Madina Accident Umrah Pilgrims: మదీనా మృతులకు గౌరవ వీడ్కోలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:59 AM
ప్రమాదవశాత్తు జరిగే దుర్ఘటనల్లో ప్రాణాలు ఎవరు కోల్్పోయినా బాధకరమే. ఆ ప్రమాద ఘటన వారి స్వస్థలానికి దూరంగా అందునా విదేశీగడ్డపై సంభవించడం మరింత దుఃఖదాయకం. ఇటీవల హైదరాబాద్ నుంచి...
ప్రమాదవశాత్తు జరిగే దుర్ఘటనల్లో ప్రాణాలు ఎవరు కోల్్పోయినా బాధకరమే. ఆ ప్రమాద ఘటన వారి స్వస్థలానికి దూరంగా అందునా విదేశీగడ్డపై సంభవించడం మరింత దుఃఖదాయకం. ఇటీవల హైదరాబాద్ నుంచి ఉమ్రా (ఇస్లామిక్ తీర్థయాత్ర)కు సౌదీ అరేబియాకు వెళ్లిన (చిన్నారులు, మహిళలతో సహా) 45 మంది తీర్థ యాత్రికులు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీఘ్రగతిన స్పందించిన తీరు అభినందనీయం. ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధతో అధికారిక లాంఛనాలు అన్నీ సత్వరమే పూర్తయి, మృతులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మదీన పుణ్యక్షేత్రంలో అంతిమక్రియలు నిర్వహించారు. ప్రమాదం చోటుచేసుకున్న వెన్వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి మృతులకు అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు చెందిన వారిని డి.యన్.ఎ పరీక్షల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సౌదీ అరేబియాకు పంపించారు. రేవంత్ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మోహమ్మద్ అజ్హరోద్దీన్ సారథ్యంలో ఒక అధికారిక బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సౌదీ అరేబియాకు వచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్ధాయి బృందం ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్వర్యంలో సౌదీ అరేబియాకు వచ్చి సౌదీ అధికారిక వర్గాలతో సమావేశమై మృతదేహాల అప్పగింత విషయమై చర్చించింది. భారతీయ రాయబారితో సహా సమస్త దౌత్యవేత్తలు మదీన పుణ్యక్షేత్రంలో మకాం వేసి మృతదేహాల అప్పగింత, అంతిమక్రియల ఏర్పాట్లను సమన్వయం చేసారు. మదీన పుణ్యక్షేత్రంలోని జన్నతుల్ బఖీ అనే స్మశానవాటికకు ఇస్లాంలో ప్రాముఖ్యత ఉంది. తమను ఈ స్మశానవాటికలో ఖననం చేయాలని విశ్వాసులు ప్రగాఢంగా అభిలషించడం కద్దు. సాధారణంగా ఇక్కడ ఖననానికి అనుమతులు ఇవ్వరు. అయితే భారతీయ అధికారుల కృషి ఫలితంగా హైదరాబాద్ మృతులందరికీ జన్నతుల్ బఖీలో అంతిమక్రియలు నిర్వహించేందుకు సౌదీ అధికారులు అనుమతించారు. ఇదీ ఒక గొప్ప విషయమే, సందేహం లేదు.
తీర్థ యాత్రలలో మరణించిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించింది. ముస్లింలైనా, ఇతర మతస్తులైనా తీర్థ లేదా విహార యాత్రలకు వెళ్లేవారు సాధారణంగా మధ్య తరగతి లేదా ఉన్నత వర్గానికి చెందిన వారై ఉంటారు. పైగా సౌదీ అరేబియాలో తాజాగా అమలులో ఉన్న నిబంధన ప్రకారం, భారత్‌తో సహా విదేశాల నుంచి వచ్చే ఉమ్రా యాత్రికులకు బీమా తప్పనిసరి. బీమా పాలసీ లేకుండా వీసా ఎండార్స్ చేయరు. ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్రా యాత్రికులకు ఒక్కోక్కరికి ఒక లక్ష రియాళ్ళు అంటే సుమారు రూ. 23.77 లక్షలు చొప్పున లభిస్తాయి. అయినా, రాష్ట్రప్రభుత్వం కూడా నష్టపరిహారం ప్రకటించడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
హైద్రాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు, నగరంలోని కొన్ని ప్రాంతాలలో బలీయమైన శక్తిగా ఉన్న మజ్లీస్ పార్టీ మద్దతు అవశ్యకత ఉందనే విషయం ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో అవగతమైంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవడమనేది అటు కాంగ్రెస్‌కు, ఇటు మజ్లిస్‌కు ఒక రాజకీయ అనివార్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మదీన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక చర్యలను కొందరు ఈ కోణంనుంచే చూస్తున్నారు. ఒక అధికారిక బృందంలో మజ్లీస్ పార్టీ శాసనసభ్యుడిని రాష్ట్ర ప్రభుత్వం సౌదీ అరేబియాకు పంపించింది. అతడు దాన్ని పూర్తిగా ఓవైసీ ఖాతాలో వేస్తూ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయంతో చేసిన సహాయక చర్యలన్నీ కూడా మజ్లిస్ తన ఖాతాలోకి జమ చేసుకోగా కాంగ్రెస్ నిస్సహాయంగా చూస్తుండిపోయింది. ఈ రకమైన బుజ్జగింపు చర్యల వల్లే, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే హైద్రాబాద్ నగరంలో స్థానికంగా బలోపేతం కాలేకపోతోంది. అందుకు కాంగ్రెస్ సైతం మినహాయింపు కాదు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..