Urban Metro Expansion: మౌలిక వసతులతో ప్రగతికి బాటలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:29 AM
దేశ ప్రగతి మౌలిక సదుపాయాల వృద్ధిపై ఆధారపడి ఉంటుంది. పౌరులకు అవసరమైన సేవలు అందించడం వీటితో సాధ్యపడుతుంది. మౌలిక సదుపాయాల కల్పన ఒక్క రోజులో జరిగే పని కాదు. దీర్ఘకాలిక, స్పల్పకాలిక లక్ష్యాలతో ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది.
దేశ ప్రగతి మౌలిక సదుపాయాల వృద్ధిపై ఆధారపడి ఉంటుంది. పౌరులకు అవసరమైన సేవలు అందించడం వీటితో సాధ్యపడుతుంది. మౌలిక సదుపాయాల కల్పన ఒక్క రోజులో జరిగే పని కాదు. దీర్ఘకాలిక, స్పల్పకాలిక లక్ష్యాలతో ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధితో దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ, అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరం. మన దేశం అంతర్జాతీయ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడంలో ఈ వసతులదే కీలక భూమిక. దీనిని గుర్తించిన నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దార్శనిక దృక్పథంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. వీటి కల్పనలో స్థిరమైన వృద్ధిని కొనసాగించడం, జాప్యాన్ని నివారిస్తూ సకాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయడం మరొక కీలక అంశం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ పనిచేస్తేనే నిర్ధారిత లక్ష్యాలను చేరుకోగలం. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను పట్టణాలతో అనుసంధానించే ప్రక్రియలో భాగంగా గ్రామీణ రహదారుల నిర్మాణం గత 11 సంవత్సరాలలో వేగం పుంజుకోవడం శుభపరిణామం. దేశంలో దాదాపుగా 99 శాతం గ్రామాలను అనుసంధానించే కార్యక్రమం పూర్తిచేశారు. రైల్వే లైన్ల డబ్లింగ్, రైలు మార్గాల విద్యుదీకరణ, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తొలిసారిగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్వదేశీ సెమీ, హై స్పీడ్ రైళ్లు పరుగులు తీయడం నిర్ధారిత లక్ష్యాన్ని చేరుకోవడానికి నిదర్శనం. అందుబాటు వ్యయంతో ప్రజలకు విమాన ప్రయాణ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. గత దశాబ్ద కాలంలో 85 విమానాశ్రాయాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటితో పాటు 73 విమానాశ్రయాలు, 13 హెలిపోర్టులు, 2 జల విమానాశ్రయాలను ఉడాన్ పథకంతో అనుసంధానించారు.
పెద్ద నగరాలకు పరిమితమైన మెట్రో రైలు సౌకర్యాన్ని గత పదేళ్లలో 23 నగరాలకు చేరువ చేశారు. రవాణా వ్యయాన్ని తగిస్తూ అంతర్జాతీయ వాణిజ్యానికి చేయూతనిస్తూ అంకుర సంస్థలు, వ్యాపారులు, రైతులకు నూతన అవకాశాలను చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక(ఎన్‌ఎంపీ)లో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమగ్ర, సమీకృత ప్రణాళిక రూపొందించే దిశగా ఒక ప్రగతిశీల విధానంగా దీనిని తీర్చిదిద్దారు. 2014 నుంచి 2024 మధ్య రోడ్డు రవాణా, జాతీయ రహదారుల బడ్జెట్ 570 శాతం పెరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 400 వందే భారత్ రైళ్ల తయారీ లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం 136 రైళ్లు ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అలాగే రోజువారీ జాతీయ రహదారుల సగటు నిర్మాణ వేగం 2025లో 34 కిలోమీటర్లకు చేరింది. రైలు ప్రయాణ మరణాల తగ్గింపు లక్ష్యంగా 2024 నుంచి రైల్వే బడ్జెట్‌ను 9 రెట్లు పెంచారు. 2014లో 248 కిలోమీటర్లకు పరిమితమైన మెట్రో సౌకర్యాన్ని 2025 నాటికి 1013 కిలోమీటర్లకు కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. గడచిన ఐదేళ్లలో 3600 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్లను నిర్మించారు. అమృత్, అమృత్ 2.0 పథకాలలో భాగంగా 6,933 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను పూర్తిచేశారు. 2014 నుంచి గ్రామీణ ప్రాంతాలలో 3.96 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించారు. జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2020–21లో రోజువారి సగటున 37 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేస్తూ సరికొత్త రికార్డు లిఖించారు. ఢిల్లీ–వడోదర ఎక్స్‌ప్రెస్ వేలో 2.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల కాంక్రీట్ పేవ్‌మెంట్‌ని కేవలం 24 గంటల్లో పూర్తిచేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెనను ఇటీవల ప్రారంభించారు. పదివేల అడుగుల ఎత్తున ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగం అటల్ టన్నెల్ నిర్మాణం దేశానికే గర్వకారణం. సుదర్శన్ సేతు నిర్మాణం, ముంబాయిలో నిర్మించిన అటల్ సేతు, నూతన పంబన్ వంతెన వంటివి మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనాలు. దశాబ్దాలుగా పూర్తికాని యూపీలోని సరయూ నహర్ ఇరిగేషన్ కెనాల్, బీహార్‌లోని కోసీ రైల్ మహాసేతు, కేరళలో కొల్లాం బైపాస్ ప్రాజెక్టు, బ్రహ్మపుత్ర నదిపై బోగీబీల్ రైలు–రోడ్డు వంతెన, ఢిల్లీ చుట్టూ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే వంటివి పూర్తిచేశారు. మౌలిక వసతుల కల్పన, అనుసంధానంలో జరిగిన వృద్ధి వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార, వాణిజ్య రంగాలు బలోపేతమవుతాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రజల ఆర్థిక పురోభివృద్ధి మరింత మెరుగవుతుంది. భవిష్యత్ భారతావనికి అవసరమైన మౌలిక వసతుల కల్పన దశాబ్దకాలంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.
-వేదుల వి.ఎస్.వి నరసింహం
విశాఖపట్నం