Reading Habits: ప్రేమ కథలు నచ్చవు
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:02 AM
ఈ నడుమ అంటే సోలోమన్ విజయ్ కుమార్ ‘సన్ ఆఫ్ జోజప్ప’ కోసం ఆత్రంగ ఎదురు చూసిన. అంతకు ముందు ‘ముని కాంతపల్లి’ కథల పుస్తకం నన్ను ఒకరకమైన ట్రాన్స్‌ల పడేసింది.
చదువు ముచ్చట
ఈమధ్య చదివి ఇష్టపడిన పుస్తకం?
ఈ నడుమ అంటే సోలోమన్ విజయ్ కుమార్ ‘సన్ ఆఫ్ జోజప్ప’ కోసం ఆత్రంగ ఎదురు చూసిన. అంతకు ముందు ‘ముని కాంతపల్లి’ కథల పుస్తకం నన్ను ఒకరకమైన ట్రాన్స్‌ల పడేసింది. ఆ కథలన్నీ ఎదో మా ఊర్లో, నా కళ్ళముందు జరిగినట్టున్నయ్. ఆ నెల్లూరు మాండలికం అయితే.. దానికోసమే ఆ బుక్ ఎన్నిసార్లు సదివిన్నో లెక్కలేదు. అంటే నాకు మాండలికాల మీద ఉన్న విపరీతమైన ఇష్టం తోని ఇంక ఎక్కువ నచ్చినట్టుంది.
తొలిసారి బాగా ఇష్టపడిన పుస్తకం?
నాది పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ చదువు. అక్కడ అన్ని ల్యాబులకు, లైబ్రరీకి కలిపి ఒకటే రూమ్ ఉండేది. అందులో ఉన్న ఓ చెక్క బీరువలో మస్తు పుస్తకాలుండేవి. ఇగ అయిట్లల్ల.. పేర్లు గుర్తులేవు గాని, కథలు గుర్తున్నాయి. టీనేజ్ దాటిన తర్వాత చదివిన పుస్తకం కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు.’ నాన్‌స్టాప్‌గా చదివిన ఆ బుక్‌ను. తర్వాత అట్ల వదలకుండ చదివింది బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన ‘వనవాసి’. ఇవి రెండు నా ఆల్ టైం ఫేవరేట్ బుక్స్.
ఒకప్పటికీ ఇప్పటికీ పుస్తకాలు చదివే తీరులో వచ్చిన మార్పులు?
పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన కొత్తలో పుస్తకాల మీద దండయాత్ర చేసేది. మొదలుపెట్టి అన్నం, నీళ్లు, నిద్ర మాని చదివేదాన్ని. నాకు బాగా గుర్తుంది.. ఒకసారి ఇంట్లోవాళ్ళు ఊరికి వెళ్తే, తలుపులు పెట్టుకొని బయటికి రాకుండా రెండు రోజులు దాక పుస్తకాలు చదువుతనే ఉన్న. ఎప్పుడు తిన్ననో ఎప్పుడు నిద్రపోయిన్నో. దెబ్బకు ఇంటి పక్కనోళ్లు ‘ఏమైంది.. బయటికే రావడం లేదు.. ఆల్ ఓకేనా’ అని అడిగిర్రు.
పుస్తకాల్లో రచనల్లో మీరు అంతగా ఇష్టపడని ధోరణి?
ప్రేమ కథలు.. ఎందుకో తెలియదు మరి.
సాహిత్యంలో మీకు ఆల్టర్ ఈగో అనిపించిన పాత్ర?
నేను అంత పెద్దగ సాహిత్యం చదవలేదు. గాని ఒక్కోసారి చలం స్త్రీ పాత్రలు అలా అనిపిస్తయి.
రాయటానికి వాడే భాష విషయంలో మీకు మోడల్‌గా నిలిచిన రచయితలు?
రాయడం స్టార్ట్ చేసినప్పడు ఇంకా ఎవరి రచనలు చదవలేదు. ఆ తర్వాత మాత్రం అల్లం రాజయ్య, నామినిలా పాఠకులను కట్టిపడేయాలనుకుంట.
ఏ గత కాలం రచయితతోనైనా మాట్లాడగలిగితే?
‘వోల్గా సే గంగా’ రాసిన రాహుల్ సాంకృత్యాయన్‌తో మాట్లాడతా. భూమి మీద ఐదు వేల ఏళ్లకు ముందు.. మంచు యుగం చివరి దశలో మాతృస్వామ్యం ఉందని ఎలా ఊహించారో అడుగుతా.
(రాజీ కన్నా కథల సంపుటి ‘అర్రాసు’ ఇటీవల విడుదలైంది.)