Philosophical Poetry: గందర గోళం
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:18 AM
ఇదంతా బయల్దేరిన చోటికి చేర్చే గోళమే దాన్ని తెలియనివ్వని గందరగోళం కూడా ఇదంతా ఒక తిక్క నాకొడుకు ప్రేలాపనే....
ఇదంతా బయల్దేరిన చోటికి చేర్చే గోళమే
దాన్ని తెలియనివ్వని గందరగోళం కూడా
ఇదంతా ఒక తిక్క నాకొడుకు ప్రేలాపనే
ఐనా పదాల్ని తెంపి దండలు కట్టి చూడు!
అసలీ ప్రయాసంతా ఎందుకు? ఏమో తెలియదు!
రెండు విషయాలు నాకు ఎప్పటికీ తెలియవు
విశ్వావరణానికి బయట ఏముందో తెలియదు
మెదడుకు బయట ఏముందో కూడా తెలీదు!
మాటలు తుప్పుపట్టి తెరుచుకోని తలపులు
అంతిమ సత్యం అంటూ ఒకటి లేదు గనుక,
మరీ బరి తెగించి అనకూడదు గాని; విశ్వానికి,
మస్తిష్కానికి బయటివి మనకెప్పటికీ తెలీవు
ఉన్న సత్యాలన్నీ ఛందస్సుల్లా, వాస్తుశిల్పాల్లా
ఏదో దొరికిన కాస్త స్థలంలో నిర్మించబడినవే;
అవి సహజాతాలు కాదు; వస్తువులతో పాటు
పుట్టినవి కాదు, పుట్టాక రూపాలు పొందినవే;
‘అదే అదే అదేర నాన్నా, అదే శంకరుడన్న మాయ’
అంటావా సహవాసీ! నా ఆవేదన సహభోగీ! వేదాంతీ!
ఆగు ఆగు, కుదరదు! ఆలోచన ఇంకా అయిపోలేదు
బయటి మాయ సంగత్సరే, లోని పీడన సంగతేంటి?
ఆకలేసినా అన్నానికి వెళ్లనివ్వని పని సంగతేమిటి?
నీ మనసు కట్టిన పాటను నిన్ను పాడుకోనివ్వని
రాజదండాల సంగతేమిటి? మనిషిపై మనిషి స్వారీకి,
రేసు మైదానాల సంగతి, బుక్కీ కిటికీల వద్ద మన
మధ్యతరగతి పడిగాపుల సంగతేమిటి? నీచస్థితిని
వొదిలేసి చేయాల్సి ఉన్న దీర్ఘయాత్ర సంగతేమిటి?
మాయ అనేది మాయ అని కూడా మనకు తెలీదు
తెలిసింది ఏదో అదే తెలుసు, అన్నీ తెలుసు అని
ఉపదేశ ముద్రతో హస్తం చాచకు, పోజులు కొట్టకు,
ఏదీ తెలియదని రాత్రంతా చిడతలు మోగించి
పొద్దన్నే దొరగాని చేనిలో కలుపు తీయడానికి
మాత్రమే, దానికి మాత్రమే చూరులోని కొడవలి
పదును గురించి చాల దిగులు పడిపోతూ
ఆకలికి బానిసగా బతికి, మరణించ వద్దు!
పనికీ పనికి మధ్య విరామాల్లోనైనా నీకు నువ్వు బతుకు,
గుహల గోడల మీద బొమ్మలుగా, వేట కేకల కవితలుగా
-హెచ్చార్కె
& 95023 45716