చీకటి గుహ
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:15 AM
ఎక్కడో, ఒక ‘పదం’ ఇంకా ‘మాట’గా మారలేక కన్నీటి అంచులో తడబడుతూనే ఉంది. ఇంతలో ఒక చెరిపేయబడ్డ వాక్యం గోడ మీద మళ్లీ రాయబడుతుంది.

ఎక్కడో, ఒక ‘పదం’
ఇంకా ‘మాట’గా మారలేక
కన్నీటి అంచులో తడబడుతూనే ఉంది.
ఇంతలో ఒక చెరిపేయబడ్డ వాక్యం
గోడ మీద మళ్లీ రాయబడుతుంది.
ఒక చిదిమేయబడ్డ కంఠం
గాలిని చీల్చుకుంటూ మళ్లీ మోగుతుంది.
అందరూ మౌనంగా నిలిచిన చోట
అసలు దాని మాట వినేవారెవరు?
ఆ వీధి చివర నిలిచి
ఈ ఇంటి నీడను తడిమేవారా?
గతపు ధూళిని దులిపి
కొత్త చరిత్రకు పాలు దాపేవారా?
ఇప్పుడీ శిథిల గృహం
తన నిప్పుల కణుపులు విప్పుకుని,
ఊరు విడిచి బయటికి రావాలని తపిస్తోంది,
ఎదురొచ్చే మనుషులెవరు?
ఈ భూమి
అన్నింటినీ
గుర్తుపెట్టుకుంటుంది.
కాలం గొంతులో ముసిరిన దుమ్మును,
గొంతు బిగిసిన అనుభవాలను,
అంతుచిక్కని కథనాలను,
అన్నింటిని
అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది.
గోడలపై చెదిరిన నినాదాలు,
గుర్తులేని చిహ్నాలు,
రక్తం తుడిచిన అక్షరాలు
ఇవన్నీ మరచిపోవడం ఎలా?
నిశ్శబ్దం రగిలి అగ్నిపర్వతమై
తన కన్నీటిని మరిగించినప్పుడు
ఈ నేల దాని రక్తస్మృతిని ఎలా మరిచిపోగలదు?
మనమంతా చూస్తూనే ఉన్నాం...
ఈ ఇంటి గుమ్మానికి
ఒక అమానవీయ తీర్పు
ఇంకా వేలాడుతూనే ఉంది!
ఒకప్పుడు
ఇక్కడెవరో గుండెను వదిలి వెళ్లిపోయారు
కాల తరంగంలో చిరిగిన తెరలా
ఇక్కడి చరిత్ర తుడిచివేయబడుతోంది
ఇప్పుడిది ఓ శూన్య పదకల్పన!
ఇక్కడ వాకిళ్ళు కన్నీళ్లను ఒడిసిపట్టాయి.
ఈడ గోడలు గాయాలను దాచుకున్నాయి,
తలుపుల వెనకాల
మలుపులు తిరిగిన సాలెగూడులున్నాయి!
ఒకప్పుడు
పసిపిల్లలు నవ్విన చోటు ఇది,
సూర్యోదయాన్ని తాకిన స్వప్నాల వేదిక ఇది.
కానీ ఇప్పుడు...
ఈ ఇల్లు ఓ చీకటి గుహ.
ఇక ఈ గడప దాటి ఎవరూ రారు!
వేణు ఊడుగుల
For Andhrapradesh News And Telugu News