BC Reservation In Telangana: తాత్కాలిక జీవోలతో బీసీలు మోసపోవద్దు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:37 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ప్రతిపాదన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ప్రతిపాదన – పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ‘285ఎ’ను సవరించి, స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం. ఇది ఒకవైపు రాజకీయంగా గర్వపడే ప్రకటనలా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనక ఉన్న చరిత్రను, న్యాయపరమైన పరిమితులను, కోర్టు తీర్పులను, గత అనుభవాల్ని బీసీ ప్రజలు, ప్రజాస్వామికవేత్తలు గమనించాల్సిన అవసరం ఉన్నది.
2018లో తెరపైకి వచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ ‘285ఎ’ అనే విభాగం అసలు లేనే లేదు. ఆ సంవత్సరం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396 ద్వారా బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించగా, హైకోర్టు విచారణ అనంతరం ఈ జీవోను రద్దు చేసింది. కారణం– మొత్తం రిజర్వేషన్లు 50శాతం సీలింగ్‌ను మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు (కృష్ణమూర్తి కేసు, 2010). దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తర్వాత అప్పీల్‌ను వెనక్కి తీసుకుంది. ఆ పరిస్థితుల్లో బీసీలకు 23శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్డినెన్స్ 2/2018ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆర్డినెన్సుకు కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే. కాబట్టి, ఆర్డినెన్సును శాశ్వతంగా చట్టంగా మార్చే ఉద్దేశంతో యాక్ట్ నెం.4/2019 ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ ‘285ఎ’ను చేర్చారు. ఇప్పడు ప్రభుత్వం మళ్లీ అదే సెక్షన్‌ను తొలగించి 42శాతం బీసీ రిజర్వేషన్‌ను జీవో ద్వారా అమలుపరచాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే ఇది సాంకేతికంగా సాధ్యమైనప్పటికీ న్యాయపరంగా నిలవదని గత అనుభవాలూ, న్యాయ పరిధిలోని నిపుణుల అభిప్రాయాలూ స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థలకు 73, 74 సవరణ ద్వారా 1992లో రాజ్యాంగ హోదా కల్పించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 243డి, 243టి చేర్చారు. మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలకు ఆర్టికల్ 243డి 1, టీ 1 కింద జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించారు. కానీ బీసీలకు ఆర్టికల్ 243డి 6, టీ 6 ప్రకారం రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి వదిలి వేశారు. అందువల్ల సుప్రీంకోర్టు 2010లో 50శాతం సీలింగ్‌ను విధించింది. మొత్తం రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి) 50 శాతాన్ని మించకూడదు అని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయి.
ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వగా 50శాతంలో మిగిలిన శాతాన్ని బీసీలకు ఇవ్వాలి. డెడికేటెడ్ కమిషన్ పెట్టాం, కులగణన చేశాం, బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై ఎంపిరికల్ డాటా సేకరించాం– కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానాలు తప్పు పట్టవని, జీవో ఇస్తే సరిపోతుందని కొందరు వాదిస్తున్నారు. ఈ విషయంలో బిహార్ అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి. బిహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా 2023లో కులగణన చేసి ఆ రిపోర్టును, కులాలవారీగా జనాభాను పబ్లిష్ చేసి రిజర్వేషన్లు 65శాతానికి పెంచింది. కానీ 50శాతం సీలింగ్ దాటిందనే ఉద్దేశంతో హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. మళ్లీ మనం అదే ప్రయత్నం తిరిగి చేయడం వృథా ప్రయాస తప్ప మరోటి కాదు. రాజకీయ ప్రయోజనం కోసం ఆర్డినెన్సుల/ జీవోల ఆట ఇది తొలిసారి కాదు. ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆర్డినెన్సు/ జీవో జారీ చేస్తోంది. తర్వాత అది కోర్టులో రద్దవుతోంది. ప్రజల్లో బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్నట్టు చూపించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనం. నిజంగా సెక్షన్ ‘285ఎ’ను సవరించి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించినా, అది కేవలం జీవో జారీకి సహాయపడే ఉపాయంగా ఉపయోగ పడుతుంది. కానీ కోర్టుల న్యాయ సమీక్షలో మళ్లీ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ. ఇందుకు చట్టపరమైన రక్షణ అవసరం. వాస్తవానికి బీసీలకు న్యాయంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే చట్టం చేసి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చటం ముఖ్యం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ఒక బిల్లును, స్థానిక సంస్థల్లో 42శాతం పెంచుతూ ఇంకో బిల్లును గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపింది. తక్షణం ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఈ బిల్లులను ఇప్పుడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలలో పాస్ అయ్యేలాగా కృషి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పిస్తే ఈ సమస్యకు శాశ్వతంగా ఒక పరిష్కారం లభిస్తుంది.
ఇందుకు తమిళనాడు ప్రభుత్వ ఉదాహరణ మన ముందు ఉన్నది. తమిళనాడులో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 69శాతం రిజర్వేషన్లను 1994లో 9వ షెడ్యూల్‌లో చేర్చింది. తెలంగాణ కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. పార్లమెంటులో చర్చించి, రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. ఇది కేవలం పంచాయతీరాజ్ చట్టానికే కాదు, అన్ని విద్యా ఉద్యోగాలకు కూడా వర్తించే శాశ్వత పరిష్కారం అవుతుంది.9వ షెడ్యూల్లో పెట్టిన చట్టాలను కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం మాకు ఉందని 2007లో సుప్రీంకోర్టు ఐఆర్ కోయెల్హో కేసులో అభిప్రాయపడింది. కేశవానంద భారతి కేసు అనగా 1973 నుంచి 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టం అయినా అది రాజ్యాంగం మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే సమీక్షించే అధికారం తమకు గలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే విధంగా జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో (2022) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కావు అని అభిప్రాయపడింది. కాబట్టి 9వ షెడ్యూల్లో చేర్చితే న్యాయ సమీక్ష చేసినా తప్పించుకోగలం. అదే విధంగా 9 షెడ్యూల్లో ఇప్పటివరకు సుమారు 284 చట్టాలు చేర్చారు. ఏ ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు ఇప్పటివరకు రద్దు చేయలేదు. కావున తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే మనకు రక్షణ.
జీవో జారీ చేసి తక్షణమే ఎలక్షన్ నోటిఫికేషన్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అనే వాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఇది వాస్తవం కాదు. మహారాష్ట్రలో 2018, 2020లో జరిగిన ఎన్నికల్ని 2021లో సుప్రీంకోర్టు ‘వికాస్ కిషన్‌రావు గవాలి కేసు’ కారరణంగా ఐదు జిల్లాలలో కొట్టివేయడమే కాకుండా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ లేదనే ఉద్దేశంతో బీసీలకు రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీ ప్రజలు మళ్లీ మోసపోకూడదు. తాత్కాలిక జీవోలు, ఆర్డినెన్సుల మీద ఆశలు పెట్టుకోవద్దు. రాజకీయాల కోసం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నాలను గమనించాలి. బీసీ హక్కులు, న్యాయబద్ధ రిజర్వేషన్ల కోసం ఊహలపై కాదు; రాజ్యాంగ పరిధిలో పోరాటం చేయాలి.
-టి. చిరంజీవులు ఐఏఎస్ (రిటైర్డ్) చైర్మన్,
బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం