Nehru and Martin Luther King Jr: నెహ్రూతో జరగని ఓ మాటా మంతీ
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:29 AM
అమెరికన్ యువ రాజకీయవేత్త ఒకరు ఇటీవల జవాహర్‌లాల్ నెహ్రూ పేరును, ఆయన మాటలను స్ఫూర్తిదాయకంగా ప్రస్తావించారు. దశాబ్దాల క్రితం నెహ్రూ గురించి మరో యువ అమెరికన్ భావాలు, అభిప్రాయాలు జ్ఞాపకం చేసుకోవడం సందర్భోచితమే కాకుండా ఉపయోగకరంగానూ ఉంటుంది.
అమెరికన్ యువ రాజకీయవేత్త ఒకరు ఇటీవల జవాహర్‌లాల్ నెహ్రూ పేరును, ఆయన మాటలను స్ఫూర్తిదాయకంగా ప్రస్తావించారు. దశాబ్దాల క్రితం నెహ్రూ గురించి మరో యువ అమెరికన్ భావాలు, అభిప్రాయాలు జ్ఞాపకం చేసుకోవడం సందర్భోచితమే కాకుండా ఉపయోగకరంగానూ ఉంటుంది. ఈ యువ అమెరికన్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. 1950వ దశకం తొలినాళ్లలో డాక్టోరల్ విద్యార్థిగా గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమం గురించిన పుస్తకాలను కింగ్ ఆబగా చదివారు. ఈ అధ్యయనాల సందర్భంగా గాంధీ సహచరుడు, ఆయన వారసుడు జవహర్‌లాల్ నెహ్రూ మానవీయ వ్యక్తిత్వం, మేధా ఔన్నత్యం ఆయనకు పరిచయమయ్యాయి. నెహ్రూ ఆత్మకథ, ఇతర పుస్తకాలు కూడా కింగ్ చదివారు. 1958 నవంబర్‌లో, మూడుపదుల వయసు కూడా లేని కింగ్ కొత్తగా ప్రచురితమైన తన పుస్తకం ‘Stride Toward Freedom’ ప్రతి నొకదాన్ని భారత ప్రధానమంత్రికి పంపించారు. అమెరికా పౌర హక్కుల ఉద్యమంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ‘మోంట్ గోమెరీ బస్ బాయ్‌కాట్’ సంఘటన పూర్వాపరాల గురించి కింగ్ పుస్తకం విపులంగా వివరించింది. నెహ్రూకు పంపిన ప్రతిపై కింగ్ ఇలా రాశారు: ‘విముక్తి ఉద్యమాల పట్ల మీ శ్రద్ధాసక్తులకు, అణగారిన ప్రజల పట్ల మీ మానవతావాద దృక్పథానికి, భారతదేశ స్వాతంత్ర్యానికి మీరు చేసిన మహోన్నత పోరాటం ద్వారా నాకూ, మోంట్ గోమెరేలోని యాభై వేలమంది నీగ్రోలకు మీరు ఇచ్చిన స్ఫూర్తికి కృతజ్ఞతగా’. కింగ్ సహృదయతకు నెహ్రూ వెన్వెంటనే ప్రతిస్పందించారు.
కింగ్‌కు రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు: ‘అమెరికాలో జాతి వివక్షను రూపుమాపేందుకు మీరు చేస్తున్న కృషి నాకు చాలాకాలం నుంచీ ఆసక్తిదాయకంగా ఉన్నది. ముఖ్యంగా మీరు మీ ఉద్యమాన్ని నిర్వహిస్తోన్న పద్ధతి నాకు మరింత ఉత్సుకత కలిగిస్తోంది. మీ కృషిపై మరింత మెరుగైన అవగాహనకు రావడానికి మీ పుస్తకం నాకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. మీరు త్వరలో భారత్ పర్యటనకు రానున్నారని తెలిసింది. న్యూఢిల్లీలో మిమ్ములను కలుసుకునేందుకు నేను సదా ఎదురుచూస్తుంటాను.’ కాకా కలేల్కర్, రాజకుమారి అమృత్ కౌర్ మొదలైన గాంధీజీ సహచరుల ఆహ్వానం మేరకు భారత్‌లో కింగ్ పర్యటించారు. తన సతీమణి కోరెట్టాతో పాటు 1959 ఫిబ్రవరి 10న ఆయన న్యూఢిల్లీకి వచ్చారు.
