Share News

నాకు నేనే గిఫ్ట్‌ ఇచ్చుకుంటాను

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:39 AM

సమాంతా హార్వే రాసిన ‘ఆర్బిటాల్’. 2024 బుకర్ ప్రైజ్ అందుకున్న రచన. సైన్స్ ఫిక్షన్‌ను ఇంత కవితాత్మకంగా రాయచ్చా అని అనిపించింది. ప్రముఖ హిందీ కవి, వినోద్ కుమార్ శుక్లా రాసిన...

నాకు నేనే గిఫ్ట్‌ ఇచ్చుకుంటాను

చదువు ముచ్చట

నాకు నేనే గిఫ్ట్‌ ఇచ్చుకుంటాను

ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?

సమాంతా హార్వే రాసిన ‘ఆర్బిటాల్’. 2024 బుకర్ ప్రైజ్ అందుకున్న రచన. సైన్స్ ఫిక్షన్‌ను ఇంత కవితాత్మకంగా రాయచ్చా అని అనిపించింది. ప్రముఖ హిందీ కవి, వినోద్ కుమార్ శుక్లా రాసిన ‘‘దూర్ సే అప్నా ఘర్ దేఖ్నా చాహియే’’ (దూరం నుంచి మన ఇంటిని చూసుకోవాలి) అన్న కవితను గుర్తు తెచ్చింది. అలానే, కార్ల్ సాగన్ రాసిన ‘ది పేల్ బ్లూ డాట్’ను కూడా!

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?

నాకు ఇరవై రెండేళ్ళు వచ్చే వరకూ స్కూలు, కాలేజీ పుస్తకాలు తప్పించి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. పదో తరగతిలో ‘బారిష్టర్ పార్వతీశం’ నాన్-డిటేయిల్‌గా ఉండేది. అదే ఏడాది పరీక్షల్లో కొత్త తరహా ప్రశ్నాపత్రంలో మామూలు ప్రశ్నలు కాకుండా, సృజనాత్మకతకి తావిచ్చే ‘‘మీరు పార్వతీశం స్థానంలో ఉంటే ఏం చేస్తారు?’’ లాంటి ప్రశ్నలు ప్రవేశపెట్టారు. నాకు కథలు రాయాలన్న ఆసక్తి అక్కడ నుంచే మొదలైందనుకుంటాను.


ఒకప్పటికీ ఇప్పటికీ మీరు చదివే పద్ధతి ఎలా మారింది?

పైన చెప్పినట్టు, నేను ఇరవై రెండేళ్ళ వరకూ పుస్తకాలు చదవలేదు. అందుకని అందరూ చిన్నగా ఉన్నప్పుడు చదివే సాహిత్యం నేను చదవలేదు. ఏవి చదవాలన్నది తోటి బ్లాగర్ల రెకమెండేషన్ల బట్టి నిర్ణయించుకునేదాన్ని. అది ఇది అని తేడా లేకుండా ఆసక్తి కలిగించే ప్రతి రచననూ చదివేదాన్ని.

ఇప్పుడు నేను చేస్తున్న పనులకు పనికొచ్చే పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. అనువాదాలు చేస్తున్నాను కాబట్టి, దేశ విభజన సాహిత్యం, తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎక్కువగా చదివాను. అలానే, నా ‘ఎలమి’ ప్రచురణలు సంస్థ నుంచి తీసుకురాబోయే అనువాదాల కోసం దేశీ, విదేశీ సాహిత్యాన్ని చదువుతున్నాను.

ఇక నాకోసం చదువుకునే పుస్తకాలను ఎక్కువగా ఆడియో రూపంలో వింటున్నాను. ఉర్దూ, కన్నడ, హిందీ భాషల పుస్తకాలు వినడం వల్ల నాకా భాషలపై పట్టు పెరుగుతూ వస్తోందని నా నమ్మకం.


మీరు బహుమానంగా అందుకున్న పుస్తకాల్లో బెస్ట్‌?

కువెంపు రాసిన ‘మలెగలల్లి మదుమగలు’ అనే నవలను కన్నడ రచయిత అబ్దుల్ రషీద్ బహూకరించారు. కన్నడం నేర్చుకోవడం, చదవడం పట్ల నేను చూపిస్తున్న శ్రద్ధాసక్తులను ఆయన గమనించి ఈ క్లాసిక్ చదవమని ఇవ్వడం బాగా అనిపించింది. ప్రతీ ఏడాదీ నాకు నేను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా నాకు ఇష్టమైన కార్టూనిస్టులు – గ్రాంట్ స్నైడర్, టామ్ గాల్డ్ – పుస్తకాలు ఇచ్చుకుంటాను.

మీరు తరచూ చేసే పుస్తక సమీక్షల గురించి చెప్పండి?

ఇంటర్నెట్‌లో విపరీతంగా సమాచారం (పుస్తకాలతో సహా) లభిస్తుంది. దానికి ఆదీ అంతం లేనట్టు ఉంటుంది. ఆ ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోకుండా, నిలకడగా ఉండడానికి నేను పాటించే సూత్రం: నాకున్న తీరిక సమయంలో 50శాతం కంటెంట్ కన్‍స్యూమ్ చేస్తే, 50శాతం నేను ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. ఆ బాలెన్స్ పాటించకపోతే, డూమ్ స్క్రోలింగ్‌కు పుస్తకాలు చదువుకుంటూ పోడానికి పెద్ద తేడా ఉండదు. అందుకే పుస్తకం చదివాక, దాని గురించి రాసుకోవడం నాకు ముఖ్యం.


రచన విషయంలో మీకు దొరికిన మంచి సలహా?

దీర్ఘకాలం రచనలు చేస్తూనే ఉండ డానికి కావాల్సిన వనరులు– డబ్బు, ఆరోగ్యం, తీరిక– సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టమని అక్కినేని కుటుంబరావు విలువైన సలహా ఇచ్చారు.

(పూర్ణిమ తమ్మిరెడ్డి రచయిత, అనువాదకురాలు, ప్రచురణకర్త. కథా సంపుటి– ‘ఎమోషనల్‌ ప్రెగ్నెన్సీ’; అనువాదాలు– మంటో ‘సియా హాషియే’, అమృతా ప్రీతమ్‌ ‘పంజరం’; నాన్‌ఫిక్షన్‌– ‘ఆన్‌లైన్‌ స్కాములు’ వెలువరించారు. ఓల్గా ‘పంపాతీరం’ నవలకు ఆమె ఇంగ్లీష్‌ అనువాదం త్వరలో రానుంది.)

ఈమెయిల్‌: purnimat07@gmail.com

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:39 AM