Municipal Failure On Dog Control: వీధికుక్కల సమస్యకు పరిష్కారం లేదా
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:19 AM
దేశంలో వీధికుక్కలు దాడులు చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది.

దేశంలో వీధికుక్కలు దాడులు చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ళలో 6,72,860 కుక్క కాటు కేసులు నమోదైనట్లు కేంద్ర పశుసంవర్ధకశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 23,180 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రతియేటా దేశంలో వీధికుక్కల బారినపడి గాయాలపాలవుతున్న వారి సంఖ్య 26.5 శాతం చొప్పున పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వీధికుక్కల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏకంగా ఒక కమిటీనే నియమించిందంటే దేశంలో వీధికుక్కల సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్–హర్యాణా హైకోర్టులో దాఖలైన 193 కుక్కల దాడి ఘటనలపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు ఒక్కొక్క పంటిగాటుకు పదివేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలనీ, గాయం 0.2 సెంటీమీటర్లు ఉండి, కండ ఊడివచ్చిన కేసుల్లో బాధితునికి పరిహారంగా ఇరవై వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది.
విచిత్రమేమంటే, ఎవరినైనా వీధికుక్క కరవటమో, పత్రికలలోను, మీడియాలోను వార్తలు రావటమో, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తటమో లేదా న్యాయస్థానాలు గట్టిగా చీవాట్లు పెట్టటమో జరిగినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు అధికారులు సమీక్షలు జరుపుతున్నారు. ఆ తరువాత మెల్లగా సమస్యను పక్కనపడేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే తంతు జరుగుతోంది. ఈ తంతులో అమాయకులైన ప్రజలు గాయపడటమో, ప్రాణాలు కోల్పోవటమో జరుగుతోంది. పాలకులకు, అధికారులకు ఎటువంటి శిక్షలూ ఉండవు. కనుక సమస్య గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. మన దేశంలో ఏటా పదిహేను లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారని, ఇరవై వేల మంది రేబిస్ వ్యాధి సోకి చనిపోతున్నారనీ, వీరిలో నలభైశాతం పదిహేనేళ్ళలోపు స్కూలు వయస్సు బాలబాలికలేననీ లెక్కలు చెబుతున్నాయి. ఒక సర్వే ప్రకారం దేశంలో ముప్పై లక్షలకు పైగా వీధికుక్కలు ఉన్నాయి. పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల చట్టాలలో ప్రమాదకరమైన వీధికుక్కల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిబంధనలు స్పష్టం చేస్తున్నా, సంబంధిత అధికారులు వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇందుకు కారణం– చట్టాల అమలు తీరును పర్యవేక్షించేవారు, సకాలంలో సమీక్షించేవారు లేకపోవటం; చట్టాలు, నిబంధనలను అమలుచేయని అధికారులపై సరైన చర్యలు లేకపోవటం.
అలసత్వాన్ని ప్రదర్శించే అధికారులపై కొరడా ఝుళిపించాలి. కుక్కకాటుకు గురైన వారికి నిర్ణీత మొత్తంలో పరిహారాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలుచేసి బాధితులకు చెల్లించేలా నిబంధనలను మార్చాలి. స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి, చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. సకాలంలో చర్యలు తీసుకుంటే వీధికుక్కల వల్ల రేబిస్ వ్యాధి బారినపడే వారి సంఖ్యను 80 శాతం వరకు తగ్గించవచ్చు. రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిత్యం సమీక్షించాలి. న్యాయస్థానాలు కూడా తాము ఇచ్చిన తీర్పులను తరచు సమీక్షించి, అలసత్వం ప్రదర్శించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సుచేయాలి.
– డా. వి. రాజేంద్రప్రసాద్