Share News

The Nimisha Case: నిమిషకు కీడుచేసిన భారతీయ మీడియా

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:29 AM

జీవనోపాధి, విద్యాభ్యాసం నిమిత్తం దేశ సరిహద్దులు దాటుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. విదేశాలలో ఉంటున్న భారతీయుల స్థితిగతులపై సరైన సమాచారం తెలుసుకొనేందుకు తమకంటూ ఒక...

The Nimisha Case: నిమిషకు కీడుచేసిన భారతీయ మీడియా

జీవనోపాధి, విద్యాభ్యాసం నిమిత్తం దేశ సరిహద్దులు దాటుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. విదేశాలలో ఉంటున్న భారతీయుల స్థితిగతులపై సరైన సమాచారం తెలుసుకొనేందుకు తమకంటూ ఒక స్వంత వ్యవస్థ భారతీయ మీడియాకు ఇప్పటికీ లేదు. దేశ ప్రయోజనాలతో ముడివడి ఉన్న దౌత్య నియమాలకు తోడుగా మానవీయకోణంలో స్పందించవల్సిన అనేక సందర్భాలలో భారతీయ మీడియా తన విధ్యుక్త ధర్మ నిర్వహణలో విఫలమవుతోందని చెప్పక తప్పదు. సామాజిక మాధ్యమాలు లేదా ఒక పక్షం వాదన ఆధారంగానే భారతీయ మీడియా వార్తా కథనాలు ప్రచురిస్తోంది. ఈ కథనాలు వాస్తవాలను కప్పిపుచ్చుతూ ప్రజలలో అయోమయం సృష్టిస్తున్నాయి. యమన్‌లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ యువతి నిమిష ప్రియ ఉదంతమే భారతీయ మీడియా ధోరణులకు ఒక తాజా ఉదాహరణ. సున్నితమైన ఒక అంశాన్ని భారతీయ మీడియా అవధులు మీరి జటిలం చేసిందని నిమిష ఉదంతం స్పష్టం చేసింది. హతుడి కుటుంబంతో సామరస్యపూర్వకంగా రాజీ చేసుకుని ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం నిమిషకు ఉన్నది. అయితే భారతీయ మీడియా అవగాహన రాహిత్యంతో, ఉభయ పక్షాల వాదనలను నిష్పాక్షికంగా నివేదించకుండా కేవలం ఒక పక్షం వారి వాదనకే ప్రాధాన్యమిచ్చింది. ఈ కారణంగానే నిమిషకు క్షమాభిక్ష లభించకపోయే పరిస్థితి ఏర్పడింది. యమనీ హతుడి కుటుంబం నిమిషను క్షమించవచ్చనే అభిప్రాయం ఒక దశలో గట్టిగా ఏర్పడింది.


