Fertilizer Shortage India: ఎరువుల సరఫరాలో విఫలమవుతున్న పాలకులు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:27 AM
రాష్ట్రంలో ఎరువులు ముఖ్యంగా యూరియా, డీఏపీ అవసరానికి సరిపడా లభించటం లేదు.

రాష్ట్రంలో ఎరువులు ముఖ్యంగా యూరియా, డీఏపీ అవసరానికి సరిపడా లభించటం లేదు. మార్కెట్‌లో లభించినా అధిక ధరలతో పాటు వేరే ఎరువులు కొనాలనే ఒత్తిడిని రైతాంగం ఎదుర్కొంటున్నది. అందుకే పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవ పరిస్థితి ఇదైతే, రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ‘‘అవసరం మేరకు నిల్వలున్నాయ’’ని, మరోసారి ‘‘కేంద్రం నెలవారీగా కోటా ప్రకారం రాష్ట్రానికి పంపటం లేద’’ని ప్రకటిస్తున్నది. ఇలా రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు అందటం లేదనేది వాస్తవం. అందిన మేరకైనా ప్రభుత్వమే స్వయంగా, సక్రమంగా వాటిని రైతులకు అందించేలా చర్యలు చేపట్టలేకపోతున్నది. కారణాలు ఏమైనా, ఎరువులు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
ఖరీఫ్ సీజన్‌లో 16.70 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా. కేంద్ర ప్రభుత్వం వీటిని అందించటంలో జాప్యం చేస్తున్నది. ఇదే అదునుగా వ్యాపారులు రేటు పెంచి అమ్ముతున్నారు. 45 కిలోల యూరియా ఎరువు బస్తా సబ్సిడీ రేటు రూ.266.50 నుంచి రూ.268 వరకు ఉంది. దానికి రూ.300 నుంచి రూ.325 వరకు అమ్ముతున్నారు. ఎరువులు ఎక్కువ వాడితే దిగుబడి ఎక్కువ వస్తుందనే దురభిప్రాయంతో రైతాంగం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పించాలి. అడుగడుగునా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎరువులకిస్తున్న సబ్సిడీ రూ.1350 భారం తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఎరువుల జాప్యానికి ఇది కూడా ఓ కారణం. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని కలుపుకొని కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలను వ్యతిరేకిస్తూ, ఎరువులు నెలవారీ కోటా ప్రకారం రాష్ట్రానికి అందేలా పోరాడాలి. ఆ ఎరువులను రైతులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి.
– కెచ్చెల రంగారెడ్డి
అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIKUS) రాష్ట్ర అధ్యక్షులు