Share News

Operation Sindoor: చర్చ జరగాల్సిందే...

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:12 AM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న ఆపరేషన్‌ సిందూర్‌ మీద ప్రభుత్వం చర్చకు సిద్ధపడింది.

Operation Sindoor: చర్చ జరగాల్సిందే...

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మీద ప్రభుత్వం చర్చకు సిద్ధపడింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తన పర్యటనలు ముగించుకొని 26న స్వదేశానికి చేరుకున్నాక, 28న ఈ అంశంపై చర్చ జరగబోతున్నట్టు వార్తలు వింటున్నాం. దాదాపు పదహారు గంటల ప్రత్యేక చర్చ అనంతరం ప్రధాని సమాధానం ఇస్తారు. మూడురోజులపాటు పార్లమెంట్‌ ఉభయసభలూ స్తంభించిపోయిన నేపథ్యంలో, అధికారపక్షం తన వైఖరిని సడలించుకున్నందుకు సంతోషించాలి, అభినందించాలి.


బిహార్‌ ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌) మీదా, పహల్గాం ఉగ్రదాడి–ప్రతీకార ఆపరేషన్‌ సిందూర్‌ మీదా అధికారపక్షాన్ని చర్చకు దించాలని విపక్షాలు మూడు రోజులుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రతిష్ఠంభనకు తోడు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా కూడా ప్రభుత్వానికి జవాబు చెప్పుకోవాల్సిన కొత్త సమస్యగా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో, సిందూర్‌ మీద చర్చకు ప్రభుత్వం సిద్ధపడటం విపక్షాలతో ఘర్షణను చల్చార్చేందుకు ఉపకరిస్తుంది. సభ వెలుపల ఉభయపక్షాలూ ఎంత రాజకీయమైనా చేసుకోవచ్చును కానీ, దేశ పరువుప్రతిష్ఠలతో ముడిపడిన ఈ అంశం మీద సభ లోపల అర్థవంతమైన, విలువైన, లోతైన చర్చ జరగాలి. పహల్గాం, సిందూర్‌ రెండూ కూడా జవాబులేని అనేక ప్రశ్నలను మిగల్చాయి. పాలకులు చెప్పినదానిని నమ్ముతూ వచ్చిన దేశప్రజల్లో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యానాలు గందరగోళం కలిగించాయి. యుద్ధం ఆపడం, యుద్ధవిమానాలు కూలిపోవడం వంటి మాటలు అసహనాన్ని, ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో, అధికారపక్షాన్ని అవమానించడమో, నిలదీయడమో లక్ష్యంగా కాక చర్చ హుందాగా సాగేట్టు విపక్షం చూడాలి. యుద్ధం అన్నాక కష్టనష్టాలూ, ఎదురుదాడులు, ఉపసంహరణలూ అత్యంత సహజం. ప్రజలకు నిజాలు నిర్భయంగా చెప్పడానికి పార్లమెంట్‌ను మించిన పవిత్రక్షేత్రం మరొకటిలేదు.


సభలో రభస పూర్తిగా ఉపశమించాలంటే బిహార్‌ విషయంలోనూ ప్రభుత్వం దిగిరావలసిందే. ‘సర్‌’లో భాగంగా ఎన్యూమరేషన్‌ పత్రాల సమర్పణ గడువు ఇంకో రెండురోజుల్లో ముగియబోతున్నది. 98శాతం ప్రక్రియ పూర్తయిందని ఈసీ అంటోంది. ఆగస్టు ఒకటిన ప్రకటించబోయే ఓటర్ల ముసాయిదా జాబితాలో నుంచి ఎన్నికల సంఘం తొలగించబోతున్న పేర్లు బుధవారం నాటి అంచనాల ప్రకారం 56లక్షలు. చనిపోయినవారు 20 లక్షలు, శాశ్వతంగా వలసపోయినవారు 28 లక్షలు, పలుచోట్ల నమోదైనవారు 7 లక్షలు, ఆచూకీ తెలియనివారు లక్ష ఉన్నారట. రాష్ట్రం వెలుపల ఉన్నవారు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చునంటూ ఇస్తున్న అవకాశాన్ని, పొట్టకూటికోసం కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు వలసపోయినవారిలో ఎంతమంది వినియోగించుకోగలరో ఈసీకి తెలియదనుకోలేం. ప్రాథమిక పత్రాలుగా ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సూచనచేయడం వినా, ఈ ప్రక్రియలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఇష్టపడలేదు. ఈ మూడింటినీ ప్రామాణిక పత్రాలుగా ఆమోదించేది లేదని ఎన్నికల సంఘం వెనువెంటనే తాను సమర్పించిన అఫిడవిట్‌లో తేల్చేసింది. ఓటరు పౌరసత్వాన్ని ప్రశ్నించే, పరీక్షించే, రుజువులు కోరే హక్కు తనకు దఖలుపడి ఉన్నదని కూడా ఈసీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో, చట్టసభల్లో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెలిబుచ్చడంతో పాటు, బిహార్‌తో ఆరంభమై దేశమంతా విస్తరించబోతున్న ఈ కొత్త పౌరసత్వ పరీక్ష వెనుక ఉన్న రాజకీయలక్ష్యాలు, కుట్రలు, ప్రజాస్వామ్యానికి ఒనగూరే నష్టాలు ప్రజలకు తెలియచెప్పాలని విపక్షాలు ఆశించడం సహజం. ఇప్పుడు తొలగించబోతున్న దాదాపు అరకోటిమంది ఓటర్ల జాబితాతోనే గత రెండు దశాబ్దాల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు పలుమార్లు జరిగి, ప్రధాని మోదీనీ, నితీశ్‌కుమార్‌ను ప్రజలు ఎన్నుకున్నారని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. తన ఉనికినీ, ఓటుహక్కునూ నిరూపించుకోవాల్సిన అంతిమబాధ్యతను పూర్తిగా పౌరుడి నెత్తిమీదకు నెట్టిన ఈ ‘సర్‌’ ప్రక్రియ మీద పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ లోతైన చర్చ జరగడం అత్యంత అవశ్యం.

Updated Date - Jul 24 , 2025 | 12:12 AM