విమానాశ్రయంలో దిగగానే తనను కలవవచ్చిన విలేఖర్లకు ఆయన ముందుగా సిద్ధం చేసుకున్న ఒక ప్రకటనను చదివి విన్పించారు: ‘స్నేహితుల్లారా, చాలాకాలంగా మీ మహోన్నత ప్రియధాత్రిని సందర్శించేందుకు ఎదురుచూస్తున్నాను. ఇతర దేశాలకు నేను ఒక పర్యాటకుడిగా మాత్రమే వెళతాను. అయితే భారత్‌కు మాత్రం ఒక యాత్రికుడిగా వచ్చాను. ఎందుకంటే భారత్ అంటే నాకు గాంధీ భూమి. ఆయన సార్వకాలిక మహాత్ముడు. నాకు భారత్ అంటే పండిట్ నెహ్రూ కూడా. ఆయన రాజనీతిజ్ఞత, మేధా వ్యక్తిత్వం ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతి పొందుతున్నాయి’. ఫిబ్రవరి 13న తీన్‌మూర్తి భవన్‌లో విందుకు కింగ్‌ను నెహ్రూ ఆహ్వానించారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలో కింగ్ పేపర్స్‌ను నేను అధ్యయనం చేస్తుండగా టైప్ చేసిన ఒక డాక్యుమెంట్ నా దృష్టికి వచ్చింది. నెహ్రూతో భేటీలో కింగ్ ప్రస్తావించదలుచుకున్న విషయాల వివరాలు అందులో ఉన్నాయి. ఇవీ ఆ అంశాలు: (1) దేశీయ సమస్యలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంబంధాలలోనూ అహింసాయుతమైన సామాజిక పరివర్తనకు దోహదం చేసే గాంధేయ సూత్రాల ప్రస్తుత ప్రాధాన్యం, ప్రాసంగికత ఏమిటి?; (2) భారత ప్రజల సంక్షేమాన్ని ఇతోధికం చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న కృషిలో గాంధేయ పద్ధతుల ప్రాముఖ్యత, సామాజిక ప్రయోజనమేమిటి? గాంధేయ పద్ధతులలో ఎటువంటి మార్పులు అవసరం? దేశ రక్షణ, పారిశ్రామికీకరణతో అవి ఘర్షిస్తున్నాయా? (3) ప్రజాస్వామ్యాన్ని ప్రజలు తిరస్కరించనవసరం లేకుండా ఒక ప్రజాస్వామ్య దేశం తన ప్రజల శ్రేయస్సును వేగవంతంగా సాధించగలదా? ప్రజా సంక్షేమ సాధనలో చైనా లేదా భారత్ మార్గాలలో ఏది ఆదర్శవంతమైనది? ఆఫ్రికా ఏ మార్గంలో ముందుకు సాగాలి?; (4) భారత ప్రజలు, అమెరికాలోని నల్లజాతి ప్రజల మధ్య స్నేహ సంబంధాలను మరింతగా దృఢతరం చేయడమెలా? వంటివి.
