండిన ఆ చిత్రాలను చూస్తే మనం ఆ ప్రాంతంలో ఉన్నామా? అన్న భావన కలుగకమానదు. భగీరథి గొప్ప ప్రకృతి చిత్రకారుడే కాదు మంచి కవి, తాత్వికుడు, మంచి వక్త. ఆయన కృష్ణ శతకం, జగదంబ శతకం, భావకుసుమావళి తదితర శతకాలు రచించారు. భగవద్గీత సారాన్ని భగీరథి సారంగా 2,500 పద్యాల్లో చెప్పారు. లార్డ్ మౌంట్ బాటన్, మహాత్మాగాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులెందరో భగీరథలోని చిత్ర ప్రతిభను గుర్తించి, ఆయనను సత్కరించారు. తన చిత్రకళా ప్రతిభతో చిన్న వయసులోనే ఎంతో ఖ్యాతి గడించిన భగీరథి 1949 నవంబరు 19న (నలభై తొమ్మిదేళ్లకే) కీర్తిశేషులయ్యారు.
ఆయన గీసిన చిత్రాలన్నీ చూపరుల హృదయాల్లో వేదన, తపన, శ్రద్ధ, రసానుభూతి వంటి ఉద్వేగాలను కలిగిస్తాయి. వీరి సూర్యోదయం, చంద్రోదయం చిత్రాలు హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలోను, సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం– హైదరాబాద్, విశాఖ మ్యూజియం, అనపర్తి ఉన్నత పాఠశాలలోనూ ఉన్నాయి. ఇవేకాక 42 చిత్రాలు, 14 అసంపూర్తి చిత్రాలు, ఆల్బమ్స్, డైరీలు, పేపర్ కటింగ్స్ వంటివన్నీ ఆయన మనవరాలు ఎన్.వి.పి.ఎస్.ఎస్. లక్ష్మి సేకరించి భద్రపరిచారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయిని, రచయిత్రి మాత్రమే కాదు తన తాతయ్య లాగా మంచి చిత్రకారిణి కూడా. తన తాతయ్య జీవిత చరిత్రను గ్రంథస్తం చేశారు. ఆయన పేరుతో ‘భగీరథి ఆర్ట్ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి, చిత్రకళాభివృద్ధికి కృషి చేస్తున్నారు. భగీరథి 125వ జయంత్యుత్సవాల సందర్భంగా జూలై 27న రాజమండ్రిలోని గోదారి ఒడ్డున గల ‘చందా సత్రం’ వేదికగా భగీరథి చరిత్ర గ్రంథాన్ని ఆయన మనవరాలు లక్ష్మి ఆవిష్కరించనున్నారు.
సుంకర చలపతిరావు కళారత్న అవార్డు గ్రహీత