Emotional Poetry: వర్షాకాలపు రాత్రి
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:15 AM
జమ్ముగడ్డి ఇంట్లో ఒట్టినేల మీద బొంత పరచుకుని ఇంటికప్పు మీద వర్షం చేసే సంగీతం వింటూ చల్లటి రాత్రి ఇద్దరం...
నేను:
జమ్ముగడ్డి ఇంట్లో
ఒట్టినేల మీద బొంత పరచుకుని
ఇంటికప్పు మీద వర్షం చేసే సంగీతం వింటూ
చల్లటి రాత్రి ఇద్దరం
వెచ్చగా
ఒకే దుప్పటిలో నిద్రపోదామా
తాను:
దుప్పటి లోనున్న నిశ్శబ్దంలో
నీ హృదయ స్పందన వింటూ,
వాన చినుకులు మన కలలకి తాళం వేస్తూ,
మనిద్దరం ఒకరినొకరు కౌగిలించుకుని,
వెచ్చని శ్వాసల్లో మునిగిపోతూ,
ఆ ఉదయం మెలకువ వచ్చే వరకు
ప్రపంచం మొత్తాన్ని మరచిపోదాం
నేను:
గుండె కోసి ఇవ్వనా
ఈ రాత్రి కోసం
భూమ్మీద బంగారం అంతా
చాలునా నీ ముద్దుకోసం
ప్రాణాలు వదలనా
నీ కౌగిలింతలోని సుఖం కోసం
తాను:
ఇవన్నీ ఏవీ జరగాల్సిన అవసరమే లేదు
నీ ముద్దుల్లో మునిగిపోతూ
శ్వాసలు కలిసే వేడి తాకిడిలో
గుండె తాళం తప్పిపోయే
వేళ కోసమే ఎదురుచూస్తుంటా
నేను:
నది ఒడ్డున నీకోసం నావతో సిద్ధంగా ఉన్నాను
ఈ జన్మలోనైనా నువ్వు వస్తావేమోనని
నువ్వు రాగానే మన కలల దీవికి వెళ్ళిపోదాం
అక్కడ జమ్ముగడ్డి ఇల్లు ఉంది
మా అమ్మ పాతచీరతో కుట్టిన బొంత ఉంది
కుంచెడు బియ్యానికి బేరం ఆడి కొన్న
కొత్త దుప్పటి ఉంది.
ఏం కావాలి ఓ కల కనడానికి?
తాను:
ఈ కల నిజమైన నాడు,
నేను మొత్తానికే నీ సొంతం అవుతాను
నేను:
నేను ఎప్పుడో నీ సొంతం.
ఇది ఇంకో జన్మ అంతే
- ప్రసాద్ సూరి