Share News

విప్లవాచరణ మలిచిన కథలు

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:22 AM

క థా రచయిత్రి రేణుక రాసిన 37 కథలను స్థూలంగా రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి: మైదాన, పట్టణ ప్రాంత కథలు, రెండు: దండకారణ్యం తదితర ప్రాంతాల్లోని విప్లవానుభవ కథలు. ఆమె 2005లో విప్లవోద్యమంలోకి...

విప్లవాచరణ మలిచిన కథలు

క థా రచయిత్రి రేణుక రాసిన 37 కథలను స్థూలంగా రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి: మైదాన, పట్టణ ప్రాంత కథలు, రెండు: దండకారణ్యం తదితర ప్రాంతాల్లోని విప్లవానుభవ కథలు. ఆమె 2005లో విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లడానికి ముందు కూడా విప్లవానుభవాన్ని ఇతివృత్తంగా కథలు రాసింది. ఉదాహరణకు ‘మెట్ల మీద’ కథ అట్లా రాసిందే. ఈ రెండు రకాల కథలకూ విశేష పాఠకులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31న ఆమె హత్య జరిగాక వచ్చిన ప్రతిస్పందనలో మరోసారి ఇది రుజువైంది.

అయితే ఆమె మిడ్కోగా పాఠకులకు చేరువైంది రెండో రకం కథలతోనే. దండకారణ్య ఆదివాసీ ఇతివృత్తంతో ఆమె కథలు రాయడానికి సుమారు పాతికేళ్ల కిందటి నుంచే అలాంటి సాహిత్యం తెలుగు పాఠకులకు పరిచయం. మనిషికి – చరిత్రకు సంబంధం ఏమిటి? ప్రజలు చరిత్రను నిర్మిస్తారని ఎందుకు నమ్మాలి? శ్రామికవర్గం మీద మార్క్సిజం మోపిన ఈ భారాన్ని వాళ్లు ఎందుకు నిర్వర్తించాలి? సొంత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లోకి వచ్చిన ప్రజలు ఆ తర్వాత కూడా ఎందుకు ఉద్యమాలను కొనసాగించాలి? ...ఇలాంటి సందేహాలు తీవ్రంగా ఉన్న రోజుల్లో మిడ్కో మహిళా ఉద్యమంలోకి వచ్చింది. ఇంకో వంక స్త్రీవాద ధోరణి బలంగా ఉండిన రోజుల్లో స్త్రీల జీవిత ఇతివృత్తంతో రాయడం మొదలుపెట్టింది. రేణుక పితృ స్వామ్యాన్ని కేవలం భావజాలంగా, సంస్కృతిగా చూడలేదు. ఉత్పతి సంబంధాలతో, రాజ్యంతో ముడిపడి, సొంత ఆస్తి కేంద్రంగా ఉండే కుటుంబంలో స్త్రీల జీవితాన్ని అర్థం చేసుకున్నది. స్త్రీవాదాన్ని అధిగమించి స్త్రీని సమాజమంతటా చూడగలిగింది.


మిడ్కోగా మారిన తర్వాత రేణుక తన కథా రచనను మరింత ఉన్నత స్థాయికి తీసికెళ్లింది. అక్కడ కూడా స్త్రీలు, భార్యాభర్తల సంబంధాలు, ప్రేమ మొదలైన అంశాలు ఫోకస్‌ చేస్తూ కథలు రాసింది. ఏ ఇతివృత్తాన్ని తీసుకున్నా స్త్రీలు ప్రధానంగా కథలు రాసింది. బహుశా 1990ల నుంచి విప్లవోద్యమ బహిరంగ, అజ్ఞాత విభాగాలన్నిట్లోనూ మహిళలు నిర్ణాయకంగా ఎదగడమే దీనికి కారణం కావచ్చు. సారాంశంలో విప్లవాన్ని స్త్రీల వైపు నుంచి చూడటం ఆమె ప్రత్యేకత.

