Share News

Telugu Short Prose: చివరికి ఇలాగే నీలాగే

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:07 AM

సో ఫాలో పడుకుని ఉన్నావు నువ్వు. మునుపు ఎన్నడో, ఎన్నేళ్ల క్రితమో పగిలిన పాత కిటికీ అద్దంలోంచి వెలుతురు, దుమ్ము పట్టి పాలిపోయిన కాగితంలాగా! సోఫాలో, ఎవరో ఉండగా చేసి విసిరి కొట్టిన ఆదే కాగితంలాగా, ముడతలు పడి ఉన్నావు ...

Telugu Short Prose: చివరికి ఇలాగే నీలాగే

సో ఫాలో పడుకుని ఉన్నావు నువ్వు. మునుపు ఎన్నడో, ఎన్నేళ్ల క్రితమో పగిలిన పాత కిటికీ అద్దంలోంచి వెలుతురు, దుమ్ము పట్టి పాలిపోయిన కాగితంలాగా! సోఫాలో, ఎవరో ఉండగా చేసి విసిరి కొట్టిన ఆదే కాగితంలాగా, ముడతలు పడి ఉన్నావు నువ్వు! లొట్టపోయి స్ప్రింగులు బయట పడుతున్న, దుప్పటి లేని ఆ మురికి సోఫాలో దగ్గరగా ముడుచుకుని, గుప్పెడంత ఎముకల పోగులాగా, తడిచిన గోడల అరలలో మగ్గిపోయిన పుస్తకాల వాసనలాగా, ఎన్నో ఏళ్లుగా మార్చని కర్టైన్స్ లాగా, పాలిపోయిన వాటి రంగుల్లాగా, ఆ గదుల్లో తిరుగాడే నల్లని నిశ్శబ్దం లాగా. తుడవని పాత ఫొటోలాగా. మసి పట్టిన స్టవ్ లాగా, వంట గదిలోనే ఒక అరలో నూనె మరకలతో నువ్వు ఇక పూజించని వెలసిపోయిన దేవుని పటంలాగా

మరి ఎప్పుడైనా నేను ఆ కాగితపు ఉండను విప్పితే, లోపల వంకర టింకరగా పిల్లలు దిద్దుకున్న చిన్న అక్షరాలు ఏవో. వాళ్ళు వేసుకున్న పెన్సిల్ బొమ్మలు ఏవో: తెల్లగా, నల్లగా! ఇల్లు, చెట్టు, గూడూ, పిట్టలూ. వాటి అన్నిటి మధ్యగా ఒక ముద్దలాగా, ఎండిన ఇంకు. దాని మరక! నీ చేయే తొణికి ఇంకు బుడ్డీ జారిందో, లేక నీ హృదయమే నేల రాలి, చిట్లి, ముక్కలయి నెత్తురు ముద్దగా చిందిందో కానీ, నీలో నల్లగా కమిలిన ఆ ఇంకు మరక! పోదు అది! నువ్వు కాలి, పట పటా నీ బొమికలు విరిగి, చివరికి నిన్ను బూడిదగా మిగిల్చిన ఆ ప్రేమ మరక. పోదు అది, బాల్యంలో అమ్మవారు వస్తే పోడానికి, నీ నుదిటిన వాళ్ళు కాల్చిన మచ్చలాగా: అది! పోదు అది, నిన్ను స్థబ్దుగా మార్చిన

ఆ పచ్చి గాయం మరక! ప్రేమ మరక –

సోఫాలోనే పడుకుని ఉన్నావు నువ్వు. పగిలిన

నీ శరీరంలోంచి చిన్నగా మసక వెలుతురు. ఈదురు గాలి: ఈలలాగా. మరి ఎక్కడో రెక్కలు కొట్టుకునే సవ్వడి. కొట్టుకునే రెక్కలు విరిగి, విలవిలలాడి, ఇక అవి నెమ్మదిగా ఆగిపోయే చప్పుడు. ఆనక నిశ్శబ్దం. చీకటే గదులుగా మారి ఉన్న ఆ ఇంట్లో, అనంతమైన నీ ఒంటరితనంలో, ఇటువంటి వృద్ధాప్యంలో నీలో ఒక మూలుగు, అప్పుడు! ‘‘అమ్మా’’ అని అన్నావా? ఏదో గొణుగుతావు: ‘‘నానీ’’ అని పిలిచావా? ‘‘నీళ్లు’’ అని అడిగావా? నీ చేతిని చాచావా? సోఫా పక్కగా, పల్చటి శాలువాలోంచి నిస్సత్తువతో ఎముకలు బయటపడిన నీ చేయి! ఎవరినో పిలుస్తున్నట్లు, ఎవరినో ఉండమన్నట్లుగా... ఆ చేయి... ‘‘ముట్టుకో’’ అని చిన్నగా గుసగుసగా అన్నట్లుగా! అన్నావా లేక నేనే భ్రమ పడ్డానా? నువ్వు నాకు తెలుసు అనీ, నిన్ను అర్థం చేసుకున్నాననీ...


సోఫాలోనే ఇంకా పడుకుని నువ్వు: అట్లా. ఇన్నాళ్లూ తిన్నావో లేదో, పడుకున్నావో లేదో ఎవరికీ తెలియదు. అన్నీ మరొకరికే అయ్యి, అన్నీ మరొకరికే చేసి – నిన్ను నువ్వు మరచి – చివరికి ఎవరూ లేక ఒక్కదానివే అయ్యి, ఏ చేతిలోంచో – విసిరి వేయబడో, లేక క్రమేణా చేజారిపోయో, నీలోంచి నువ్వే తప్పిపోయి, ప్రేమ ఉందని కడ దాకా నమ్మీ నమ్మీ, ఏమీ లేకుండా, ఎవరికీ ఏమీ కాకుండా చివరికి ఇలా చివికిపోయి మిగిలి, నిద్ర మాత్రలతో, diabetic మందులతో, నిరంతరం నీతో ఉంచుకునే జండూ బాల్మ్‌తో, పోగా మిగిలిన ఒక కన్నుతో, ఏదీ సరిగ్గా చూడలేక, ఏదీ పూర్తిగా వినలేక, రాత్రిలో రాత్రై, చీకట్లోని ఏడుపై, లీలగా వినిపించే వెక్కిళ్ళై, ఈ డెబ్భై అయిదేళ్ల వయస్సులో – గాలికి ఎటో కొట్టుకుపోయే, ఎంతో ఇష్టంతో నువ్వే రాసుకుని, బొమ్మలు వేసుకుని, ఎందుకో ఏడుపు దిగమింగుకుని చించి ఉండ కట్టి చీకట్లోకీ గాలిలోకీ విసిరేసుకున్న కాగితానివై, చివరికి ఇలా... చివరికి ఇలాగే, చివరికి ఇలాగే నీలాగే

చచ్చిపోతానా నేనూ?

శ్రీకాంత్‌ కె

ఇవి కూడా చదవండి

బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని

రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గరు మృతి

Updated Date - Nov 24 , 2025 | 05:07 AM