అయితే భారతీయ మీడియా పుణ్యమా అని నిమిషకు మరణ శిక్ష అమలు చేయవల్సిందేనని హతుడి కుటుంబం ఇప్పుడు పట్టుబడుతోంది. వాస్తవాలు తెలుసుకోకుండా భారతీయ మీడియా చేసిన దుష్ప్రచారం తమకు బాధ కలిగించిందని హతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కేరళకు చెందిన ఇస్లాం పండితుడి జోక్యం, కుటుంబంతో సంబంధం లేని సంఘాల నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళిన అంశాలపై మీడియా హంగామా నిమిషకు మేలు కంటే కీడు ఎక్కువ చేసిందని చెప్పవచ్చు. యమన్ జాతీయుడు తలాల్ మహెదీను నిమిష పెళ్ళి చేసుకున్న విషయాన్ని భారతీయ మీడియా వ్యూహాత్మకంగా వెల్లడించలేదు. మోతాదుకు మించి మత్తు మందు ఇంజక్షన్ ఇవ్వడంతో మహెదీ మరణించినట్లుగా భారతీయ మీడియా చెబుతోంది. అయితే ఆమె అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి సంచిలో వేసి నీళ్ళ ట్యాంకులో పారేసి 600 కిలోమీటర్ల దూరానికి పారిపోయినట్లుగా యమనీ మీడియా ప్రచురించిన కథనాలను ఉపేక్షిస్తోంది. ఆ కథనాలను ఎందుకు ప్రస్తావించడం లేదు? భాష రాక పరాయి దేశంలో ఉన్న బాధితురాలిగా నిమిషను చిత్రీకరిస్తున్న భారతీయ మీడియా.. ఈ హత్యలో ఆమెకు సహకరించిన యమనీ పౌరురాలు హానన్‌కు పదేళ్ళ శిక్ష విధించారని, నిమిషను కారులో తీసుకెళ్ళిన యమనీ డ్రైవర్‌కు కూడా జైలు శిక్ష విధించారనే విషయాన్ని చెప్పనే లేదు. స్థానిక భాషా పరిజ్ఞానం లేకుండానే నిమిష అక్కడ ఆసుపత్రిని ఎలా ప్రారంభించిందనే విషయాన్ని భారతీయ మీడియా ప్రశ్నించలేదు. మహెదీ హత్య అనంతరం నిమిష, తిరుగుబాటుదారులైన హూతీల పాలనలో ఉన్న సనా నుండి పారిపోయి చట్టబద్ధ ప్రభుత్వం ఉన్న హద్రమౌత్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఒక ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లుగా యమనీ మీడియా వార్తలు వెల్లడించాయి. యమన్‌కు పొరుగున ఉన్న ఒక గల్ఫ్ దేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా నిమిష పట్టుబడినట్లుగా తెలుస్తోంది.


అసలు పదవ తరగతి కూడా ఉత్తీర్ణురాలు కాకుండా నర్సింగ్ డిప్లొమో చేసిన నిమిష తన స్వంత రాష్ట్రం కేరళలో సైతం నర్సింగ్ వృత్తి చేయడానికి అనర్హురాలు. అయినా నర్సింగ్ ఉద్యోగం చేయడానికి ఆమె యమన్‌కు వెళ్ళింది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలం పని చేసిన అనంతరం ఆమె ఏకంగా స్వంత ఆసుపత్రిని నెలకొల్పుకునేందుకు నిర్ణయించుకుని హతుడు తలాల్ సహాయ సహకారాలను తీసుకోవడం ఆసక్తికరమైన విషయం. తలాల్ స్వయంగా కేరళకు వచ్చి ఆమె ఇంట్లో అతిథ్యం స్వీకరించి వెళ్ళడం అంతకన్నా ఆసక్తికరం. హూతీ దళాల తిరుగుబాటు తదనంతరం యమన్‌లోని భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం చేసిన సూచనను మన్నించి అక్కడి ప్రవాసులు అందరూ మాతృభూమికి చేరుకున్నారు. చివరకు సనాలో భారతీయ ఎంబసీని కూడా మూసివేసారు. అయినా నిమిష స్వదేశానికి వెళ్ళకుండా తలాల్ కుటుంబంతో కలిసి అతని ఇంట్లో నివసించిందనేది గమనార్హం. యమనీ మీడియా కథనాల ప్రకారం, ఆమె తలాల్‌ను స్థానిక చట్టాల ప్రకారం వివాహం చేసుకున్నది. ఆ తర్వాతే ఆమె ఆసుపత్రిని ప్రారంభించింది. హతుడి సోదరుడు బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరుడితో నిమిషకు వివాహం జరిగిందని ధ్రువీకరించారు. హత్య జరిగిన పరాయి దేశంలోని అన్ని స్థాయిల్లోని న్యాయస్థానాలలో అప్పీళ్ల దశ కూడా పూర్తయిన కేసుకు సంబంధించి మన దేశంలోని సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రచార ఆర్భాటం మినహా మరేమీ కాదు. ఒక్క నిమిష ఉదంతంలోనే కాకుండా, అరబ్బు దేశాలలో పనిచేస్తున్న భారతీయులకు సంబంధించిన అనేక ఉదంతాలపై భారతీయ మీడియా ప్రచురించే అర్ధసత్య కథనాల సంచలనాలతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:30 AM