Share News

Israel - Iran Conflict: మరో యుద్ధం

ABN , Publish Date - Jun 14 , 2025 | 02:52 AM

ఇరాన్‌ గుండెలమీద కొట్టాం అన్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ. అతిశయోక్తి ఏమీ లేదు. ఇజ్రాయెల్‌ చేతిలో అది నవనాడులూ కుంగిపోయేలా దెబ్బతిన్నది.

Israel - Iran Conflict: మరో యుద్ధం

ఇరాన్‌ గుండెలమీద కొట్టాం అన్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ. అతిశయోక్తి ఏమీ లేదు. ఇజ్రాయెల్‌ చేతిలో అది నవనాడులూ కుంగిపోయేలా దెబ్బతిన్నది. అనేక దశాబ్దాలుగా ఎన్నడూ చవిచూడని ఘోరపరాభవం ఇది. దిక్కూమొక్కూలేని గాజాలో ఎంతదాష్టీకంతో మానవహననాన్ని సాగిస్తున్నదో, అదే తరహాలో ఇరాన్‌లోనూ ఇజ్రాయెల్‌ రెచ్చిపోయింది. ఇరానియన్లు గాఢనిద్రలో ఉండగా, ఇజ్రాయెల్‌కు చెందిన రెండువందల యుద్ధవిమానాలు చొరబడి, వేర్వేరు ప్రాంతాల్లోని కనీసం వందచోట్ల వందలాది క్షిపణులను కురిపించాయి. యురేనియం శుద్ధిప్లాంట్లు, సైనికస్థావరాలు, మిసైల్‌ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిపానని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది కానీ, నూటయాభైమంది సామాన్యజనం కూడా మరణించారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కేంద్రకార్యాలయం మీద దాడిచేసి ఆ సంస్థ అధినేత సహా పలువురు కీలకనాయకులనూ, అణుశాస్త్రవేత్తలను మట్టుబెట్టడం చిన్న విషయం కాదు. ఇరాన్‌ ఏకంగా తన సైన్యాధ్యక్షుడినే ఈ దాడుల్లో కోల్పోవడం తీవ్ర అవమానం. నంతాజ్‌ అణుకేంద్రం సహా అనేక కీలకస్థావరాలమీద పదేపదే విరుచుకుపడి, ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని ఇక అడుగు కూడా కదలనివ్వకుండా చేయగలిగింది ఇజ్రాయెల్‌. యుద్ధానికి కాలుదువ్విన ఇజ్రాయెల్‌కు గట్టిగుణపాఠం చెబుతానని ఇరాన్‌ హెచ్చరికలు చేస్తోంది. అది ఎప్పుడో, ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. ఇరాన్‌ అణుకార్యక్రమం అమితవేగంగా సాగుతోందని, వారాల్లో కాకున్నా, కొద్దినెలల్లోనే అది అణ్వస్త్రాలను తయారుచేయగల స్థాయికి చేరుకుందని ఇటీవల పాశ్చాత్య మీడియానుంచి వరుసకథనాలు వెలువడుతున్నప్పుడే మనకు అసలు కథ అర్థమైంది. ఇరాన్‌ కట్టుతప్పిందని, నిబంధనలను ఉల్లంఘిస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) గవర్నర్ల బోర్డు గురువారం తీర్మానించడంతో, దాడికి పూర్వరంగం సిద్ధమవుతోందని తెలిసిపోయింది. ఇప్పుడు నెతన్యాహూ కూడా తన ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ లక్ష్యాన్ని నొక్కిచెబుతూ, ఒకటీ రెండూ కాదు, ఏకంగా తొమ్మిది అణుబాంబులు తయారుచేయగలిగే శక్తి ఇరాన్‌కు ఉందన్నారు. శుద్ధిచేసిన యురేనియం ఇరాన్‌ దగ్గర ఎంతో పోగుపడిందనీ, ఆ దేశాన్ని ఇప్పుడే ఆపకపోతే అణ్వాయుధాలు తయారుచేసి ప్రపంచపటం నుంచి ఇజ్రాయెల్‌ను చెరిపేస్తుందని, ఈ ముందస్తు దాడులు ఆత్మరక్షణకేనని నెతన్యాహూ అంటున్నారు. ఇరాన్‌ ముప్పు పూర్తిగా తొలగిపోయేంతవరకూ ఈ ముప్పేటదాడి కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో నంతాజ్‌ అణుకేంద్రం పూర్తిగా ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. ఒకపక్క అమెరికాతో దశలవారీ చర్చలు జరుగుతూండగా, ఇజ్రాయెల్‌ ఈ దాడులు చేయడం విశేషం.