మిడ్కో కథలన్నిటిలోని సాధారణాంశం మానవ మనస్తత్వంలోని మార్పుల చిత్రణ. మానవ వ్యక్తీకరణలకు ఆమె ఆపార విలువ ఇస్తుంది. మనుషులు ఎప్పుడు ఎట్లా వ్యక్తమవుతారు? ఎందుకు అట్లా స్పందిస్తారు? తీవ్రమైన సంఘర్షణల మధ్య తమను తాము ఎట్లా రుజువు చేసుకుంటారు? ఈ క్రమంలో వాళ్ల మనస్తత్వంలో వచ్చే మార్పులేమిటి?... ఇవన్నీ మిడ్కో చాలా సూక్ష్మస్థాయిలో చిత్రికపడుతుంది. ఇది కేవలం స్వీయాత్మక పరిధిలో జరగదు. ఒక పెద్ద చారిత్రక యుగావధిలోని సామూహిక సంఘర్షణలో భాగంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ మనిషికీ, చరిత్రకూ ఉండే సంబంధం రుజువవుతుంది.


దండకారణ్యంలోని ప్రజాయుద్ధంలో ఆమెకు అనేక సాహిత్య ఇతివృత్తాలు కనిపించాయి. వాటితొ శక్తివంతమైన కథలు రాసింది. ఈ కథల్లోని ఉద్వేగాలు, విషాదాలు, దుఃఖాలు, ఆనందాలు, సంతృప్తులు పూర్తిగా కొత్తవి. సాహిత్యం కాబట్టి ఇవి పాత్రల వైయుక్తిక స్థాయిలో కనిపిస్తాయి. అంతకుమించి సామూహిక అనుభవాలుగా మారుతున్నట్లు పాఠకులకు తెలుస్తుంది. ముఖ్యంగా విప్లవంలో బిడ్డలను కోల్పోయిన తల్లులను, సహచరులను కోల్పోయిన భార్యలను చిత్రించేటప్పుడు ఆమె ఈ వైయుక్తిక–సామూహిక క్రమాన్ని గొప్పగా చిత్రిస్తుంది. స్త్రీలు తల్లులుగా, భార్య లుగా కోల్పోయినదానితో సమానమైనది మరేదీ ఉండదు. లోతైన స్వీయ విషాదం అది. కానీ విప్లవం దానికి సామూహిక కోణాన్ని చేర్చుతుంది. ఈ మాటను వాచ్యంగా చెప్పి ఒప్పించడం ఎవ్వరి వల్లా కాదు. విప్లవాచరణలోని వాస్తవికతను దగ్గరిగా చూసి, వివరించగల జీవన దృక్పథం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. జీవితాన్ని అట్లా చూడ గల చూపు రచయిత్రికి ఉన్నది. తెలుగు సాహిత్యానికి ఇది చాలా కొత్త. ఈ కొత్తదనం గాల్లోంచి ఊడిపడలేదు. దండ కారణ్యంలోని మనుషులు పాతదాన్ని వదిలించుకొని కొత్తది నిర్మించడం మొదలు పెట్టారు. అదే సమయంలో తమను తాము కొత్తగా తయారు చేసుకుంటున్నారు. ఆ కొత్తదనాన్ని మనుషుల భౌతిక చర్యల్లో, పనుల్లో, వైఖరుల్లో మిడ్కో అద్భుతంగా చిత్రించింది. ఈ కొత్త పనులకు తగినట్లు మనుషులు తమను తాము మార్చుకోవడమంటే వాళ్ల మనస్తత్వాలో మార్పు రావడమే. మిడ్కో కథల్లోంచి ఈ సృజనాత్మక మానవ వికాస క్రమాన్ని వివరించవచ్చు.


మానవ మనస్తత్వం కేంద్రంగా రాసే సాహిత్యంలో మార్పు పెద్దగా ఉండదు. కానీ మిడ్కో తీవ్ర వర్గ సంఘర్షణ, యుద్ధం నేపథ్యంలో మానవ మనస్తత్వంలో వచ్చే మార్పులను చిత్రించింది. సామాజిక మార్పులను మానవ సంబంధాల్లోనేగాక వ్యక్తిత్వంలో మార్పుగానూ చిత్రించడం ఆమె ప్రత్యేకత. అలాంటి మానవ వ్యక్తిత్వం పరిపూర్ణత సంతరించుకొనే వరకు మిడ్కో కథలు నిలిచి ఉంటాయి.

పాణి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:22 AM