PM Narendra Modi visits: బలపడుతున్న బంధం
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:30 AM
మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రెండురోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ

మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రెండురోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు ఆ దేశంలో కాలూనుతున్నారు. మాల్దీవుల్లో మోదీ పర్యటన ఇది మూడవసారి కావచ్చునుగానీ, జూలై 26నాటి ఆరుపదుల స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు భారత ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎంచుకోవడం విశేషమైన పరిణామం. రెండేళ్ళక్రితం ముయిజ్జు అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ఆయన ఎత్తుకున్న ‘ఇండియా అవుట్’ నినాదం ఉపకరించిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత కూడా ఆయన భారత్ విషయంలో దూకుడుగానే వ్యవహరించారు. మాటలతో, చేతలతో స్పష్టమైన భారతవ్యతిరేక వైఖరిని తీసుకున్న ముయిజ్జు, చైనాతో చేయీచేయీకలిపారు. ఇప్పుడు మోదీని ఆహ్వానించినంత మాత్రాన ముయిజ్జు మారిన మనిషని గట్టిగా చెప్పలేం కానీ, అవసరాల్లోనూ ఆదుకుంటున్న భారత్‌ను కాదనగలిగేస్థితిలో తాను లేనన్న వాస్తవం ఆయనకు తెలిసొస్తున్నట్టు ఉంది.
మాల్దీవుల స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భారత జెండాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో అక్కడి మేధావులు కొందరు ఆక్షేపిస్తున్నారట. భారతప్రధాని మనసుదోచుకోవడానికి ముయిజ్జు ప్రభుత్వం కాస్త ఎక్కువగానే హడావుడి చేస్తున్నదని వారి అభిప్రాయం. భారత్‌ను పక్కనబెట్టి, చైనా, గల్ఫ్ దేశాలమీద ఆధారపడి రాజ్యపాలన చేసుకోగలనని ఆయన ఆదిలో గట్టిగా నమ్మాడు. కానీ, భౌగోళికంగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక అతిపెద్ద దేశాన్ని, ఓ బలమైన వాణిజ్య, అభివృద్ధి భాగస్వామిని కాదని, సంబంధాలు వదులుకొని తన దేశాన్ని నడపడం అసాధ్యమన్న విషయాన్ని ఆయన అనతికాలంలోనే గ్రహించాడు.
ముయిజ్జుతో మొదట్లో ఘర్షణాత్మక వైఖరి అవలంబించిన భారత్ కూడా, దానివల్ల ప్రజలను దూరం చేసుకోవడం వినా మరో ప్రయోజనం లేదని అర్థంచేసుకుంది. సహాయసహకారాలతో, సర్దుబాటుతో ముయిజ్జును దారికి తెచ్చుకుంది. భారత్–మాల్దీవుల మధ్య ఒప్పందాలూ అవగాహనలు చక్కగా సవ్యంగా ఉన్నాయని, వాటిమీద ఏ అభ్యంతరాలు, అనుమానాలూ అక్కరలేదని ఈ మధ్యనే ముయిజ్జు ఓ ప్రకటన చేస్తే, మాజీ మంత్రి ఒకరు గతాన్ని గుర్తుచేస్తూ ఘాటుగా విరుచుకుపడ్డారు. మాల్దీవుల మీద భారత్ పెత్తనం చేస్తున్నదనీ, దేశ సార్వభౌత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఆ ఒప్పందాలు దెబ్బతీస్తున్నాయంటూ తాను అధికారంలోకి వస్తూనే భారతదేశం తన సైనికులను ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసిన విషయాన్ని ఈయన గుర్తుచేశారు. మాటమార్చిన ముయిజ్జు ఇరుదేశాల ప్రజలకూ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ వెనుక రాజకీయం ఉండవచ్చును గానీ, ముయిజ్జు చేసిన కీడు చిన్నదేమీ కాదు. కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు భారత్‌లో తొలిపర్యటన జరిపే సంప్రదాయాన్ని కాదని, టర్కీ, చైనాల్లో పర్యటించి, పెట్టుబడులను కోరడంతో పాటు, భారత వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారాయన. ఆయన అండచూసుకొనే మాల్దీవుల మంత్రులు కొందరు భారతప్రధాని లక్షద్వీప్ పర్యటన సందర్భంలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్‌ను అద్భుత పర్యాటక కేంద్రంగా ప్రశంసించి, దానిని ప్రోత్సహించమనే రీతిలో మోదీ పోస్టులు ఉండటంతో, దానిని కేంద్రమంత్రులూ బీజేపీ నాయకులూ అందిపుచ్చుకోవడంతో, మాల్దీవుల మంత్రులు కొందరు కుత్సిత వ్యాఖ్యలు చేశారు. ఇది చినికిచినికి గాలివానగా మారి, మనదేశంలోని ప్రముఖులు మాల్దీవులను బహిష్కరించమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. పర్యాటకమే ప్రధానవనరుగా ఉన్న ఆ ద్వీపదేశానికి ఈ ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ ప్రచారం తీవ్ర నష్టం కలిగించింది. కష్టకాలంలో అదుకుంటాయనుకున్న చైనా, గల్ఫ్‌దేశాలు కూడా గాలికి వదిలేశాయి. ముయిజ్జుకు జ్ఞానోదయం కలిగి, మళ్ళీ భారతదేశంతో సయోధ్య యత్నాలు ఆరంభించడంతో, గత ఏడాది సెప్టెంబర్‌లో భారీ ఆర్థికసాయంతో మాల్దీవులను భారత్ ఆదుకుంది. మౌలికసదుపాయాల భారీ ప్రాజెక్టులతో, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో మాల్దీవులను మళ్ళీ నిలబెట్టేందుకు ప్రయత్నాలు ఆరంభమైనాయి. ప్రేమలున్నా లేకున్నా ఇరుగూపొరుగూ అన్నాక సయోధ్యతో సాగాల్సిందే. భౌగోళిక, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా రెండుదేశాలూ నడుచుకోవాల్సిందే. మోదీ తాజాపర్యటనతో ఇరుదేశాల దౌత్యసంబంధాలు పూర్వస్థితికి చేరుకుంటాయని ఆశించవచ్చు.