జ్ఞాపకానికి రాసుకున్న ఆ పత్రంపై కింగ్ సంతకం లేదు. అయితే అది తప్పకుండా ఆయన రాసుకున్నదే అయివుంటుంది. విందులో అతిథులు చాలామంది ఉండడం వల్ల నెహ్రూ–కింగ్ మధ్య వ్యక్తిగత భేటీకి ఆస్కారం లేకపోయింది. కింగ్ దంపతులు మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. కలకత్తా, పట్నా, మద్రాసు, బొంబాయి ప్రాంతాలను సందర్శించి విద్యావేత్తలు, ప్రజాహిత క్రియాశీలురు, గాంధేయవాదులతో సంభాషణలు జరిపారు. సబర్మతి, సేవాగ్రామ్ ఆశ్రమాలను సందర్శించి, గాంధీ స్మృతికి ఘనంగా నివాళులర్పించారు. కింగ్ దంపతులు ఢిల్లీకి తిరిగివచ్చిన తరువాత ‘గాంధీ పీస్ ఫౌండేషన్’ చైర్మన్ జి.రామచంద్రన్ వారి గౌరవార్థం విందు ఇచ్చారు. ఆ విందుకు ప్రధాని నెహ్రూను కూడా ఆహ్వానించారు. అయితే ఆ రోజున తాను రాజధానిలో ఉండలేక పోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ శ్వేత, నల్లజాతి ప్రజల మధ్య సామరస్యానికి డాక్టర్ మార్టిన్ లూథర్‌కింగ్ ప్రశస్త కృషికి గాను ఆయనను అభినందించేందుకు ఆరాటపడుతున్నానని, కింగ్ దంపతులను కలుసుకోవడం తనకు అమిత ఆనందాన్నిస్తున్నదని రామచంద్రన్‌కు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారు. అమెరికాకు తిరిగివెళ్లిన తరువాత మార్టిన్ లూథర్‌కింగ్‌ను విశేష ప్రజాదరణ ఉన్న కెనడియన్ టీవీ కార్యక్రమం ‘ఫ్రంట్ పేజ్ ఛాలెంజ్’లో ఇంటర్వ్యూ చేశారు. ‘గాంధీకి మీరు ఏ విధంగా రుణపడి ఉన్నారని’ ప్రశ్నించగా ‘భారతీయ మహానాయకుడు తనకు నిస్సందేహంగా ఒక గొప్ప స్ఫూర్తి అని, అయితే జీసస్ నుంచి కూడా ఉత్తేజం పొందానని’ కింగ్ చెప్పారు. ‘మానవ హుందా కోసం జరిగే ఏ పోరాటంలోనైనా ప్రేమ, అహింస నియమబద్ధమైన ఆదర్శాలుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేందుకు గాంధీ, జీసస్‌ల బోధనలు తనకు ఆలంబన అయ్యాయని కింగ్ వివరించారు. ఆ సంభాషణ తరువాత నెహ్రూ వైపు మళ్లింది. ‘నెహ్రూ సైతం అహింసా వాదియేనా’ అని కెనడియన్ ప్రశ్నకారుడు ఆశ్చర్యం వ్యక్తం చేయగా కింగ్ ఇలా సమాధానమిచ్చారు: ‘స్వాతంత్ర్య పోరాటంలో హింసాత్మక పద్ధతులు అనైతికమూ, ఆచరణ సాధ్యం కానివి అని నెహ్రూ విశ్వసించారు. అయితే అన్ని పరిస్థితులలోను అహింసకు కట్టుబడి ఉండాలన్న గురువు గాంధీతో నెహ్రూ విభేదించారు.
