జాతి నిర్మాణంలో హిందీ బంధం
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:15 AM
జీవనోపాధికి కన్న ఊరు, మాతృదేశం విడిచి సుదూర సీమలకు వెళ్లిన తర్వాత తల్లి భాష, స్వీయ జాతీయ సంస్కృతి ప్రాధాన్యం తెలిసివస్తుంది. ప్రపంచంలో 193 దేశాలున్నాయి. ఇంచుమించు ఈ సమస్త దేశాల వారు గల్ఫ్ రాజ్యాలలో, ముఖ్యంగా దుబాయిలో

జీవనోపాధికి కన్న ఊరు, మాతృదేశం విడిచి సుదూర సీమలకు వెళ్లిన తర్వాత తల్లి భాష, స్వీయ జాతీయ సంస్కృతి ప్రాధాన్యం తెలిసివస్తుంది. ప్రపంచంలో 193 దేశాలున్నాయి. ఇంచుమించు ఈ సమస్త దేశాల వారు గల్ఫ్ రాజ్యాలలో, ముఖ్యంగా దుబాయిలో ఉంటున్నారు. ఒక్క భారతీయులు మినహా ఇతర జాతీయులు అందరూ తమ తమ భాషలలో పరస్పరం సంభాషించుకుంటారు. ఇటువంటి అవకాశం భారతీయులకు లేదు.
హిందీ లేదా ఆంగ్లం రాని ఒక భారతీయుడు తన భాష తెలియని తోటి స్వదేశస్థుడితో అరబ్బి భాషలో మాత్రమే మాట్లాడగలుగుతాడు. చివరకు తమ ఫిర్యాదులతో భారతీయ దౌత్య కార్యాలయాలకు వచ్చే దక్షిణ భారత ప్రవాస కార్మికులు అనేక మంది అరబ్బి భాషలోనే తమ గోడు చెప్పుకోవడం కద్దు. క్రింది స్థాయి దౌత్య సిబ్బంది అరబ్బి నుంచి హిందీ భాషలోకి అనువదించి అధికారులకు వివరిస్తారు. తెలుగు ప్రవాసులు లేదా ఉత్తరాది వారు ఉదయం వేళ అల్పాహారానికై మలయాళీలు నిర్వహించే హోటల్‌కు వెళ్ళి అరబ్బిలో ఆర్డరు ఇస్తారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన మహిళ ఒకరు తెలుగు మినహా మరే భాష రాకపోవడంతో సుమారు ఒక సంవత్సరం జైలులో మగ్గిపోవలసివచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలోక్ తివారీ సౌదీ అరేబియాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. ఆయనకు తెలుగు మిత్రులు ఎక్కువ. ఒకసారి ఆయన కుటుంబసమేతంగా తెలంగాణ పర్యటనకు వెళ్లారు. అయితే భాషాపరమైన ఇబ్బందితో అర్ధాంతరంగా ఆయన తన పర్యటనను ముగించుకోవలసివచ్చింది. బహుళజాతి సంస్థలలో పనిచేసే నానా దేశాల వారు మధ్యాహ్న భోజన విరామంలో ఆయా జాతీయులు అందరూ కలిసి ఒక్కచోట తమ తమ భాషలలో మాట్లాడుకొంటుండగా, భారతీయులు మాత్రం ప్రాంతాలవారీగా విడిపోతుంటారు. మలయాళీలు ఒక బృందంగా, ఉర్దూ మాట్లాడే హైదరాబాదీలు మరో సమూహంగా విడిపోతుంటారు. హిందీ భాష రాని కారణంగా ఐ.టి నిష్ణాతులైన తెలుగు ఇంజినీర్లు తాము పని చేస్తున్న సంస్ధలలో తోటి భారతీయులతో కలివిడిగా ఉండలేకపోతున్నారు. ఇది వారిని సామాజికంగా ఏకాకులను చేస్తోంది.