ఈ చర్యతో తమకు సంబంధం లేదని అమెరికా వెంటనే ప్రకటిస్తూ, ప్రతీకారం పేరిట హద్దులు దాటవద్దని ఇరాన్‌ను హెచ్చరించింది. కానీ, ఇరాన్‌కు ఇది తగిన గుణపాఠమని, మరిన్ని దాడులకు గురికాకుండా ఉండాలంటే దారికొచ్చి, తనతో ఒప్పందం కుదర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు చేయడం విశేషం. ఇజ్రాయెల్‌ దాడిలో తన పాత్రేమీలేకున్నా, తనకు చెప్పే ఈ దాడి జరిగిందని అమెరికా తేల్చేసింది. బరాక్‌ ఒబామా ఏలుబడిలో కుదిరిన ఒక చక్కని అంతర్జాతీయ ఒప్పందాన్ని 2018లో నిలువునా పాతరేసిన ట్రంప్‌, ఈ విడతలో మళ్ళీ ఒప్పందం కోసం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇరాన్‌ తన యురేనియం శుద్ధికార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసి, ఇప్పటికే తన దగ్గరున్న 400కేజీల యురేనియంను నాశనం చేయాలని ట్రంప్‌ ఒత్తిడిచేస్తున్నారని, అందుకు ఇరాన్‌ అంగీకరించడం లేదని వార్తలు వచ్చాయి. అరవైరోజుల్లో రాజీకి రావాలని అప్పుడే హెచ్చరించాను, ఇవాళ 61వ రోజు అని ఈ దాడుల అనంతరం ట్రంప్‌ ట్వీట్‌ చేయడం విశేషం. అప్పట్లో ఒబామా ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం ఇరాన్‌ను మిగతా ప్రపంచానికి జవాబుదారీని చేసి, పరిధుల్లోనూ, పర్యవేక్షణలోనూ ఉంచింది. అప్పటివరకూ యుద్ధభయంతో ఉన్న ప్రపంచానికి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. యుద్ధం తప్ప శాంతి గిట్టని, ఒప్పందాల మాటే నచ్చని నెతన్యాహూ మాత్రం ఆదినుంచీ దానిని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ అధికారంలోకి రాగానే సదరు ఒప్పందాన్ని కాలదన్నేట్టు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒప్పందం పేరిట ఒక కొత్త కథకు ట్రంప్‌ తెరదీసినా, ఇరువురి అంతిమలక్ష్యం ఇరాన్‌ను నాశనం చేయడమే. ఇజ్రాయెల్‌ దాడితో ఆదివారం ఒమాన్‌లో జరగాల్సిన మరోవిడత చర్చలకు విఘాతం ఏర్పడింది. సైన్యంతో తప్ప, సామరస్యంగా వ్యవహరించడం గిట్టని నెతన్యాహూ, తనచేతికి మట్టి అంటకుండా ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అనుకుంటున్న ట్రంప్‌ ఈ ప్రపంచాన్ని పెనుప్రమాదంలోకి నెట్టకపోతే అంతేచాలు.

Updated Date - Jun 14 , 2025 | 02:57 AM