దేశ అంతర్గత వ్యవహారాలలో అహింస అనుసరణీయమని, అంతర్జాతీయ ఘర్షణల విషయానికి వస్తే ఏ దేశమైనా విధిగా సైన్యాన్ని నిర్వహించుకోవలసి ఉంటుందని నెహ్రూ గట్టిగా భావిస్తారు.’ భారతీయ రాజనీతిజ్ఞుడి పట్ల మార్టిన్ లూథర్ కింగ్‌కు అపార గౌరవం ఉన్నదని, యువ అమెరికన్ పౌర హక్కుల యోధుడిని నెహ్రూ అమితంగా అభిమానించారని నేను చేసిన ఉటంకింపులు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ ఇరువురి మధ్య జరగని సంభాషణ విషయానికి మళ్లీ వద్దాం. నెహ్రూతో భేటీలో కింగ్ ప్రస్తావించదలుచుకున్న అంశాలు ఆయన నైతిక, రాజకీయ మేధస్సును వెల్లడిస్తాయి. ఆయన తన జ్ఞాపకానికి రాసుకున్న నాలుగు ప్రధాన ప్రశ్నలను పరిశీలించండి. మొదటిది, దేశీయ వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలలో అహింస ప్రాధాన్యమేమిటి? రెండోది, భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో గాంధేయ పద్ధతులు, ఆదర్శాలు ఉపయుక్తమైనవేనా? మూడోది, ప్రజలను కుంగదీస్తున్న పేదరికాన్ని నిర్మూలించడంలో వలసపాలన నుంచి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన ఆసియా, ఆఫ్రికా దేశాలకు ప్రజాస్వామ్య పాలన లేక నిరంకుశ పాలనా విధానంలో ఏది సరైనది? నాల్గవది, సమస్త భారతీయులు, అమెరికాలోని నల్లజాతి ప్రజలు తమ మధ్య స్నేహ సంబంధాలను ఎలా పటిష్ఠం చేసుకోగలరు? 1954 ఫిబ్రవరిలో జవహర్‌లాల్ నెహ్రూతో కింగ్ చర్చించదలుచుకున్న ప్రశ్నలు సమకాలీన ఔచిత్యాన్నే కాకుండా కాలాతీత ప్రాధాన్యాన్ని కూడా కలిగి ఉన్నాయనడంలో సందేహం లేదు. 2025లో సైతం సామాజిక, రాజకీయ వివాదాల పరిష్కారంలో అహింసాత్మక పద్ధతుల పాత్ర, ప్రజాస్వామిక, నిరంకుశ పాలనా విధానాల ఆవశ్యకతపై వైవిధ్య వాదనలు, గాంధేయ ఆర్థిక (ఇప్పుడు ప్రత్యేకించి పర్యావరణ) భావాల ప్రాసంగికత, భారత్–అమెరికా సంబంధాల వర్తమానమూ, భవిష్యత్తు మొదలైనవి విశేష స్థాయిలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
ఈ ప్రశ్నలపై నెహ్రూ, కింగ్ మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగి ఉంటే అది కలకాలం గుర్తుండిపోయే, అసాధారణ సమాలోచనగా చరిత్రలో స్ఫూర్తిదాయకంగా ఉండిపోయేది. ఇరువురూ చరిత్ర, రాజకీయ సిద్ధాంతంలో నిరంతర ఆసక్తి, భావోద్వేగ ఉత్సుకత ఉన్నవారే. ఇరువురూ మహా చదువరులే కాకుండా తమ భావాలు, అభిప్రాయాలు సూటిగా, స్పష్టంగా, స్ఫుటంగా వ్యక్తీకరించగల ప్రజ్ఞాపాటవాలు ఉన్నవారే. ఆ మహోన్నత రాజనీతిజ్ఞుడు, మహా మానవతాయోధుడి మధ్య భేటీ జరిగి ఉంటే?! చైనాలో ఏకపార్టీ పాలన కంటే భారతదేశ బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నెహ్రూ ఎలా వాదించేవారు? నెహ్రూ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను కింగ్ ప్రశ్నించేవారా? పెట్టుబడి అస్తుబిస్తుగాను, శ్రమ శక్తి అపారంగాను ఉన్న భారతీయ సమాజంలో గాంధేయ సూత్రాలకు విరుద్ధంగా భారీ పారిశ్రామికీకరణకు ప్రాధాన్యమివ్వడం అవివేకమని కింగ్ బహుశా సూచించేవారేమో? భారత్–అమెరికా సంబంధాల గతాన్ని వారు ఎలా చూసేవారు? వాటి భవిష్యత్తు ఎలా ఉండాలని వారు కోరుకునేవారు? రాజకీయాలతో పాటు వ్యక్తిగత విషయాలమీద కూడా సంభాషణ జరిగి ఉంటే ప్రణయం, పెళ్లి, కుటుంబ బాంధవ్యాలపై ఇరువురూ తమ భావాలు, అభిప్రాయాలు పరస్పరం పంచుకునేవారేమో? ఈ ప్రశ్నలకు సంభావ్య సమాధానాలు ఆశ్చర్యకరంగానూ ఆలోచింపచేసేవిగానూ ఉండేవి కావూ?
(వ్యాసకర్త చరిత్రకారుడు)