ఈ నేపథ్యంలో హిందీ ప్రాధాన్యాన్ని తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఉంది. విశాల భారతావని విభిన్న భాషలు, వైవిధ్యభరిత జీవనరీతులకు నెలవు. జాతీయ భాషా వివాదంలో మొదటి నుంచి హిందీని ఆ భాషేతరులపై బలవంతంగా రుద్దుతున్న ఒక అన్య భాషగా చిత్రీకరిస్తున్నారు. తమ భావజాల వ్యాప్తి కొరకు ఒక దేశం–ఒకే విధానంను అనుసరిస్తున్న భారతీయ జనతా పార్టీకి హిందీ మాట్లాడే రాష్ట్రాలలో రాజకీయ అధిపత్యం ఉన్నది. హిందీయేతర రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రాబల్యం అంతగా లేదు. నూతన జాతీయ విద్యావిధానం క్రింద హిందీని వ్యూహాత్మకంగా అమలుపరుస్తున్నారనే బలమైన అభిప్రాయం నెలకొంటున్న నేపథ్యంలో మరాఠీ భాషా రాష్ట్రమైన మహారాష్ట్రలో హిందీ అమలు విషయమై ఉత్తర్వు జారీ చేయడం, ఉపసంహరించుకోవడం రెండూ జరిగాయి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం హిందీ అమలును పూర్తిగా రాజకీయ కోణం నుండి ఎదుర్కొంటూ బీజేపీని ఇరకాటంలో పెడుతోంది. తాము అధికారంలో ఉన్న మహారాష్ట్రలో సైతం హిందీకి వ్యతిరేకత రావడం బీజేపీ ప్రాబల్యానికి విఘాతమని చెప్పవచ్చు. అంత మాత్రాన హిందీ భాష వ్యాప్తికి బీజేపీ తన కృషిని విరమిస్తుందనుకోవడం పొరపాటు. అలాగని హిందీని వ్యతిరేకించడం కూడా పొరపాటే. ఒక సువిశాల దేశంలోని అనేక ప్రాంతాలలో నలుగురికి తెలిసే భాషను నెర్చుకోవడంలో తప్పేమీ లేదు. నేర్చుకోవాలి కూడా. పూర్తిగా అరబ్బి దేశమైన సౌదీ అరేబియా తమ విద్యార్ధులకు చైనీస్ భాషను బోధిస్తోంది. మహమ్మద్ రఫీ మధుర గీతాలను వినే మనం హిందీని తూర్పారపట్టడం ఏమిటి? దీన్ని మానుకోవాలి.
ఒక దేశం– ఒకే భాష అనేది ఒక విఫల ప్రయోగం. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత జార్జి బెర్నాడ్ షా వ్యాఖ్యానించినట్లుగా అమెరికా, బ్రిటన్ రెండూ ఆంగ్లం మాట్లాడే రాజ్యాలయినా ఒకే జాతికి చెందినవి కావు. అలాగని అరబ్బులు అందరిదీ ఒకే భాష, ఒకే సంస్కృతి అయినా 22 దేశాలుగా విడిపోయి ఉన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలు మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదం దాకా ఎన్నో ఘర్షణలు భాషతో ముడిపడి ఉన్నాయి. తెలుగు భాష ఒక్కటయినా, యాస అనేది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిందనేది మరిచిపోకూడదు. విభిన్న భాషలు, వివిధ సంస్కృతులు మన విశిష్టత. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశమే యావత్ ప్రపంచానికి మార్గదర్శి. భారతీయులు స్వదేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా తమ మాతృభాషతో పాటు భారతీయ అనుసంధాన భాషగా హిందీని స్వచ్ఛందంగా నేర్చుకోవడానికి ముందుకు రావాలి. సంకుచిత రాజకీయ కారణాలకు అతీతంగా జాతి నిర్మాణంలో ఈ భాషాబంధం బలపడాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఈ వార్తలు చదవండి:
అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..
యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం