Share News

కేటీఆర్‌ కేంద్రంగా అమెరికాలోనూ హడావుడి

ABN , Publish Date - Jun 11 , 2025 | 06:21 AM

భారత రాష్ట్ర సమితి అధ్వర్యంలో ఇటీవల అమెరికాలో తెలంగాణ అవతరణ దినోత్సవాలు విజయవంతంగా జరిగాయి. మాతృభూమిలోని రాజకీయాలకు ప్రత్యేకించి భారాస రాజకీయ కార్యాచరణకు ఈ వేడుకలు పరోక్షంగా ఒక దిశ, దశను నిర్దేశించాయని...

కేటీఆర్‌ కేంద్రంగా అమెరికాలోనూ హడావుడి

భారత రాష్ట్ర సమితి అధ్వర్యంలో ఇటీవల అమెరికాలో తెలంగాణ అవతరణ దినోత్సవాలు విజయవంతంగా జరిగాయి. మాతృభూమిలోని రాజకీయాలకు ప్రత్యేకించి భారాస రాజకీయ కార్యాచరణకు ఈ వేడుకలు పరోక్షంగా ఒక దిశ, దశను నిర్దేశించాయని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ తొలుత 2014లో న్యూయార్క్‌లో, పిదప 2019లో టెక్సాస్‌లో నిర్వహించిన సభల స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ సభను భారాస నిర్వహించిందని చెప్పవచ్చు. ప్రధాని మోదీ సభలు విజయవంతం కావడానికి అప్పట్లో రాంమాధవ్ కృషి ఒక ప్రధాన కారణం. అయితే భారత రాష్ట్ర సమితికి అమెరికాలో ఆ స్థాయి నాయకత్వ శ్రేణులు లేవు. అయినప్పటికీ అమెరికాలో తెలంగాణ ప్రవాసులు ఇప్పటి వరకు నిర్వహించిన రాజకీయ సభలలో ఇటీవలి భారాస సభ విజయకేతనంగా నిలిచిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సభ కేటీఆర్‌ కేంద్రంగా జరిగింది! ఈ భారీ సభలో కేటీఆర్‌ మాత్రమే భవిష్యత్తులో భారాసకు అధినాయకుడని స్పష్టమైన సంకేతాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ వైపు తెలంగాణ అరంభంలో ఉండే సూర్యాపేటకు చెందిన జగదీశ్ రెడ్డి మొదలు మహారాష్ట్రకు సమీపంలో ఉండే చెన్నూరు ప్రాంతీయుడు బాల్క సుమన్ వరకు దాదాపు భారాస నాయకగణం అంతా తరలివచ్చిన అమెరికా సభ ఒక విధంగా కేటీఆర్‌ పట్టాభిషేక ఉత్సవమని కూడ ఆంతరంగికుల అభిప్రాయం. కేసీఆర్‌ దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత ఆక్షేపించిన నేపథ్యంలో ఈ సభకు భారాస నాయకులు పలువురు ప్రత్యేకంగా వచ్చి పాల్గొనడం సహజంగానే ఆసక్తి కలిగించింది.


తమ రాజకీయ అస్తిత్వ ప్రదర్శన అయిన ఎల్కతుర్తి సభకు వరంగల్ జిల్లా భారాస కార్యకర్తలు ఎంత వరకు పని చేసారో తెలియదు కానీ అమెరికా సభ విజయవంతం కావడానికి మాత్రం వరంగల్ జిల్లా నాయకులందరు కలిసికట్టుగా కృషి చేశారు. అందునా అమెరికా ప్రవాసురాలు ఒకరు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఈ సభా విజయానికి చురుకైన పాత్ర వహించడం విశేషం. అసలు అమెరికాలో భారాస కంటే కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి ప్రాబల్యం ఎక్కువ. విదేశాలలో తెలంగాణవాదానికి బతుకమ్మ అనేది ఒక సాంస్కృతిక ప్రతీక. బతుకమ్మ స్ఫూర్తిని అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా సకల దేశాలలో వ్యాపింపజేయడంలో కవిత కీలకపాత్ర వహించారు. ఈ రీత్యా అమెరికాలో తెలంగాణ జాగృతి ఒక ఊపు మీద ఉండాలి. పైగా కేటీఆర్‌ స్వాగత సన్నాహక ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో కవిత అమెరికాలోనే ఉన్నారు. కవిత లేదా తెలంగాణ జాగృతి ఎక్కడ కూడ ఈ సన్నాహక ఏర్పాట్ల దరిదాపులలో కూడ కనిపించలేదు. భారాస నాయకగణం అమెరికాలో ఉన్నా ఎవరూ కూడా అమెతో ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా కూడ సమాచారం లేదు. అమెరికా నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత కవిత తన వ్యాఖ్యల ద్వారా ప్రకంపనలు సృష్టించారు. అమెరికాలో భారాసకు తన్నీరు మహేశ్ రావు ఒక ప్రధాన దిక్కు. అందరితో సౌమ్యంగా ఉంటూ కలుపుకుపోయే స్వభావం ఆయన సొంతం. భారాస అగ్ర నాయకుడు హరీశ్‌ రావుకు మహేశ్‌ స్వయాన సోదరుడు. ఈ సభ నిర్వహణలో మహేశ్ రావుతో ఇతరులు కీలక పాత్ర వహించారు. విభిన్న సామాజిక వర్గాల నేపథ్యం ఉన్న ఈ ఇతరులు ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల నేతల, సామాజిక వర్గాలకు చెందిన బంధుమిత్ర గణం విదేశాలలో పార్టీ కార్యకలాపాలలో ముందంజలో ఉంటారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు కూడ ఇదే పరిస్థితి. అయితే ఈసారి కేటీఆర్‌ సభ నిర్వహణలో విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రవాసులకు కూడా పాత్ర కల్పించారు.


అధికారంలో లేకున్నా కేటీఆర్‌ అమెరికాకు వస్తూ లండన్ లోనూ, ఆ తర్వాత అమెరికాలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, వ్యాపార ప్రముఖులతో జరిపిన సమావేశాల ద్వారా సామాజిక మాధ్యమాలలో సముచిత ప్రాచుర్యం కల్పించారు. అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు కేటీఆర్‌ వేసిన ప్రతి అడుగు గురించి వివరించిన తీరు విలక్షణంగా ఉన్నది. దాని లక్ష్యం ఎవరు? అమెరికాలో ఉన్నవారా లేదా తెలంగాణలో ఉన్న వారా అనేది తెలియదు. రాజకీయ అస్తిత్వం కొరకు తెలంగాణలో పోరాడవల్సిన సమయంలో అమెరికాలో సభ ఎందుకు అంటూ కవిత సంధించిన ప్రశ్నను కూడ తోసిపుచ్చడానికి వీలు లేదు. భారత రాష్ట్ర సమితి రాజకీయ అనిశ్చిత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా యోజనాల దూరంలోని అమెరికాలో అట్టహాసంగా జరిపిన తెలంగాణ అవతరణ దినోత్సవ సభ ద్వారా భారాస లేదా కేటీఆర్‌ బృందం ఏ రకమైన సందేశం ఎవరికి ఇవ్వదలుచుకున్నది?

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 06:21 AM